గురువారం 29 అక్టోబర్ 2020
Mulugu - Sep 17, 2020 , 03:59:27

జ్వరమే శాపమై.. మంచానికే పరిమితమై..

జ్వరమే శాపమై.. మంచానికే పరిమితమై..

  • కాళ్లు చచ్చుబడిన దైన్యం
  • చెట్టంత కొడుక్కు తల్లి సపర్యలు
  • ఆదుకోవాలని వేడుకోలు
  • డిగ్రీ చదువుతున్న అతడికి జ్వరమే శాపమైంది.. 

నడుము, కాళ్లు చచ్చుబడిపోయి మంచానికే పరిమి తమయ్యాడు.. చెట్టంత కొడుక్కు అన్నీ తానై ఆ తల్లి సపర్యలు చేస్తున్నది. వైద్యం కోసం సాయం చేయాలని వేనోళ్లా డుకుంటున్నది. 

- ములుగు రూరల్‌

నడుము, ములుగు మండలం మ ల్లంపల్లికి చెందిన మల్లికాంబ భర్త 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు కొడుకులను కూలీనాలీ చేసి పోషించుకుంటున్నది. పెద్ద కొడుకు దివ్యాంగుడు కాగా, చిన్న కొడుకు రంజిత్‌ హన్మకొండలోని కేడీసీలో డిగ్రీ చదువుతున్నాడు. రెండు నెలల క్రితం జ్వరం వచ్చింది. ప్రైవేట్‌ దవాఖానలో చూపించగా టైఫాయిడ్‌ అని చెప్పి మందులు ఇచ్చారు. అవి వాడుతుండగానే నడుము నొప్పి మొదలైంది. వేరే హాస్పిటల్‌కు వెళ్లగా డాక్టర్లు ఇంజిక్షన్‌ వేయడంతో నడుము, కాళ్లు చచ్చుబడిపోయాయి. అక్కడి వైద్యుడిని నిలదీసినా ప్రయోజనం లేదు. హన్మకొండ, హైదరాబాద్‌లోని దవాఖానల్లో రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించినా నయం కాలేదు. ఈ క్రమంలో  హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చూపించగా వెన్నుపూస నరం దెబ్బతిన్నదని, అనస్థీషియా పరీక్ష చేసిన తర్వాతే చికిత్స చేస్తామని వైద్యులు చెప్పారు. వారు 5 రోజులకు ఇంజిక్షన్లు రాశారు. ఒక్కో దాని ఖరీదు రూ. 2 వేల వరకు ఉంది. పూర్తి వైద్యానికి రూ. పది లక్షలు కావాలని డాక్టర్లు తెలిపారు. ఇప్పుడు దవాఖానకు పోయి వచ్చేందుకు కూడా ఇబ్బంది అవతున్నదని, వరంగల్‌లోని కాశీబుగ్గలో ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నట్లు మల్లికాంబ తెలిపింది. ఆసరా పింఛన్‌తోపాటు పెద్ద కొడక్కు వచ్చే వికలాంగ పింఛన్‌తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని చెప్పింది. దాతలు సహకరించి రంజిత్‌ వైద్య చికిత్స కోసం సాయం చేయాలని వేడుకుంటున్నది. ఆదుకునే వారు 939479268(గూగుల్‌పే, ఫోన్‌పే) లేదా అంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులోని ఖాతా నం. 7316 0736078, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఏపీజీవీ0005123, బ్రాంచి మల్లంపల్లి ద్వారా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.


logo