గురువారం 24 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 12, 2020 , 02:40:15

పాకాల కాల్వలను పునర్నిర్మించాలి

పాకాల కాల్వలను పునర్నిర్మించాలి

  • నర్సంపేటలో ఎస్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటు చేయాలి
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించిన సీఎం

నర్సంపేట, ఆగస్టు 11: పాకాల ఆయకట్టు కాల్వలు శిథిలమైనందున పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కాకతీయుల వారసత్వ సంపద అయిన పాకాలలో నాడు కాకతీయులు అద్భుత సాంకేతికతతో కాల్వలు తవ్వారని పెద్ది అన్నారు. నేడు అవి శిథిలమైనట్లు తెలిపారు. దీనివల్ల ఆయకట్టుకు సరిగా నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సీఎం ఆశీర్వాదంతో గోదావరి జలాలను పాకాలకు తరలించే ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్నారు. కొద్ది రోజుల్లో పాకాలకు గోదావరి జలాలు రానున్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో శాశ్వత ప్రతిపాదికన పాకాల కాల్వల పునర్నిర్మాణం చేయాలని కోరారు. నర్సంపేట నియోజకవర్గంలో ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్నందున ఎస్టీ రెసిడెన్సియల్‌ బాలురు, బాలికల పాఠశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని పెద్ది కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. పాకాల కాల్వల పునర్నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారన్నారు. పాకాల కాల్వల సమస్యలను ముఖ్యమంత్రి అదనపు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ స్మితా సబర్వాల్‌, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రజత్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సుదర్శన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.logo