శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 11, 2020 , 02:21:49

చికిత్స అందకుంటే ఇంతమంది చేరుతారా?

చికిత్స అందకుంటే ఇంతమంది చేరుతారా?

  • ఎంజీఎంలో ప్లాంట్‌ ఉండగా ఆక్సిజన్‌ కొరత ఎలా ఉంటుంది?
  • కొత్త జిల్లా కేంద్రాలకే వెంటిలేటర్లు రాగా ఎంజీఎంలో ఉండవా?
  • స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బందిని భర్తీ చేశాం
  • వైద్యుల భర్తీకి ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి
  • ‘నమస్తే’తో ఎంజీఎం సూపరింటెండెంట్‌ నాగార్జున్‌ రెడ్డి 

జనగామ, నమస్తేతెలంగాణ: ‘వైద్యులు, సిబ్బంది ప్రా ణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు. వారు చేసే పనిని మెచ్చుకోకపోయినా ఫర్వాలేదు.. కానీ, కించపరచవద్దు’ అని ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఓ పత్రికలో (నమస్తే తెలంగాణ కాదు) ఎంజీఎంపై ప్రచురితమైన కథనం పై స్పందిస్తూ ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. సదరు కథనం అసత్యమని, చిన్న జిల్లా కేంద్రాల్లోని దవాఖానలకు వెంటిలేటర్లు పంపిణీ చేయగా ఎంజీఎంలో ఎం దుకు ఉండవు ? అని ప్రశ్నించారు. ఎంజీఎంలో స్టాఫ్‌నర్సులు, నాలుగో తరగతి సిబ్బంది నియామకాలు పూర్తయ్యాయని, వైద్యుల నియామక ప్రక్రియ కూడా జరిగిందన్నారు. చాలాచోట్ల ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, ఎం పికైన వారు విధుల్లో చేరడమే తరువాయి అని చెప్పారు. 

మైరుగైన వైద్యం అందిస్తున్నాం..

కొవిడ్‌-19 విస్తరించిన నేపథ్యంలో ఉన్న వనరులతో ఎంజీఎంలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఎంజీఎంలో చేరిన వారికి ఉచితంగా మందులు, భోజన సదుపాయం కల్పిస్తున్నామని, వైద్య పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఆరేళ్ల క్రితం లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఎంజీఎం ఆవరణలో ఏర్పాటు చేశారని, సిలిండర్లు ఖాళీ అయితే పంపిణీ దారు అందుబాటులో లేని సమయంలో ఆక్సిజన్‌ కోసం కష్టాలు గతంలో ఉండేవని, కానీ, ప్లాంట్‌ ఏర్పాటుతో శాశ్వత పరిష్కారం లభించిందని వివరించారు. ఐసీసీయూ, ఐసీయూ, ఆర్‌ఐసీయూ, ఎన్‌ఐసీయూ, పీఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్‌ వంటి విభాగాలకు ఆక్సిజన్‌ సెంట్రలైజ్డ్‌ చేశారని, ప్లాంట్‌ నుంచి నేరుగా పైపుల ద్వారా ఆయా వార్డులకు ఆక్సిజన్‌ పంపిణీ అవుతుందని, సాధారణ, అత్యవసరం లేని వార్డులకు మాత్రం సిలిండర్లను ఉపయోగిస్తున్నామని వివరించారు.  

పదుల సంఖ్యలో వెంటిలేటర్లు

శ్వాస తీసుకోలేక అవస్థ పడే వ్యక్తికి వెంటిలేటర్ల ద్వారా కృత్రిమ శ్వాసనందిస్తూ చికిత్స చేస్తున్నామని, గతంలో ఎంజీఎంలో మూడు, నాలుగు వెంటిలేటర్లుండగా ఇప్పు డు పదుల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని చెప్పా రు. వెంటిలేటర్లతో చికిత్స అందించేందుకు  ప్రత్యేకంగా రెస్పిరేటివ్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను (ఆర్‌ఐసీయూ) గతంలోనే ఏర్పాటు చేశారని, కొవిడ్‌ సోకి అత్యవసరమైనవారికి ప్రత్యేక వార్డులో వెంటిలేటర్‌తో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఎంజీఎం లాంటి దవాఖానలకే పరిమితమైన వెంటిలేటర్లు, ఇప్పుడు చిన్న జిల్లాల్లోని వైద్యశాలల్లోనూ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.  

స్టాఫ్‌ నర్సుల నియామకాలు పూర్తి

ఏ రాష్ట్రంలోనూ జరుగనంత వేగంగా సిబ్బంది నియామకాలు పూర్తయ్యాయని, స్టాఫ్‌ నర్సులుగా ఎంపికైన వారు విధుల్లో చేరారని,  నాలుగో తరగతి ఉద్యోగులను నియమించామని తెలిపారు. వైద్యుల భర్తీ దాదాపు పూర్తయినట్లేనని నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ, ఇంట ర్వ్యూ ప్రక్రియ పూర్తయిందని, ఎంపికైన కొంత మందికి మెయిల్‌ ద్వారా సోమవారం ఆపాయింట్‌మెంట్‌ లెటర్లను అధికారులు పంపారని చెప్పారు. మరికొంతమందికి రెండు మూడు రోజుల్లో అపాయింట్‌మెంట్‌ లెటర్లను మెయిల్‌ చేయనున్నట్లు వివరించారు.  

కేస్‌షీట్‌ లేకుండా చికిత్స అవాస్తవం

ఓపీ తీసుకున్నాక వైద్యులు చూసి అడ్మిషన్‌ రాస్తారని, ఈ అడ్మిషన్‌ పుస్తకాన్నే కేస్‌షీట్‌ అంటారని సూపరింటెండెంట్‌ వివరించారు. కేస్‌షీట్‌లో రోగి వివరాలు, ఏ సమస్యతో బాధపడుతున్నాడు?, ఏయే వైద్య పరీక్షలు చేసుకోవాలి?, ఏయే మందులు, ఇంజిక్షన్లు వాడాలి?, ఎలాంటి ఆహారం తీసుకోవాలో వైద్యులు పేర్కొంటారని, దాని ప్ర కారమే మందులు, ఇంజిక్షన్లు ఇస్తారని, వైద్యపరీక్షలు చే యిస్తారని చెప్పారు. ఎలాంటి ఆహారం అం దించాలో డైట్‌ సిబ్బందికి సమాచారం చేరవేస్తామని, డాక్ట ర్‌ ఎప్పుడు ఆ రోగిని పరీక్షించినా ఆ కేస్‌షీట్‌ను చదివాకే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అలాంటిది కేస్‌షీట్‌ లేకుండా చికిత్సనందిస్తున్నారనడం అవాస్తవమని స్పష్టం చేవారు.

సిబ్బందిని తప్పుపట్టడం సరికాదు

ఈసీజీ పరీక్ష చేశాకే మరణించారా? లేదా అనేది వైద్యులు ధ్రువీకరిస్తారు. ఈసీజీలో స్ట్రేట్‌ లైన్‌ వచ్చేంత వరకు మరణాన్ని ధ్రువీకరించరు. కొన్ని సందర్భాల్లో రోగి వాడిన మందుల ప్రభావం, ఇతర శాస్త్రీయపరమైన కారణాలతో స్ట్రేట్‌ లైన్‌ రావడానికి సమయం పడుతుంది. ఒక్కోసారి గంటకు పైగా కూడా పడుతుంది. స్ట్రేట్‌ లైన్‌ వచ్చాకే అధికారికంగా వెల్లడిస్తారు. ఈ సమయంలో కొం త మంది నానా రాద్ధాంతం చేస్తారు. ఆ సమయంలో బం ధువులు వార్డు నుంచి బయటకు వెళ్లి తమవాళ్లకు ఫోన్లు చేసుకుంటారు. అంబులెన్స్‌ మాట్లాడుకుంటారు. ఆ సమయంలో మృతదేహం వద్ద ఎవరూ లేకుంటే సిబ్బందిని తప్పుపట్టడం సరైంది కాదు.  


logo