ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 11, 2020 , 02:21:48

రోజూ 250 మందికి కరోనా పరీక్షలు

రోజూ 250 మందికి కరోనా పరీక్షలు

  • మూడు కేంద్రాల్లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు
  • 18 కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌లు
  • ఇప్పటి వరకు 3700 మందికి పరీక్షలు,  494 పాజిటివ్‌ కేసులు
  • అందుబాటులో మందులు, రెమ్డిస్‌విర్‌ ఇంజక్షన్‌, బెడ్స్‌
  • ములుగు జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య

ములుగు, నమస్తేతెలంగాణ: ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న  సూచనలు, సలహాల మేరకు ములుగు ఏజెన్సీ  జిల్లాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వైద్య సేవలను అందిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య వెల్లడించారు.  జిల్లా వ్యాప్తంగా ఉన్న  అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కొవిడ్‌ వైరస్‌ నిర్ధారణకు ర్యాపిడ్‌ ఆంటిజెన్‌  పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని, త్వరలో ఏటూరునాగారం, వెంకటాపురం(నూగురు) కేంద్రాలలోను ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి అందుతున్న మందులను కరోనా పాజిటవ్‌ వచ్చిన వారికి సరిపడా అందిస్తున్నామని, ఇప్పటి వరకు మందుల కొరత లేదని తెలిపారు.

18 కేంద్రాల్లో పరీక్షలు

కరోనా వైరస్‌ నిర్ధారణకు  జిల్లాలోని 9 మండలాల పరిధిలో ఉన్న 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. ప్రతి కేంద్రంలో నలుగురు పారామెడికల్‌ సిబ్బంది చొప్పున 75 మంది వరకు ప్రతి రోజూ కరోనా వైరస్‌ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఆర్‌-పీసీఆర్‌ పరీక్షలను ఏటూరునాగారం, వెంకటాపురం పీహెచ్‌సీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

3700 మందికి కరోనా పరీక్షలు

జిల్లాలో ఇప్పటి వరకు 3700 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి తెలిపారు. ఇందులో 2900 ర్యాపిడ్‌ ఆంటిజెన్‌ పరీక్షలు కాగా 800 ఆర్‌టీ- పీసీఆర్‌ ద్వారా పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 494 మందికి  మాత్రమే కరోనా పాజిటివ్‌  రాగా ముగ్గురు మృత్యువాత  పడినట్లు తెలిపారు. కరోనా పాజటివ్‌ వచ్చిన వారికి తగిన మందులను అందిస్తున్నట్లు తెలిపారు. దవాఖానాల్లో మందుల కొరత లేదని తెలిపారు. జిల్లాలో రెమ్డిస్‌విర్‌ ఇంజక్షన్లు సైతం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

సరిపడా బెడ్స్‌..

జిల్లాలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సరిపడా బెడ్స్‌ అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు. రోగ లక్షణాలు ఉన్న వారికి ఐసోలేషన్‌ బెడ్స్‌ ములుగు ఏరియా దవాఖానలో 30, ఏటూరునాగారంలో వైటీసీలో  18 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎం దవాఖానాకు  పంపిస్తున్నట్లు తెలిపారు. రోగ లక్షణాలు కనిపించని, గృహ వసతులు లేని వారి కోసం ఇంచర్లలోని ట్రైబల్‌ వేల్ఫేర్‌ పాఠశాలలో 133 బెడ్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

స్టాఫ్‌ కొరత లేదు..

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తితో పాటు సీజనల్‌ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్‌ ఆదేశాల మేరకు  ఐసోలేషన్లలో సరిపడా  ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బంది, టెక్నిషియన్లను, పారిశుధ్య కార్మికులను తాత్కాలిక ప్రాతిపదికన  నియమించినట్లు తెలిపారు.  జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎలాంటి సమస్యలూ  లేకుండా  సిబ్బంది పని చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌తో ఒక్కరు  కూడా ఇబ్బంది పడకుండా నిత్యం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.



logo