శనివారం 26 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 09, 2020 , 02:40:56

ప్రకృతిలో మమేకమై..

ప్రకృతిలో మమేకమై..

ఆచార, వ్యవహారాలకు పెద్దపీట వేస్తున్న ఆదివాసీలు

ఆధునికత వైపు అడుగులు పడుతున్నా చెదరని సంస్కృతీసంప్రదాయాలు

అటవీ ఉత్పత్తుల ఆధారంగా మనుగడ

ఇప్పుడిప్పుడే వివిధ రంగాల్లో రాణింపు

నేడు ఆదివాసీ దినోత్సవం


అడవి ఒడిలో మమేకమై బతికే ఆదివాసీలు, తమ సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. ప్రతి చెట్టును, పుట్టను, గుట్టను, రాయిని, రప్పను దైవాలుగా భావించి ప్రకృతినే ఆరాధిస్తారు. ప్రస్తుతం అడవి నుంచి ఆధునికత వైపు అడుగులేస్తున్నా తమ ఆచార వ్యవహారాలకు మాత్రం ఎంతో ప్రాధాన్యమిస్తారు. వన ఉత్పత్తుల ఆధారంగా మనుగడ సాగిస్తూ ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచంవైపు చూస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయం, ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. - మంగపేట

 ప్రపంచానికి దూరంగా ఉన్న ఆదివాసీలు అడవికే అంకితమై జీవనం కొనసాగిస్తున్నారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనులు దొరకని నేపథ్యంలో అడవుల్లో లభించే వివిధ ఉత్పత్తులను సేకరించి, గ్రామాలకు తీసుకొచ్చి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. సీజన్ల వారీగా అడవుల్లో లభించే తేనె, తునికి, పాల, వెలగ పండ్లు, ఇప్పపూలు, చీపుర్లు, బుట్టలు, పుట్టగొడుగులు, బోడ కాకర కాయలు, ఇతర వన మూలికలను సేకరించి గ్రామాల్లో అమ్ముతుంటారు. వీరు సేకరించిన పలు వన ఉత్పత్తులను గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మార్కెటింగ్‌ చేసి ఆర్థిక స్వావలంబన చేకూరుస్తున్నారు. కాలానుగుణంగా ఇప్పుడిప్పుడే వ్యవసాయం, ఇతర వృత్తుల్లో ఆదివాసీలు రాణిస్తున్నా అటవీ ఉత్పత్తుల సేకరణను మాత్రం కొనసాగించడం విశేషం. ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నేపథ్యంలో మంగపేట మండలంలోని ఓ గొత్తికోయ గూడెం వాసులు అడవుల్లోని ఆకులనే మాస్కులుగా వాడి అధికారులనే ఆశ్చర్యపరిచారు. అడవుల ఆధారంగా మనుగడ సాగించే ఆదివాసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా చేయూతనందిస్తున్నది. మారుమూల ప్రాంతాల్లోనూ మౌలిక వసతులు కల్పిస్తూ, మెరుగైన విద్య, వైద్యం అందిస్తూ గిరిజనులకు అండగా నిలుస్తున్నది. యువతీ యువకులకు ఉపాధి మార్గం, మహిళల ఆర్థిక స్వావలంబనకు పరిశ్రమల ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నది. మంగపేట మండలంలో 25 పంచాయతీలుండగా దాదాపు అన్ని గ్రామాల్లో ఆదివాసీ గిరిజనులున్నారు. మరో వైపు అటవీ ప్రాంతాల్లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఆదివాసీలు 16 గూడేలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అడవి నుంచి ఇప్పుడిప్పుడే ఆధునికత వైపు దృష్టి సారిస్తున్నా అనాదిగా వస్తున్న తమ సంస్కృతీసంప్రదాయాలకు ఎంతోప్రాధాన్యమిస్తున్నారు. ఆదివాసీ గూడేల్లో జాతరలు, పండుగలు, పెళ్లిళ్లు, ఆహారపుటలవాట్లు ఇలా ప్రతిదీ వైవిధ్యమేనని చెప్పవచ్చు.

ఆకట్టుకునే గిరిజన జాతరలు

గిరిజన జాతరలు చాలా విశిష్టతను కలిగి ఉంటాయి. సమక్క-సారక్క, నాగులమ్మ, లక్ష్మీదేవర జాతరలను వారు సంప్రదాయబద్ధంగా కొనసాగిస్తున్నారు. జాతరల్లో గిరిజనులు చేసే పూజలు, నృత్యాలు, ఉత్సవాలు ఆద్యంతం గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.  ఆదివాసీల పండుగల్లో సామ కొత్తల/పొట్ట పండగకు ఎంతో ప్రాధాన్యముంది. యేటా మగ, పుబ్బ కార్తెలు ప్రవేశించినప్పుడు ఈ పండగను జరుపుకొంటారు. కొత్తగా పండిన సామలు, కొర్రలు, మక్కలు, వివిధ కూరగాయలు, కంకొడ్లతో వంటలు వండి, దైవానికి నైవేద్యం సమర్పించి, సంప్రదాయ పూజలు చేస్తారు. కొత్తల పండగ సందర్భంగా తొలి పంట దైవానికి సమర్పించనిదే తాము ముట్టుకోమని చెబుతుంటారు.

ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు : మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌ : ప్రకృతిని దైవంగా పూజిం చే ఆదివాసీలకు రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని  పిలుపునిచ్చారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ జాతరలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని, ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్య మంత్రి కేసీఆర్‌ అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా గిరిజన జాతరలకు దాదాపు రూ.కోటీ 25 లక్షలు ఖర్చు చేస్తున్నదన్నారు. కుంభ మేళాల సందర్భంలో ఆదివాసీలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నిరంతర కృషి చేస్తున్నారని చెప్పారు. అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి అందరికీ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆదివాసీ గిరిజనుల కోసం ఎక్కడా లేని విధంగా 180 గురుకులాలను ఏర్పాటు చేశామని చెప్పారు.  అభివృద్ధిలో ఆదివాసీలు ముందువరుసలో నిలవాలని ఆకాంక్షించారు.

ప్రకృతితో వీడదీయని అనుబంధం 


ఆదివాసీలకు అనాదినుంచీ అడవులతో అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతిలోని పంచభూతాల్లో మేము దైవత్వాన్ని ఆస్వాదిస్త్తూ, ఆరాధిస్తాం. ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ క్షేమంగా ఉంటుంది. ఇప్పుడంటే వివిధ మందులు అందుబాటులోకి వచ్చినయ్‌. పూర్వం రుషుల కాలం నుంచే ప్రకృతి ద్వారానే అవసరమైన మందులు లభించేవి. అడవుల్లో సుమారు 30 వేలకు పైగా ఔషధ గుణాలున్న చెట్లున్నయ్‌. ఆదివాసీలతో వీడని అనుబంధంగా ఉన్న వనాలను దైవంగా  భావించి సంరక్షించుకోవాల్సిన అవసరముంది.  -బాడిష రామక్రిష్ణస్వామి, శ్రీనాగులమ్మ జాతర ప్రధాన పూజారి


logo