శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 07, 2020 , 04:52:40

హరితహారం విజయవంతంగా సాగుతోంది

హరితహారం విజయవంతంగా సాగుతోంది

  •  వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

భూపాలపల్లి కలెక్టరేట్‌/ములుగు కలెక్టరేట్‌ , ఆగస్టు 6: కలెక్టర్ల ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణం, బీసీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. మంత్రి రాష్ట్ర ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణ అధికారి శోభతో కలిసి గురువారం కలెక్టర్లు, జిల్లా అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో హరితహారం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తుందని, ఇప్పటి వరకు 90 శాతానికిపైగా మొక్కల సంరక్షణ జరిగిందని అన్నారు.  

67 శాతం మొక్కలను నాటాం

కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కార్యక్రమం ద్వారా 67 శాతం మొక్కలను నాటడం జరిగిందని అన్నారు. జిల్లాలో జులై 4న అరగంట సమయంలో మూడు లక్షల 15 వేల మొక్కలను విజయవంతంగా నాటామని, 27న మెగా అవెన్యూ ప్లాంటేషన్‌ కార్యక్రమం ద్వారా గంట సమయంలో జిల్లాలో ని 254 కిలోమీటర్ల రహదారి పొడవునా లక్ష 5 వేల మొక్కలను రికార్డు స్థాయిలో నాటామని దీనిని లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేసేందుకు చర్యలు జరుగుతున్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో  మంకీ ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని, కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంతో పాటు భూపాలపల్లి పట్టణంలో యాదాద్రి మోడల్‌ చిట్టడివి నాటేందుకు చర్యలు చేపడతామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం, జిల్లా వ్యవసాయ అధికారి సత్యంబాబు, డివిజనల్‌ ఫారెస్టు అధికారి వజ్రరెడ్డి పాల్గొన్నారు. ములుగు జిల్లా నుంచి డీఆర్డీవో ఏ.పారిజాతం,డీపీవో వెంకయ్య,జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రయ అధికారి సంజీవరావు పాల్గొన్నారు.


logo