శనివారం 05 డిసెంబర్ 2020
Mulugu - Aug 07, 2020 , 04:11:19

నేడు భూపాలపల్లి మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

నేడు భూపాలపల్లి మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

అత్యధిక కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ వైపు

ములుగు, నమస్తేతెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికల కోసం గత నెల 11న ఉత్తర్వులను జారీ చేసింది. జూలై 24వరకు సభ్యుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు జయశంకర్‌ భూపాలపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య ప్రకటించి, దరఖాస్తులను  24వ తేదీ  సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించారు. 

17 దరఖాస్తులు

నూతన పురపాలక  మున్సిపాలిటి చట్టాన్ని అనుసరించి  మున్సిపాలిటీలో 4 కో ఆప్షన్‌ సభ్యులుంటారు. ఇద్దరు మైనారిటీ, ఇద్దరు జనరల్‌ సభ్యులను ఎన్నిక చేయాల్సి ఉంటుందని ఉత్తర్వులలో వెల్లడించారు.  మైనారిటీ సభ్యుల్లో ఒకరు తప్పని సరి మహిళా అభ్యర్థి ఉండాలి. ఇందు కోసం ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బుద్దిస్ట్‌, పార్సీలు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్‌ స్థానాలకు  పోటీ చేసేందుకు పంచాయతీ, మున్సిపాలిటీలో కనీసం ఐదేండ్లు పదవీ కాలం పూర్తి చేసిన ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌, వార్డు సభ్యులు అర్హులు. ఇందులో 17 మంది అభ్యర్థులు రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకొని బరిలో నిలిచారు. 2 మైనారిటీ స్థానాలకు ముగ్గురు పురుషులు , ఐదుగురు మహిళలు దరఖాస్తులను సమర్పించారు. జనరల్‌  స్థానాలకు  నలుగురు పురుషులు, ఐదుగురు మహిళలు దరఖాస్తు చేసుకొని బరిలో నిలిచారు.

జయశంకర్‌ భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 24 మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు  కాగా  మిగిలిన  ఆరుగురు కౌన్సిలర్లలో ముగ్గురు ఏఐబీఎఫ్‌, ఇద్దరు సీపీఐ, ఒకరు బీజేపీ కౌన్సిలర్లు  ఉన్నారు.  కోఆప్షన్‌ ఎన్నికలకు ఎక్స్‌ ఆఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్యెల్యే, ఎంపీ, జడ్పీ చైర్మన్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. 4 కోఆప్షన్‌ సభ్యులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నేడు ఎన్నిక..

భూపాలపల్లి మున్సిపాలిటీలో 4 కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం 11 గంటలకు సింగరేణి ఇల్లందు గెస్ట్‌ హౌస్‌లో ప్రత్యేక సమావేశంను నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య ప్రకటించారు. కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.