ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 04, 2020 , 09:09:31

‘పల్లెప్రగతి’తో మెరిసిన ములుగు జిల్లా

  ‘పల్లెప్రగతి’తో మెరిసిన ములుగు జిల్లా

  • పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రంలోనే రెండో స్థానం కైవసం
  •  అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో  అరుదైన గౌవరం
  •  ప్రజల భాగస్వామ్యంతో మెరుగుపడిన గ్రామాలు

ములుగు.. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో చివరిదైనా.. పరిశుభ్రతలో ఆదర్శంగా నిలిచి రాష్ట్రంలోనే ముందువరుసలో ఉంది. ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’తో మంచి మార్కులు (31/40) కొట్టేసింది. పాత, కొత్త కలెక్టర్ల పక్కా ప్రణాళిక, అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవ, ప్రజల చైతన్యం కలగలిపి పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. జిల్లాలో గత నెలలో నిర్వహించిన సర్వే ఆధారంగా ములుగుకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

- ములుగు


జిల్లాలోని 174 గ్రామ పంచాయతీలుండగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు పక్కాగా నిర్వహించారు. ముఖ్యంగా పారిశుధ్య పనుల కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేసిన పాలక వర్గాలు ప్రభుత్వ నిధులతో సిబ్బందిని నియమించారు. ఇటు అధికారుల ఆదేశాలను తూ.చ తప్పకుండా అమలుచేస్తూ ప్రతిరోజు ట్రాక్టర్లు, ట్రాలీలను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ఇటీవల గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ అధికంగా నిధులు మంజూరు చేయడంతో మరింత ఉత్సాహంగా పనులు చేస్తున్నారు.

సర్వేలో 40కి 31మార్కులు..

పల్లె ప్రగతి అమలు తీరును తెలుసుకునేందుకు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో మంచి మార్కులు పడ్డాయి. ఆకస్మిక తనిఖీ బృందాలు గత నెల జూలైలో క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. జూలై 2న గోవిందరావుపేట మండలంలోని మచ్చాపురం, లక్ష్మీపూర్‌ గ్రామాలను, 4న కన్నాయిగూడెం మండలం ఏటూరు, రాజన్నపేట, 6న వాజేడు మండలం నాగారం, పేరూరు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాయి. మొత్తం 40మార్కులకు గాను మచ్చాపూర్‌, రాజన్నపేటకు 32మార్కులు, లక్ష్మీపూర్‌కు 24, ఏటూరుకు 26, పేరూరుకు 31 మార్కులను కేటాయించి నాగారం గ్రామానికి అత్యధికంగా 39 మార్కులు వేశారు. ఇలా సగటున 31 మార్కులతో ములుగు జిల్లా రాష్ట్రంలోనే పరిశుభ్రమైన జిల్లాగా 2వ స్థానంలో నిలిచింది. ఏజెన్సీ ప్రాంతాలైన ఈ గ్రామాలన్నీ పారిశుధ్య నిర్వహణలో ముందు వరుసలో ఉండడం విశేషం.

అధికారుల చైతన్యంతో అరుదైన గౌరవం

పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు గ్రామాల్లో ఇటు కలెక్టర్‌ ఎస్‌ కృష్ణ ఆదిత్య, అప్పటి డీపీవో వెంకయ్య ప్రత్యేక చొరవ తీసున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీల కార్యదర్శులతోపాటు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను సైతం భాగస్వాములను చేయడంతో పారిశుధ్యం మెరుగుపడింది. ఎప్పటికప్పుడు పురోగతిని తెలుసుకునేందుకు కలెక్టర్‌, అధికారులతో ప్రతి రోజూ సెల్‌ కాన్ఫరెన్స్‌లు, ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అదే సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న వారికి నోటీసులకు జారీ చేయడం ద్వారా వారిలో మార్పు తీసుకొచ్చారు. ఇలా ప్రతి ఒక్కరు భాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల పల్లెలకు కొత్త రూపు వచ్చింది.

కలిసికట్టుగా పనిచేశాం..


ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా గ్రామస్తుల్లో చైతన్యం వచ్చింది. ఇది గ్రామస్తుల సహకారంతో సాధించిన అరుదైన గౌరవం. కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని గ్రామ ప్రజలు నిజం చేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం. గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించుకుంటాం. మా గ్రామాన్ని ఎంపిక చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.

- లావుడ్య స్వాతివాగ, సర్పంచ్‌, లక్ష్మీపురం

logo