ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 03, 2020 , 03:36:49

హామీ నెరవేర్చిన సీఎం కేసీఆర్‌

హామీ నెరవేర్చిన సీఎం కేసీఆర్‌

  • గోదావరి జలాలను నర్సంపేటకు  తెచ్చేందుకు నిధులు మంజూరు
  • పనులు పూర్తి చేయించడంలో పెద్ది చొరవ
  • రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రకాశ్‌
  • సుదర్శన్‌రెడ్డితో కలిసి రంగాయ, పాకాల ప్రాజెక్టు పనుల పరిశీలన

నర్సంపేట/ములుగు, ఆగస్టు02: ఉద్యమ కాలంలో సీఎం కేసీఆర్‌ నర్సంపేట ప్రాంతంలో రైతులు సాగునీటి కోసం పడుతున్న కష్టాలను చూసి గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తీసుకువస్తా నని హామీ ఇచ్చి నెరవేర్చారని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీ ప్రకాశ్‌ అన్నారు. ములుగు శివారులోని రంగాయ, పాకాల ప్రాజెక్టు పనులను ఆదివారం ఆయన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. దేవాదుల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ బంగారయ్యతో మాట్లాడి ప్రాజెక్టు నిర్మాణం తక్షణం పూర్తి చేయాలని కోరారు.

  ఈ సందర్భంగా ప్రకాశ్‌ మాట్లాడుతూ రెండున్నరేళ్ల కాలంలోనే ప్రాజెక్టులను పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. భూ సేకరణ, ప్రాజెక్టు నిర్మాణ పనులు చకచకా పూర్తి చేయించడంలో ఎమ్మెల్యే పెద్ది చొరవ తీసుకున్నారని తెలిపారు. నర్సంపేట ప్రాంత రైతాంగానికి రెండు పంటలకు సాగు నీరందించేలా సీఎం కేసీఆర్‌, సుదర్శన్‌రెడ్డి కృషి చేశారని అన్నారు. బీడు భూములకు సాగునీరిందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ మరో 15 రోజుల్లో రంగాయ పాకాల ప్రాజెక్టులో మోటర్లు బిగించే పనులు పూర్తవుతాయని అన్నారు. గత ఎండాకాలంలో రంగాయ ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ నిర్వహించగా, విజయవంతమైందని అన్నారు. పాకాల ప్రా జెక్టు పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. వచ్చే ఎండాకాలంలో నర్సంపేటలోని పాకాల, రంగాయ ఆయకట్టుకు  70 వేల ఎకరాలకు నీటిని అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఈఈ సాయిబాబ, డీఈ రాజు, మెగా ఏజెన్సీ కంపెనీ నిర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు.


logo