శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Aug 01, 2020 , 01:49:34

శ్వేత విప్లవం.. ఉపాధి మార్గం

శ్వేత విప్లవం.. ఉపాధి మార్గం

  • పాల ఉత్పత్తుల పెంపు, షెడ్యూల్డ్‌ కులాల జీవనోపాధికి ప్రభుత్వ ఊతం
  • ములుగు జిల్లాలో తుది దశకు మినీ డెయిరీల ఏర్పాటు
  • రూ.8.16కోట్లు విడుదల చేసిన సర్కారు  
  • 340మందికి లబ్ధి.. 60శాతం సబ్సిడీ
  • రెండు విడుతల్లో గేదెల పంపిణీ
  • పాలు పితికేందుకు సాంకేతిక శిక్షణ పూర్తి  

రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. షెడ్యూల్డ్‌ కులాల జీవనోపాధి కోసం ‘మినీ డెయిరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ’ ద్వారా పాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నది. ఈ మేరకు ములుగు జిల్లాకు రూ.8కోట్ల16లక్షలు విడుదల చేయగా మినీ డెయిరీల ఏర్పాటు తుది దశకు చేరింది.  

- ములుగు, నమస్తే తెలంగాణ 

  వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా షెడ్యూల్డ్‌ కులాలకు చెంది ఉండి కనీసం అరెకరం వ్యవసాయ భూమి గల వారిని ఎంపిక చేసి ఆర్థిక పరిపుష్టిని కలిగిచేందుకు ‘షెడ్యూల్డ్‌ కులాల సహకార అభివృద్ధి సంస్థ’ జిల్లాలో చేపట్టిన మినీ డెయిరీల ఏర్పాటు ప్రక్రియ చివరిదశకు చేరింది. ఎంపీడీవో, తహసీల్దార్‌, పశు వైద్యాధికారి, ఏపీఎం, బ్యాంకు మేనేజర్‌ సభ్యులుగా ఉన్న మండల స్థాయి స్క్రీనింగ్‌ కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలోని 9 మండలాల పరిధిలో 340 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారికి రూ.4లక్షల విలువజేసే నాలుగు పాడి గేదెలను అందించేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రణాళికలు వేశారు. ఇందులో 60శాతం సబ్సిడీ పోను, 40శాతం బ్యాంకు గ్యారెంటీతో చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు చేశారు. విజయ డెయిరీ, ఎస్సీ కార్పొరేషన్‌, లబ్ధిదారుల సమన్వయంతో సంఘాలు నెలకొల్పనున్నారు. వివిధ రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసి లబ్ధిదారులకు రెండు విడుతల్లో గేదెలు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు రూ.8కోట్ల16లక్షలు మంజూరు చేసింది. లబ్ధిదారు పొందిన రూ.4లక్షల్లో 60శాతం సబ్సిడీ (రూ.2లక్షల 40వేలు) పోను రూ.లక్షా 60వేలను మాత్రమే బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.  

   గ్రాసం పెంచుకోవాలని ఆదేశాలు

జిల్లాలో ఏర్పాటు కానున్న మినీ డెయిరీల్లో గేదెల పోషణ కోసం కావాల్సిన గ్రాసం పెంచుకోవాలని లబ్ధిదారులకు అధికారు లు ఆదేశాలు జారీ చేశారు. గేదెల పోషణ, ఆరోగ్యం, బీమా అంశాలను పశు సంవర్థక శాఖ పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. పశుసంవర్థక శాఖ అధికారులు ఇతర రాష్ర్టాలకు వెళ్లి స్వయంగా పరీక్షలు చేసి మొదటి విడుతలో రెండు, రెండో విడుతలో మరో రెండు గేదెల చొప్పున లబ్ధిదారులకు అందించనున్నారు.పాలు పితకడంలోనూ లబ్ధిదారులకు విజయ డెయిరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో శిక్షణ అందించారు. యంత్రాల సాయంతో పాలు పితికే విధానంపై శిక్షణ ఇచ్చారు. 

 గేదెల కొనుగోలుకు సన్నాహాలు 

జిల్లాలో మినీ డెయిరీల ఏర్పా టు ప్రక్రియ కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో వేగవంతం చేశాం. కలెక్టర్‌ సూచనలు, సలహాలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నాం. త్వరలోనే గేదెల కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.  

-తుల రవి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, ములుగు 

మండలాల వారీగా  లబ్ధిదారులు  

మండలం         సంఖ్య 

కన్నాయిగూడెం 37

వెంకటాపురం(నూ) 19

వాజేడు 17

ఏటూరునాగారం 17

వెంకటాపూర్‌ 73

గోవిందరావుపేట 30

ఎస్‌ఎస్‌ తాడ్వాయి 23

మంగపేట  60

ములుగు      64

మొత్తం        340


logo