బుధవారం 12 ఆగస్టు 2020
Mulugu - Jul 30, 2020 , 00:49:05

పాత భవనం.. కొత్తగా

పాత భవనం.. కొత్తగా

  • రూపురేఖలు మార్చిన ములుగు కలెక్టర్‌  కృష్ణ ఆదిత్య
  • n అక్కరకు రాదనుకున్న బంగ్లా.. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయ సముదాయం
  • n కొత్త హంగులతో త్వరలోనే ప్రారంభం
  • n ఐదు శాఖలకు అప్పగింత 
  • n అధికారులు, ప్రజల్లో హర్షం


ములుగు :  ఆ బంగ్లా పదిహేనేళ్లుగా ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా పడి ఉన్నది. ములుగు కలెక్టర్‌ చొరవతో ఇప్పుడు నూతన హంగులు అద్దుకొని అందంగా ముస్తాబైంది. అక్కరకు రాదనుకున్న భవనం, ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయ సముదాయంగా మారడంతో అటు అధికారులు, ఇటు జిల్లా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న ఈ భవనాన్ని కొన్నేళ్లుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో అది బూత్‌ బంగ్లాలా మారింది. ములుగు జిల్లాగా ఏర్పడిన అనంతరం కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. కిరాయికి ఉన్న కార్యాలయాలను శాశ్వత భవనాల్లోకి మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. ఈ క్రమంలో ఈ బంగ్లాను చూసి ప్రభుత్వ కార్యాలయాల నెలవుగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ తుల రవిని ప్రత్యేకాధికారిగా నియమించి పనులను దగ్గరుండి చూసుకునేలా చర్యలు చేపట్టారు. ప్రణాళిక ప్రకారం 95 శాతం పనులు పూర్తికాగా, త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇందులో ఐదు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ వెల్ఫేర్‌, సాంఘిక సంక్షేమం, మైనార్టీ, గనుల శాఖలు కొలువుదీరనున్నాయి. కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం పార్కింగ్‌ స్థలం, మరుగుదొడ్లను సైతం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ తన నిధుల నుంచి రూ. 11లక్షలు కేటాయించి ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ద్వారా పనులు పూర్తి చేయించారు.  

కలెక్టర్‌ చొరవతోనే నూతన శోభ 


ప్రభుత్వ కార్యాలయాలకు భారీగా కిరాయిలు చెల్లించే పరిస్థితులను గమనించిన కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, దూర దృష్టితో తీసుకున్న నిర్ణయంతోనే పురాతన భవనానికి కొత్త శోభ వచ్చింది. కలెక్టరేట్‌కు సమీపంలోనే ఈ కార్యాలయం ఉండడంతో అధికారులకు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఖర్చు చేసిన నిధులు ఐదు కార్యాలయాలకు ఒక సంవత్సరం ప్రైవేట్‌ భవనానికి చెల్లించిన కిరాయిలతో సమానం.  

- తుల రవి-ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, ములుగుlogo