గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Jul 28, 2020 , 02:15:57

ఉన్న‌త చ‌దువుకు ఆస‌రా..

ఉన్న‌త చ‌దువుకు ఆస‌రా..

  • n ఇక ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం
  • n డ్రాపౌట్స్‌ నివారణకు సర్కారు నిర్ణయం
  • n విద్యార్థులకు పోషకవిలువలతో కూడిన ఆహారం
  • n ఉమ్మడి జిల్లాలో సుమారు 25  వేల మందికి ప్రయోజనం
  • n తల్లిదండ్రుల్లో హర్షం

విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలంటే పట్టణాలు, మండల కేంద్రాల్లోని కాలేజీలకు రావాలి. ఇందుకోసం ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరి వచ్చే క్రమంలో మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లేదంటే మధ్యాహ్నం తినేందుకు ఇంటికి వెళ్లి మళ్లీ కళాశాలకు రావడం లేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి ఉన్నత చదువుకు ఆసరా అందించాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులకు కమ్మని భోజనం పెట్టనుండగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

- నెల్లికుదురు/పరకాల టౌన్‌/ అంబేద్కర్‌ సెంటర్‌/ ములుగు  

 ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సర్కారు అమలు చేస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళా శాలల విద్యార్థుల డ్రాపౌట్స్‌ను నివారించేందుకు మధ్యాహ్న భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం తోపాటు, వారికి పౌష్టికాహారాన్ని అందజేస్తూ సత్ఫలితాలను సాధించింది. దీంతోపాటు ప్రభుత్వ, డిగ్రీ కళాశాలల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తూ సా ధ్యాసాధ్యాలను పరిశీలించింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విపత్కర పరిస్థితుల్లోనూ ఈ ఏడాది నుంచే కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమం త్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఉదయం కళాశాలకు వచ్చి విద్యార్థులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లి తిరిగి రాకపోతుండడంతో డ్రాపౌట్స్‌ పెరిగి పోతున్నాయి. దీన్ని తగ్గించి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

బలోపేతం కానున్న ప్రభుత్వ కాలేజీలు

మధ్యాహ్న భోజన పథకంతో ప్రభుత్వ కళాశాలలు మరిం త బలోపేతం కానున్నాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఇంటర్‌, డిగ్రీ చదివే విద్యార్థులు కొందరు అర్ధాకలితో చదువులను కొనసాగించాల్సి వస్తుండగా, మరి కొందరు కాలేజీ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోతున్నారు. ఈ క్ర మంలో కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పేద విద్యార్థులకు వరం

ప్రభుత్వ కళాశాల్లో చదివే విద్యార్థులు చాలా వరకు పేద లే. వీరికి సర్కారు పాఠ్య పుస్తకాలను అందించడంతోపాటు స్కాలర్‌షిప్‌ వంటి సదుపాయాలు కల్పిస్తున్నది. అంతేకాకుం డా కరోనా వైరస్‌ నేపథ్యంలో టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులందరి నీ ప్రమోట్‌ చేయడంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరు గుతాయని అధ్యాపకులు పేర్కొంటున్నారు. మధ్యాహ్న భోజ నం గ్రామాల్లోని పేద విద్యార్థులకు వరంగా మారనుంది.

జిల్లాల వారీగా..

మహబూబాబాద్‌ జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్‌ క ళాశాలలో 4180 మంది, 4 డిగ్రీ కాలేజీల్లో 600 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో సుమారు 3000 మంది ఇంటర్‌, డిగ్రీ వి ద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందనుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఐదు జూనియర్‌ కళాశాలల్లో 511, డిగ్రీలో 501 మంది, ములుగు జిల్లాలో 4000 మంది జూనియర్‌, 600 మంది డిగ్రీ విద్యార్థులకు మేలు జరుగనుంది. జనగామ జి ల్లాలో 2190 మంది, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో సుమారు పది వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

విద్యార్థులకు ఎంతో మేలు

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు కలుగుతుంది. మధ్యాహ్న భో జన పథకం అమలు చేయడానికి ప్ర భుత్వం నిర్ణయించడం హర్షిం చదగిన విషయం. విద్యార్థులు, వారి తల్లిదం డ్రులు ఎంతగానో సంతోషిస్తారు. దీంతో కళాశాలల్లో డ్రాపౌ ట్స్‌ తగ్గడమే కాక ఉత్తీర్ణత, నమోదు శాతం పెరుగు తాయి.

- ఖాదర్‌వలీ ఆజాద్‌, జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి(డీఐఈవో), మహబూబాబాద్‌ logo