ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Jul 23, 2020 , 01:52:15

ప‌ల్లెలు స‌ల్లంగ‌..

ప‌ల్లెలు స‌ల్లంగ‌..

  • పట్టణాల్లోనే కొవిడ్‌ భయం
  • ఊర్లలో కరోనాపై బేఫికర్‌
  •  కానరాని మహమ్మారి ప్రభావం
  •  భౌతిక దూరం నడుమ సాధారణ జీవనం 
  •  ముఖానికి మాస్క్‌, స్వీయ నియంత్రణ  
  •  గ్రామాల్లో నిరాటంకంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు
  • సాగు బాటలో ఉత్సాహంగా రైతులు  
  • రోజువారీ పనుల్లో కూలీలు 
  •  ‘నమస్తే’ విజిట్‌లో ఆసక్తికర విషయాలు

రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో పట్టణవాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. మహమ్మారి దెబ్బకు వ్యాపార, వాణిజ్య సంస్థలు కుదేలై చేద్దామంటే పనుల్లేక కుటుంబాన్ని భారంగా ఎల్లదీయాల్సి వస్తున్నది. కానీ, పల్లెల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ‘నమస్తే బృందం’ బుధవారం ఫీల్డ్‌ విజిట్‌ చేయగా మహమ్మారిపై పట్నవాసుల్లో ఉన్నంత భయం, ఆందోళన పల్లెవాసుల్లో మచ్చుకైనా కనిపించలేదు. భౌతికదూరం పాటిస్తూ, ముఖానికి మాస్కులు, తువ్వాలలు కట్టుకుంటూ తగు జాగ్రత్తలతో ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. నూతనోత్సాహంతో రైతులు వ్యవసాయంలో బిజీ కాగా, కులవృత్తులవారు, ఇతర కూలీలు తమ దైనందిన జీవితాన్ని గడుపుతున్నారు. 

- ఎల్కతుర్తి/చెన్నారావుపేట/ములుగురూరల్‌/భూపాలపల్లిటౌన్‌/నెల్లికుదురు

అంతగనం భయంలేదు


కరోనా రోగం రోజురోజుకు ఎక్కువైతాందని తెలుసు. హైదరాబాద్‌, వరంగల్‌, నర్సంపేటల కేసులు బాగ పెరుగుతున్నయని టీవీల చెప్తాంటె రోజూ సూస్తున్న. దేవుని దయవల్ల మా ఊర్లె ఎవరికీ రోగం రాలె. అయినా మేం వేరే ఊర్లకు పోతలేం. మా ఊర్లెనే ఉన్న పని చేసుకుంటున్నం. లాక్‌డౌన్ల కరువు పనికి పోయినం. ఇప్పుడు ఎవుసం పనులు నడుస్తున్నయ్‌. రోజు మూడువందలు కూలి దొరుకుతాంది. వారం పది రోజుల సంది నాట్లేసేతందుకు పోతున్నం. దూరం దూరముండుకుంట పనులు చేస్కుంటున్నం. మొఖానికి తువ్వాలనో, కొంగో సుట్టుకుంటున్నం. మా ఊర్లెనైతే అంతగనం భయంలేదు. 

    -సింగిరెడ్డి రమ, ఖాదర్‌పేట, చెన్నారావుపేట మండలం

 సంబురంగా సాగు పనులుయాసంగి పండించిన పంటను అమ్ముకోగా వచ్చిన డబ్బు, ప్రభుత్వం అందించిన రైతుబంధు సొమ్ముతో పెంచికల్‌పేటలో రైతులు వానకాలం సాగు పనుల్లో బిజీగా కనిపించారు. సీఎం కేసీఆర్‌ సూచించినట్లుగానే ‘నియంత్రిత విధానం’లో పంటలు వేస్తున్నారు. కరోనాపై జాగ్రత్తలు పాటిస్తూనే ట్రాక్టర్లతో దున్నిస్తూ.. నాట్లు వేయిస్తూ.. కలుపు తీయిస్తున్నారు. కూలీలు మీటరున్నర దూరంలో ఉంటూ నాట్లు వేస్తున్నారు. పత్తి, ఇతర పంటల్లో కలుపు తీస్తున్నారు. ఖాదర్‌పేటలోనూ ఇదే తరహా దృశ్యాలు కనిపించాయి. ట్రాక్టర్లు, నాగళ్లతో రైతులు నారు మడులు దున్నుతూ కనిపించారు. 

ఎల్కతుర్తి/చెన్నారావుపేట/ములుగురూరల్‌/భూపాలపల్లిటౌన్‌/నెల్లికుదురు : రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో పట్టణవాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఏదేమైనా పట్నాలతో పోలిస్తే పల్లెల్లో వాతావరణం భిన్నంగా ఉన్నది. ఈ కరోనా కాలంలో పల్లె వాసుల జీవన విధానాన్ని పరిశీలించేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని పెంచికల్‌పేట, రూరల్‌ జిల్లాలోని ఖాదర్‌పేట, ములుగు జిల్లాలోని మల్లంపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గుడాడ్‌పల్లి, మహబూబాబాద్‌ జిల్లాలోని మునిగలవీడును బుధవారం ‘ఫీల్డ్‌ విజిట్‌' చేసింది. నగరం, పట్టణాలతో పోలిస్తే ఈ పల్లెల్లో ప్రశాంత వాతావరణం కనిపించింది. వైరస్‌పై ఒకింత ఆందోళన ఉన్నా, మొక్కవోని ధైర్యంతో గ్రామాలవారు ఎవరిపనుల్లో వారు నిమగ్నమై కనిపించారు. మరోవైపు పంచాయతీ పాలకవర్గాల ఆధ్వర్యంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు సజావుగా అమలవుతున్నాయి. యాసంగిలో పండించిన పంటలను అమ్ముకున్న రైతులు ఆడబ్బుతో పాటు, సర్కారు ఇచ్చిన పెట్టుబడి సాయంతో ఇప్పుడు వానకాలం పనుల్లో బిజీ అయ్యారు. ముఖానికి, తలకు తువ్వాలలు, మాస్కులు కట్టుకొని, భౌతిక దూరం పాటిస్తూనే పల్లె వాసులు తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. గృహ నిర్మాణ పనులు, వృత్తిపనులు యథావిధిగా నడుస్తున్నాయి. పారిశుధ్యం, హరితహారం కార్యక్రమాలు ఎప్పటిలానే చేపడుతున్నారు. పట్టణాలతో పోలిస్తే స్వగ్రామాల్లోనే భద్రంగా ఉండొచ్చని చాలా మంది తమతమ ఇళ్లకు చేరి ‘వర్క్‌ ఫ్రం హోం’ చేస్తున్నారు. 

నిరాటంకంగా అభివృద్ధి పనులు


ఉదయం 10గంటలకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటను ‘నమస్తే’ సందర్శించినప్పుడు గ్రామంలో వైకుంఠధామం, డంప్‌ యార్డు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు యథావిధిగా  కొనసాగుతున్నాయి. వైకుంఠధామ పనుల్లో మేస్త్రీలు, కూలీలు నిమగ్నమై కనిపించారు. మరోవైపు సీసీ రోడ్లు పోస్తున్నారు. హరితహారంలో భాగంగా పాఠశాల సమీపంలో రోడ్డుకు ఇరువైపులా కార్యదర్శి శ్రీనివాస్‌రావు, కారోబార్‌ మామిడి స్వామిరెడ్డి, స్థానికులు కలిసి మొక్కలు నాటుతున్నారు. నర్సరీలో గడ్డి తీయడం, మొక్కల సంరక్షణలో కూలీలు నిమగ్నమై కనిపించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేటను సందర్శించగా సర్పంచ్‌ అనుముల కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి నాసం వీరన్నలు డంపింగ్‌ యార్డు వద్ద డోజర్‌తో చదును పనులు చేయిస్తున్నారు. దాని పక్కనే వైకుంఠధామం పనులు  జరుగుతున్నాయి. గ్రామ రహదారిపై గుంతలు ఉన్న చోట్ల ట్రాక్టర్‌తో డస్ట్‌ పోయిస్తూ డోజర్‌తో చదును చేయిస్తున్నారు. మొక్కలు నాటేందుకు ప్రదేశాలను సిద్ధం చేస్తున్నారు. మురుగు కాలువల్లో చెత్తాచెదారం తొలగింపజేస్తున్నారు.

జీపీ వద్ద గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. ములుగు మండలం మల్లంపల్లిలో ఈ మధ్యే వైకుంఠధామం, డంప్‌యార్డు, తడి, పొడి చెత్త సేకరణ షెడ్ల పనులు పూర్తి చేశారు.ఆరో విడత హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటుతూ కనిపించారు. మాస్కు లేకుండా బయట తిరిగేవారికి పంచాయతీ ఆధ్వర్యంలో జరిమానా విధిస్తున్నారు. గ్రామంలో నేటి నుంచి వాణిజ్య, వ్యాపార సముదాయాలను ఉదయం 11గంటల వరకే నిర్వహించుకునేలా చర్యలు చేపట్టారు. ప్రతి దుకాణం ఉదయం 6 గంటలకు తీసి ఉదయం 11లోపు మూసివేయాలని తీర్మానించారు. ఇంటికి ఒకరిద్దరు చొప్పునే బయటకు వచ్చి సరుకులు కొనుగోలు చేయాలని ప్రచారం చేస్తున్నారు. ప్రతి గురువారం నిర్వహించే అంగడిని రద్దు చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గుడాడ్‌పల్లిలోనూ ఎవరి పనులు వారు సాఫీగా చేసుకోవడం కనిపించింది.  వ్యవసాయ పనుల్లో రైతులు, ఇంటి నిర్మాణ పనుల్లో మేస్త్రీలు, కూలీలు ఇలా వారివారి దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం సమయంలో గ్రామంలోని మినరల్‌ వాటర్‌ కేంద్రం నుంచి గ్రామస్తులు నీటిని తీసుకెళ్తూ కనిపించారు.

ఊరిలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే ప్రభుత్వ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని గ్రామానికి చెందిన జడ్పీ ఉపాధ్యక్షులు కళ్లెపు శోభ, రఘుపతిరావు, సర్పంచ్‌ ఉడుత లక్ష్మి, ఐలయ్య తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడును ‘విజిట్‌' చేయగా వానలు సమృద్ధిగా కురవడం, ధాన్యం డబ్బులు చేతికిరావడం, ఇటు పంట పెట్టుబడి డబ్బును కూడా ప్రభుత్వం అందించడంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా కనిపించారు. రైతులు, కూలీలు మాస్కులు ధరిస్తూ, భౌతికదూరం పాటిస్తూ పనులు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌, తదితర పట్టణాల నుంచి  చాలామంది స్వగ్రామానికి చేరుకొని సొంతింట్లో సేఫ్‌గా ఉంటున్నారు. 

ఎవరి పనుల్లో వారు..

ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరూ తమ తమ పనులు ఎలాంటి భయం లేకుండా చేసుకుంటూ కనిపించారు. గొర్రెల కాపరులు తువాలను మాస్కుగా కట్టుకొని గొర్రెలను మేపుతున్నారు. కులవృత్తులవారు తమ పనులను కొనసాగిస్తున్నారు. సెలూన్లలో తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. గృహ, ఇతర నిర్మాణాల పనులు సైతం యథావిధిగా సాగుతున్నాయి. పెంచికల్‌పేటలో మేస్త్రీ, కూలీ పనులకు కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట నుంచి భవన నిర్మాణ కార్మికులు వచ్చారు. ఇటు నెలనెలా ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లతో వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులు ఏరందీ లేకుండా తమకు ఉన్నంతో సరుకులు సమకూర్చుకుంటూ సంతోషంగా ఉంటున్నారు.

మాస్కు లేకుంటే రూ.1000 జరిమానా

పెంచికల్‌పేటలో ప్రజలంతా ఎవరి పనులు వారు చేసుకుంటూనే తప్పనిసరిగా మాస్కు ధరించాలని, లేకుం డా బయట తిరిగితే రూ.1000 జరిమానా విధిస్తామని సర్పంచ్‌ సామల జమున గ్రామంలో డప్పు చాటింపు చేయించారు. ఉదయం, సాయంత్రం హనుమాన్‌ ఆలయం వద్ద మైక్‌లో కరోనాపై జాగ్రత్తలు, మాస్కుల ఆవశ్యకతను పాటలు, మాటల రూపంలో జాగృతం చేస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్‌లో డ్రమ్ములు పెట్టి వారానికోసారి వీధుల వెంట సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. ఏదేమైనా పల్లె ప్రజలు కరోనా నియంత్రణ పద్ధతులు పాటిస్తూనే తమ పనుల్లో నిమగ్నం కావడం స్పష్టంగా కనిపించింది. ముఖానికి మాస్కులు, తువ్వాలలు, భౌతికదూరం తప్ప పల్లె ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం విశేషం.

ఓవైపు అదుపు.. మరోవైపు అభివృద్ధి

గ్రామంలో ఇంతవరకు కరోనా వ్యాప్తి లేదు. ఊరికి పట్టణాల నుంచి ఎవరు వచ్చినా వివరాలు సేకరిస్తున్నం. మాస్కులు తప్పకుండా ధరించేలా చూస్తున్నం. లేదంటే రూ.1000 జరిమానా విధిస్తామని డప్పు చాటింపు వేయిస్తూ, మైక్‌లో రోజూ చెప్పిస్తున్నం. అభివృద్ధి పనులకు ఎప్పటిలానే కొనసాగిస్తున్నం. డంప్‌ యార్డు, వైకుంఠధామం, ఇంకుడు గుంతల నిర్మాణం, హరితహారం కార్యక్రమాలు చేస్తున్నం. 

- సామల జమున, సురేశ్‌రెడ్డి, సర్పంచ్‌, పెంచికల్‌పేట, ఎల్కతుర్తి మండలం

స్వీయ నియంత్రణ, భౌతిక దూరం 

ఊరిలో ప్రజలు స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటిస్తున్నరు. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు పెట్టుకుంటున్నరు. రైతులు పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు వ్యవసాయ భూముల వద్దే పనులు చేసుకుంటున్నరు. 

-నాసం వీరన్న, పంచాయతీ కార్యదర్శి  ఖాదర్‌పేట, చెన్నారావుపేట మండలం

అభివృద్ధి పనులు సాఫీగా చేస్తున్నం

గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల పనులు సాఫీగా కొనసాగు తున్నయ్‌. ఏ రోజు కూడా పనులు నిలిచి పోలేదు. కరోనా ఉందని పనులు ఎప్పుడూ ఆపలేదు. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మా పనులు మేము గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది సహకారంతో చేస్తున్నం. 

-  ఏ కుమారస్వామి, సర్పంచ్‌, ఖాదర్‌పేట, చెన్నారావుపేట మండలం

 పకడ్బందీ చర్యలు 

కరోనా వైరస్‌ కట్టడి కోసం గ్రామంలో పకడ్బందీగా చర్యలు తీసుకున్నం. ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాం. జాగ్రత్తలు తీసుకుంటూనే అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నం. ప్రజలు కూడా మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటిస్తూ తమ పనులు తాము చేసుకుంటున్నరు. పట్టణాల్లో ఉన్నట్లు ఇక్కడ కరోనా భయం అంతగా లేదు.  

- నల్లాని నవీన్‌రావు, సర్పంచ్‌, మునిగలవీడు, నెల్లికుదురు మండలంlogo