గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Jul 19, 2020 , 03:08:23

మావోయిస్టుల ఆటలు ఇక్కడ సాగవు

మావోయిస్టుల ఆటలు ఇక్కడ సాగవు

  • వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం
  • సంఘ విద్రోహశక్తులపై అప్రమత్తంగా ఉండాలి
  • డీజీపీ మహేందర్‌ రెడ్డి 
  • ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల పోలీసు అధికారులతో సమీక్ష
  • నక్సల్స్‌ చర్యలను అరికట్టేందుకు సూచనలు

వెంకటాపురం(నూగూరు) జూలై 18 : మావోయిస్టుల ఆటలను తెలంగాణలో సాగనివ్వమని, వారి ఆగడాలకు పోలీసు శాఖ అడ్డుకట్ట వేస్తుందని డీజీపీ మహేందర్ర్రెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌లో ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలల పోలీసు అధికారులతో ఆయన శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సంఘ విద్రోహక శక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో తెలంగాణ ప్రజల కోపాగ్నికి గురైన మావోయిస్టులు తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లిపోయారన్నారు. అక్కడ కొన్నేళ్లు తలదాచుకొని మళ్లీ ఇప్పుడు తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మావోయిస్టుల అరాచకాలను తెలంగాణలో సాగనివ్వమని, వాటిని తిప్పికొట్టేందుకు పోలీసులు సన్నద్ధంగా ఉన్నారన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు అగ్రనేతలు విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని, తెలంగాణలోని కాంట్రాక్టర్లు, వ్యాపారులకు ఉత్తరాలు రాసి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారారన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని, ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతి ఊరిలో రహదారుల నిర్మాణం చేపట్టామని, రాష్ట్రంలో మావోయిస్టులు అశాంతి నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తావివ్వమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీజీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఐజీలు నాగిరెడ్డి, ప్రభాకర్‌రావు, నవీన్‌చంద్‌, ములుగు ఎస్పీ సంగ్రాం సింగ్‌ పాటిల్‌, ఏటూరునాగారం ఏఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, ములుగు ఏఎస్పీ సాయి చైతన్య, ములుగు, భూపాలపల్లి ఓఎస్డీలు సురేశ్‌ కుమార్‌, శోభన్‌కుమార్‌, వెంకటాపురం సీఐ శివప్రసాద్‌, సర్కిల్‌ పరిధి ఎస్‌ఐలు తిరుపతి, హరికృష్ణ, తిరుపతిరావు పాల్గొన్నారు.


logo