ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Jul 01, 2020 , 01:21:52

నాలుగు నెలలు 646 ప్రసవాలు

నాలుగు నెలలు 646 ప్రసవాలు

        ములుగు ప్రభుత్వ దవాఖాన వైద్యుల ఘనత

        సర్కారు వైద్యంపై ప్రజలకు భరోసా 

‘కాన్పుకురా తల్లి’ పథకానికి విశేష ఆదరణ  

రూ.కోటి నిధులతో కార్పొరేట్‌ స్థాయి వైద్యం 

ములుగు, జూన్‌ 30 : కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి   వైద్యులను నియమించి, మౌలిక వసతులు కల్పించారు. అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉండడంతో ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు వెళ్తున్నారు. ఈక్రమంలోనే ములుగు ప్రభుత్వ దవాఖాన వైద్యులు నాలుగు నెలల్లో 646 ప్రసవాలు చేసి రికార్డు సృష్టించారు. దీంతో కాన్పుకు రా తల్లి పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. అదేవిధంగా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య దవాఖాన అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రూ.కోటి నిధులు మంజూరు చేశారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 పడకలుగా ఉన్న ములుగు ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల స్థాయికి పెంచింది. నాలుగు నెలల కాలంలోనే 646 ప్రసవాలు చేసి వైద్యులు చరిత్ర సృష్టించారు. మార్చిలో 114, ఏప్రిల్‌లో 196, మేలో 206, జూన్‌లో 130 కాన్పులు చేశారు. ఇందులో 40 శాతం సిజేరియన్లు కాగా మిగిలినవి సాధారణ ప్రసవాలు జరిగాయి. దవాఖానకు వచ్చే గర్భిణులకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడంతోపాటు మాతాశిశు సంరక్షణకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అదేవిధంగా దవాఖానలో ప్రసవమైన మహిళలకు కేసీఆర్‌ కిట్లను సైతం ఎప్పటికప్పుడూ అందిస్తున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్ల పరిధిలోని మహిళలు అమ్మ ఒడి వాహనాల ద్వారా ప్రతి నెల జిల్లా దవాఖానకు వస్తున్నారు. వీరికి వైద్య పరీక్షలతోపాటు మందులను ఉచితంగా అందిస్తున్నారు. కాన్పు అయిన తర్వాత కేసీఆర్‌ కిట్‌ను అందించి  అమ్మ ఒడి వాహనంలో తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు. కలెక్టర్‌ ఎస్‌ కృష్ణ ఆదిత్య దవాఖానపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సర్కారు వైద్యంపై నమ్మకం ఏర్పడి కాన్పుకురా తల్లి పథకాన్ని ప్రజలు విస్తృతంగా ఆదరిస్తున్నారు. జిల్లా దవాఖానలో స్త్రీ వైద్య నిపుణులు, మత్తు, పిల్లలు, ఈఎన్‌టీ, ఎముకలు, మానసిక వైద్య నిపుణులు, జనరల్‌ ఫిజీషియన్‌, జనరల్‌ సర్జన్‌ మొత్తం 30 మంది వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజూ 200 నుంచి 300 మందికి అన్ని విభాగాల్లో ఓపీ సేవలను అందిస్తున్నారు. 

 రూ.కోటి నిధులతో అభివృద్ధి 

ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖానలో మరిన్ని వసతులను కల్పించేందుకు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య తన నిధుల నుంచి రూ.కోటి   మంజూరు చేశారు. ఆ నిధులతో రోగుల సహాయకులు వేచి ఉండేందుకు, వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక షెడ్లు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక గార్డెన్‌, సెంట్రల్‌ లైటింగ్‌ సైతం ఏర్పాటు చేశారు. రూ.20 లక్షలతో గర్భిణుల కోసం ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ మిషన్‌ను కొనుగోలు చేశారు. రక్త హీనతతో బాధపడే వారికి, అత్యవసర సమయంలో రోగులకు రక్తం అందించేందుకు ప్రత్యేక రక్తనిధిని సైతం ఏర్పాటు చేశారు. ఎల్లప్పుడూ 30 నుంచి 40 యూనిట్ల అన్ని రకాల గ్రూపులకు చెందిన రక్తాన్ని నిల్వ ఉంచుతున్నారు. ఎక్స్‌రే, స్కానింగ్‌, ఈసీజీ, డిజిటల్‌ బీపీ యంత్రం ద్వారా 24గంటల పాటు వైద్య సేవలను అందిస్తున్నారు. పురుగుల మందు సేవించిన వారిని సైతం రక్షించేందుకు వెంటిటేటర్లను అందుబాటులో ఉంచారు. కార్పొరేట్‌కు దీటుగా సర్కారు దవాఖానలో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. 


logo