బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Jul 01, 2020 , 01:23:00

కరోనాపై భయాందోళన వద్దు

కరోనాపై భయాందోళన వద్దు

 ప్రైమరీ కాంటాక్టులన్నీ గుర్తించాం 

 హరితహారాన్ని   విజయవంతం చేయాలి

 ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య 

ములుగు కలెక్టర్‌, జూన్‌30 : కరోనా వైరస్‌పై ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పాజిటివ్‌ కేసులన్నీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవేనని, కొత్తగా జిల్లా వాసులకు వచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైరస్‌ కట్టడికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పుకార్లను నమ్మి మనోవేదనకు గురికావొద్దని సూచించారు. ప్రస్తుతం వ్యాధి లక్షణాలు ఉన్న వారికి చికిత్స చేయిస్తున్నామని, అవి సైతం నెగటివ్‌ రిపోర్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. 

హరితహారాన్ని విజయవంతం చేయాలి 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడుత హరితహారాన్ని జిల్లా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని కలెక్టర్‌ పి లుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ఆవెన్యూ, మంకీఫుడ్‌కోర్టు,  అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్నారు. వాటికి రక్షణగా ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వైకుంఠధామాల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తూరు దేవునిగుట్ట దేవాలయం, నర్సాపూర్‌లోని చెన్నకేశవ ఆలయాలను సందర్శించి ప్రాముఖ్యతను తెలుసుకున్నానని అన్నారు. ఆలయాలకు 800 ఏళ్ల చరిత్ర ఉందని,  అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రైతుల కోసం కల్లాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సబ్సిడీని రైతులకు అందించేందుకు వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.  


logo