సోమవారం 06 జూలై 2020
Mulugu - Jun 22, 2020 , 01:22:06

క్షేత్రాల్లోనే కల్లాలు

క్షేత్రాల్లోనే కల్లాలు

  • సొంత భూముల్లో నిర్మాణానికి ప్రభుత్వ సాయం 
  • రైతుల స్థోమతను బట్టి మూడు రకాల ప్లాట్‌ఫాంలు
  • రూ.56వేలు, రూ.68 వేలు, రూ.85వేలతో డిజైన్‌
  • ధాన్యాన్ని ఆరబెట్టాలన్నా.. వర్షం వస్తే తడవకుండా కాపాడుకోవాలన్నా.. తూర్పార బట్టాలన్నా స్థలం లేకపోవడం, మట్టి కొట్టుకుపోయి దిగుబడుల నాణ్యత తగ్గిపోవడం, ఫలితంగా సరైన ధర రాకపోవడం వంటి సమస్యలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యాచరణ మొదలుపెట్టింది. రైతులు తమ సొంత భూముల్లోనే వినూత్నంగా కల్లాలు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, మిగతా వారికి 90శాతం సబ్సిడీ ఇవ్వనుంది.         

- మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ/దేవరుప్పుల

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ/దేవరుప్పుల : తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే సాగునీరు, ఉచిత కరంటు, పంట పెట్టుబడి, రైతుబీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టి అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇప్పుడు రైతులు తమ సొంత వ్యవసాయ భూముల్లో కల్లాలను నిర్మించుకునేందుకు మరో పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా రూ. 750 కోట్లతో లక్ష ప్లాట్‌ఫాంలు నిర్మించాలని సంకల్పించింది.

జనగామ జిల్లాకు రూ. 19.25 కోట్లు

జనగామ జిల్లాలో 2,961 కల్లాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.19.25 కోట్లు కేటాయించింది. ఇందులో బచ్చన్నపేట మండలానికి 274 కల్లాలు, చిల్పూరుకు 178, దేవరుప్పులకు 338, స్టేషన్‌ఘన్‌పూర్‌కు 190, జనగామకు 222, కొడకండ్లకు 222, లింగాలఘనపురానికి 222, నర్మెటకు 178, పాలకుర్తికి 379, రఘునాథపల్లికి 379, తరిగొప్పులకు 158, జఫర్‌గఢ్‌కు 221 మంజూరయ్యాయి. ధాన్యం ఆరబెట్టేందుకు, తూర్పారబట్టేందుకు కల్లం అవసరమైన ప్రతి రైతు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా, ఇతర రైతులకు 90 శాతం సబ్సిడీపై మంజూరు చేస్తారు. వీటిని రైతులు స్వయంగా కట్టుకునేందుకు అనుమతి ఉండగా, కట్టే స్థోమతలేని వారికి గ్రామాల్లోని స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా నిర్మిస్తారు. 10శాతం ఖర్చు భరించలేకుంటే పక్క రైతులతో సర్దుబాటు చేసుకొని సామూహికంగా నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు.  

నిర్మాణ స్వరూపం

రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో కల్లాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మూడు రకాల డిజైన్లు తయారుచేసింది. వీటిలో అనుకూలమైనదాన్ని ఎంచుకొని నిర్మించుకోవచ్చు. రూ.56వేలతో 50స్కేర్‌ మీటర్లతో 538 ఫీట్లు, రూ. 68 వేల ఖర్చుతో 60స్కేర్‌మీటర్లతో 645 ఫీట్లు, రూ. 85 వేల ఖర్చుతో 75స్కేర్‌మీటర్లతో 807 ఫీట్ల ప్లాట్‌ఫాం నిర్మించుకునేలా డిజైన్లు చేసింది.  

మహబూబాబాద్‌ జిల్లాకు 2,966 కల్లాలు, 

రూ.19.52 కోట్లు 

మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 2,966 కల్లాలు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. వీటికోసం ప్రభుత్వం రూ.19.52 కోట్లు కేటాయించింది. మండలం, గ్రామాల వారీగా కోటాను కేటాయించి, కల్లాలు తక్కువ ఉండి ఎక్కువ దరఖాస్తులు వచ్చిన చోట కమిటీ సభ్యులు అవసరాన్ని బట్టి డ్రా పద్ధతిన ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయాధికారులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోలు రైతుల ఎంపిక పనిలో నిమగ్నమయ్యారు. 

గ్రామాల వారీగా లక్ష్యాలు కేటాయిస్తాం

జిల్లా వ్యాప్తంగా 2,996 కల్లాలు నిర్మించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ముందుగా మండలాల వారీగా, తర్వాత గ్రామాల వారీగా లక్ష్యాలు కేటాయిస్తాం. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం రాయితీతో ప్రభుత్వమే కల్లాలు నిర్మిస్తుంది. బీసీ, ఇతర వర్గాల వారికి 90శాతం రాయితీ ఇస్తుంది. మిగతా 10శాతం వాటా రైతులు డీడీ రూపంలో చెల్లించాలి. దరఖాస్తులు ఎక్కువ వచ్చిన గ్రామాల్లో లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తాం.  

-విద్యాచందన, డీఆర్డీవో, మహబూబాబాద్‌ 

నాణ్యమైన దిగుబడులు చేతికి 

 రైతులు తమ పంటలను ఆరబెట్టేందుకు తిప్పలు పడుతున్నారు. కూలి రేట్లు పెరిగి ఆర్థికభారం పడుతున్నది. తమ భూముల్లోనే కల్లాలు నిర్మించుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుంది. అన్ని రకాల ధాన్యానికి కల్లాలు కావాల్సిందే. ఇక్కడే ఆరబెట్టడం వల్ల నాణ్యమైన ధాన్యం రాశులు చేతికొస్తాయి. ముఖ్యంగా మిరప ఆరబోస్తే నలు పెక్కకుండా తాజాగా ఉంటుంది. తేమశాతం లేకుండా ఉండి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అమ్ముకోవచ్చు. కల్లాలను ప్రభుత్వం సమకూర్చడం మంచి పరిణామం, రైతులంతా ముందుకు వచ్చి నిర్మించుకోవాలి.

- రాధిక, సహాయ సంచాలకులు, 

వ్యవసాయశాఖ, పాలకుర్తి డివిజన్‌


logo