గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Jun 22, 2020 , 01:18:09

పాఠాలు.. నెట్‌ఇంట

పాఠాలు.. నెట్‌ఇంట

  • లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలు కుదేలు
  • విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే తరగతులు
  • విరివిగా యాప్‌ల వినియోగం
  • ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ‘సాంకేతిక తెర’ 
  • టీచర్లకు ‘డిజిటల్‌'పై శిక్షణ 
  • మొబైల్‌, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌  
  • ఆర్థికభారమైనా పిల్లల కోసం కొంటున్న తల్లిదండ్రులు
  •  పాతఫోన్లకూ రిపేర్లు

లేవాలని లేకున్నా పొద్దున్నే లేచి.. అమ్మానాన్నల భయానికి ఆగమాగం తయారై.. పుస్తకాల సంచి భుజానేసుకొని.. అయితే సైకిల్‌పై.. లేదంటే నడిచి.. నిన్నమొన్నటిదాకా బస్సుల్లో దోస్తులతో కలిసి.. మొదటి గంట మోగకముందే బడి బాట పట్టిన విద్యార్థులు, కరోనా కారణంగా ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఊహించని విధంగా కొవిడ్‌-19 విరుచుకు పడడంతో విద్యావ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నది. సుమారు మూడున్నర నెలల నుంచి విద్యాసంస్థలు మూతపడి వార్షిక పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. ఈ నెలలోనే కొత్త విద్యాసంవత్సరం మొదలై, పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని సందిగ్ధం నెలకొంది. ఓ వైపు వైరస్‌ విజృంభిసున్నా.. విద్యార్థులు తరగతులను పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో పాఠశాల స్థాయిలో దాదాపు అన్ని  సంస్థలు 8నుంచి పదో తరగతివారికి ‘ఆన్‌లైన్‌' పాఠాలు మొదలుపెట్టాయి. ప్రైవేటు ఇంటర్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలు, నిట్‌ వంటి ఉన్నత సాంకేతిక విద్యాసంస్థలు సెమిస్టర్‌ విధానాన్ని ఇంటర్నెట్‌కు అనుసంధానించాయి. ఈ క్రమంలో కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా పిల్లల భవిష్యత్‌కు ఆన్‌లైన్‌ తరగతులు అనివార్యమని గుర్తించిన తల్లిదండ్రులు మొబైల్‌, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు కొనాల్సి వస్తున్నది.       - వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా.. కొత్త జీవన శైలిని తెచ్చిపెట్టింది. దూరభారాలు తగ్గించినా ఆర్థిక, మానసిక భారాన్ని మోపుతున్నది. ఆఫ్‌లైన్‌ జీవితాలను సైతం ఆన్‌లైన్‌లోకి నెట్టింది. ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానాన్ని అన్ని రంగాలకూ విస్తరింపజేస్తున్నది. మార్కెటింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ రంగాల నుంచి మొదలు అన్నింటినీ కుదిపేసింది. మాములుగా అయితే ఈపాటికి విద్యా సంవత్సరం ప్రారంభం కావాలి. కానీ కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇప్పుడప్పుడే అవకాశాలు కనిపించడం లేదు. ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ విద్యా విషయ పరిజ్ఞానానికి దూరం కాకుండా ఉండేందుకు దాదాపు అన్ని విద్యా సంస్థలూ ఆన్‌లైన్‌లో పాఠాలను మొదలుపెట్టాయి. తల్లిదండ్రులకు తమ బడ్జెట్‌లో మొబైల్‌ నిత్యసరుకైపోయింది. మొబైల్‌ రీచార్జ్‌లు గణనీయంగా పెరిగిపోతున్నాయి. కొత్త సెల్‌ఫోన్లు కొనాల్సిన అనివార్యత కనిపిస్తున్నది. విద్యార్థులందరికీ ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణతో మార్కెట్‌లో ట్యాబ్స్‌, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్ల ధరలు కూడా పిరమయ్యాయి. కొనే స్థోమత లేక పాతఫోన్లను రిపేర్‌ చేయించుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. నెట్‌"ఇంటి’లోనే చదువుల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది. 

ఆన్‌లైన్‌ తరగతుల ఆవశ్యకత 

కొవిడ్‌-19 నేపథ్యంలో విద్యా వ్యవస్థ ఊహించని విధంగా సంక్షోభంలో చిక్కుకున్నది. అయినా అనేక విద్యాసంస్థలు తమ విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాయి. పాఠశాల స్థాయిలో 8 నుంచి 10వ తరగతి వరకు ఆన్‌లైన్‌లోనే తరగతులు బోధిస్తున్నాయి.  అన్ని ప్రైవేట్‌ ఇంటర్‌ కళాశాలలు, ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు, నిట్‌ వంటి ఉన్నత సాంకేతిక విద్యాసంస్థలు సెమిస్టర్‌ విద్యా విధానాన్ని ఆన్‌లైన్‌కు అనుసంధానించాయి. ఇందుకోసం ఆనేక విధాలుగా ఆన్‌లైన్‌ వేదికలను ఉపయోగించుకుంటున్నాయి. తరగతి గదిలో హాయిగా  పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు, నేరుగా విని సందేహాలు నివృత్తి చేసుకునే విద్యార్థుల మధ్య ‘సాంకేతిక తెర’ పడింది. విద్యార్థులు తరగతి గది నుంచి ట్యాబ్‌కు, కంప్యూటర్‌కు, మొబైల్‌ ఫోన్‌కు మారాల్సి వచ్చింది.

సిబ్బందికి డిజిటల్‌ శిక్షణ


 కార్పొరేట్‌ విద్యాసంస్థలు డిజిటల్‌ ఎక్విప్‌మెంట్‌ను సమకూర్చుకుంటూ తమ విద్యార్థులకు సమర్థవంతంగా ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు డిజిటల్‌ శిక్షణ ఇప్పిస్తున్నాయి. ఈ-లెర్నింగ్‌ను రెగ్యులర్‌ తరగతి గది ఫార్మాట్‌కు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్సీఈఆర్టీ) సైతం 25 శాతం విద్యాబోధన ఆన్‌లైన్‌ ఫార్మాట్‌లోనే పూర్తిచేసుకోవాల్సిన అవసరముందని సూచనప్రాయంగా వెల్లడించింది. దీంతో విద్యా సంస్థల నిర్వాహకులు తమ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని డిజిటల్‌ క్లాస్‌రూంను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించేలా శిక్షణ అందిస్తున్నాయి.  

సబ్జెక్టులకు ప్రత్యేక యాప్‌లు

ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో సబ్జెక్టుల కోసం అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. జూమ్‌ యాప్‌ అన్నింటికన్నా ట్రెండింగ్‌లో ఉంది. దాదాపు అన్ని విద్యాసంస్థలూ ఈ యాప్‌నే వినియోగిస్తున్నాయి. ఇందులో చైనా వెర్షన్‌ కాకుండా అమెరికా వెర్షన్‌ను వాడుతున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ నేపథ్యంలో ఆన్‌లైన్‌ యాప్‌ల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(ఎల్‌ఎంఎస్‌) విభాగంలో జూమ్‌తో పాటు యూట్యూబ్‌ లింక్‌లు, గో టూ మీటింగ్‌, స్కైప్‌, వైబర్‌, జెట్సీమీట్‌, వీడియో కాన్ఫరెన్స్‌ వంటి యాప్‌లు సైతం విరివిగా రోల్‌ అవుతున్నాయి. మన విద్యా విధానంలో జూమ్‌, గో టూ మీటింగ్‌, స్కైప్‌,యాప్‌ల వినియోగం ఎక్కువ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గోటూ మీటింగ్‌, జూమ్‌ యాప్‌లో విద్యార్థులకు సెమిస్టర్‌ తరగతులు, అధ్యాపక సదస్సులు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు నిట్‌ ప్రత్యేకంగా లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(ఎల్‌ఎంఎస్‌) ను రూపొందించుకుంది. వర్చువల్‌ మీటింగ్‌ (త్రీడీ తెర) రూపంలో ఏర్పాటు చేసి హాస్టల్‌లోనే ఉండి చూసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. 

ప్రైవేట్‌ యాప్‌ పాఠాలు


ఆన్‌లైన్‌లో విద్యానందించే యాప్‌ల యూజర్లు కూడా భారీగా పెరిగారని మార్కెట్‌ స్పష్టం చేస్తున్నది. బైజూస్‌ వంటి యాప్‌లు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. రోజూ ఆన్‌లైన్‌ తరగతులతో పాటు పరీక్షలు, హోంవర్క్‌ చేయించడం వంటి విధానాలను యాప్‌లు నిర్వహిస్తున్నాయి. నిశ్చల్‌, వేదాంత్‌, విద్యాంకుల్‌, టాపర్‌ వంటి యాప్‌లకు వ్యూవర్స్‌ విపరీతంగా పెరిగారని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్కెట్‌లో దాదాపు 20 రకాల యాప్‌లు పాఠశాల స్థాయి విద్యార్థులతో పాటు మెడికల్‌ , ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. క్లాస్‌ రూమ్‌ విద్యావిధానానికి సమాంతరంగా ఆన్‌లైన్‌ విద్యను మార్కెట్‌ చేస్తున్నాయి. ఏడాదికి ప్యాకేజీ రూపంగా అమ్ముతున్నాయి.  

మొబైల్‌ మార్కెట్‌.. జిగేల్‌

కరోనా పుణ్యమా అని ఏ మార్కెట్‌ లేకున్నా ఆన్‌లైన్‌ మార్కెట్‌ మాత్రం రెండు సెల్‌ఫోన్లు ఆరు రీచార్జ్‌లుగా జిగేల్‌మంటున్నది. ఇంట్లో కూర్చొని తరగతులు వినేందుకు మొబైల్స్‌, ట్యాబ్స్‌, ల్యాప్‌టాప్‌ అవసరం పెరగడంతో తల్లిదండ్రులు ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్‌కు పోటెత్తుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు ఉన్న సరుకును అధిక మొత్తానికి అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. ట్యాబ్‌లు అసలే అందుబాటులో లేకపోగా, ఆన్‌లైన్‌లో తెప్పించుకుందామని ముందు బుక్‌ చేసుకున్నా తరువాత ‘సారీ..నో స్టాక్‌' అంటూ మెస్సేజ్‌లు వస్తున్నాయి. గతంలో డిస్ట్రిబ్యూటర్లు తమ వెంట పడేవారని, ఇప్పుడు డబ్బులు కట్టి వారి వెంట పడాల్సిన పరిస్థితి వచ్చిందని మొబైల్‌ షాపుల నిర్వాహకులు పేర్కొంటున్నారు. 

ఆన్‌లైన్‌ క్లాసెస్‌తో కొత్త గిరాకీ 

విద్యార్థుల ఆన్‌లైన్‌ క్లాసెస్‌తో మార్కెట్‌ కొత్తరకంగా మారింది. ప్రస్తుతం స్టాక్‌ లేదు. కానీ, చాలా మంది ట్యాబ్స్‌ అడుగుతున్నారు. ఆర్డర్‌ ఇచ్చినా వచ్చే పరిస్థితిలేదు. ల్యాప్‌టాప్‌లు కూడా బాగా అడుగుతున్నారు. ఈ సారి మహిళా సంఘాల వాళ్లు కూడా ట్యాబ్స్‌ బాగా కొన్నారు. లాక్‌డౌన్‌తో బయటి నుంచి స్టాక్‌ రావడం లేదు. మనదగ్గరున్న సరుకు సరిపోవడం లేదు. తల్లిదండ్రులు వచ్చి ఫోన్లు రిపేర్లు చేయించుకొని పోతున్నారు. 

-కొంగ రాము, మొబైల్‌ షాపు నిర్వాహకుడు 


ఇప్పుడు మేమే డిస్ట్రిబ్యూటర్ల వెంట

కరోనా వల్ల స్టాక్‌ స్ట్రక్‌ అయింది. మార్కెట్‌లో సరుకులేదు. రోజుకు దాదాపు 20 ఫోన్లు అమ్ముతున్నం. ఆన్‌లైన్‌ క్లాసెస్‌ పెట్టడం వల్ల గిరాకీ బాగా ఉన్నా అనుకున్న టైంలో స్టాక్‌ రావడం లేదు. కరోనా కన్నా ముందు డిస్ట్రిబ్యూటర్లు మా వెంట పడి ‘స్టాక్‌ కావాలా? స్టాక్‌ కావాలా’ అనేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి తారుమారైంది. మేం ఆర్డర్‌ ఇస్తే అంతరాదు..కొంత తగ్గించుకో అంటున్నారు. మేం పది ఆర్డరిస్తే ఒకటి రెండు ఇస్తున్నరు. ట్యాబ్‌లు అయితే అసలు రావడమే లేదు.  

-బీ. శ్రీనివాస్‌, మొబైల్‌ షాప్‌ నిర్వాహకుడు 


మనిషికో ఫోనంటే కష్టమే.. 

నా కొడుకు ఎంసెట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నడు. నా ఫోన్‌ వాడుతున్నడు. ఇప్పుడు నా బిడ్డకు ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్తున్నరు.  సెల్‌ కావాలని రోజూ అడుగుతున్నది. పైసల్లేకుంటే అప్పు తెచ్చి కొనాల్సి వస్తున్నది. రేపు కాలేజీ తీస్తే కొన్నఫోన్‌ మూలకు పడ్తది. కానీ తప్పదు పిల్లల కోసం కొనాలె. ఎంతైనా మనిషికో ఫోన్‌ కావాలంటే కష్టమే.

-బొంగు అశోక్‌యాదవ్‌  


ఉదయం ఆరు నుంచే క్లాసులు

మాకు ఆన్‌లైన్‌లో క్లాస్‌లు చెప్తున్నారు. ఇంట్లో ఉన్న ఫోన్‌ సపోర్ట్‌ చేయడం లేదు. మా డాడీ కొత్త ఫోన్‌ కొనిచ్చాడు. ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా క్లాసెస్‌, తరువాత ప్రాక్టీస్‌ చేయిస్తున్నరు. స్టడీ అవర్స్‌లో కూడా డౌట్స్‌ వస్తే చెబుతున్నారు. 

-అనిత, ఇంటర్‌  


logo