ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Jun 21, 2020 , 02:25:49

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

  • రూ.10లక్షల సరుకు
  • ముగ్గురు నిందితుల అరెస్టు
  • కారు, ఐదు సెల్‌ఫోన్లు, 
  • రూ.35వేలు స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన భూపాలపల్లి  ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రాం సింగ్‌ జీ పాటిల్‌ 

భూపాలపల్లి : రూ.10 లక్షల విలువగల నకిలీ పత్తి విత్తనాలను భూపాలపల్లి జిల్లా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందం పట్టుకున్నది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జిల్లా పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రాం సింగ్‌ జీ పాటిల్‌ వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా దోర్నిపాడు మండలం, గోవిందిన్నె గ్రామానికి చెందిన కర్నాటి కృష్ణారెడ్డి 15 ఏళ్లుగా నకిలీ విత్తనాలను తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ క్రమంలో అతడికి హన్మకొండకు చెందిన మర్రి రణధీర్‌ రెడ్డి అలియాస్‌ గణేశ్‌తో పరిచయమైంది. రణధీర్‌ రెడ్డి మిత్రుడు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌ మండలం గంగారానికి చెందిన నాగిరెడ్డి సంపత్‌ సహకారంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, మహారాష్ట్రలోని సిరోంచ  ప్రాంతా ల రైతులకు అమ్మేందుకు ఐ-20 కారులో కృష్ణారెడ్డి నకిలీ పత్తి విత్తనాలు పెట్టుకొని హన్మకొండ నుంచి కాళేశ్వరం, సిరోంచ ప్రాంతాలకు బయలుదేరారు. సమాచారం తెలిసిన వెంట నే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీం ఈనెల 19న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్‌ టీ జంక్షన్‌ వద్ద ఐ- 20 కారును తనిఖీ చేయగా రెండు గోనె సంచుల్లో 70 కిలోల విడి పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. వాటిని వ్యవసాయాధికారి పరిశీలించి నకిలీవని ధ్రువీకరించడంతో కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ 70 కిలోలే కాకుండా, హన్మకొండ బాలసముద్రంలోని రణధీర్‌రెడ్డికి చెందిన కారు షెడ్డులో మరో ఆరు బస్తాల్లో నకిలీ విత్తనాలున్నాయని తేలడంతో వాటినీ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలతో పాటు, కారు, రూ.35వేలు, ఐదు సెల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. పట్టుబడిన విత్తనాలు రూ.10లక్షల వరకు విలువ చేస్తాయని, కాళేశ్వరం, సిరోంచ ప్రాంతా ల్లో శ్రీధర్‌ అనే వ్యక్తి ద్వారా రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టేందుకు వెళ్తున్నారని గుర్తించారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు పంపుతామని ఇన్‌చార్జి ఎస్పీ తెలిపారు. ప్రత్యేక బృందంలో జిల్లా సీసీఎస్‌ సీఐ జీ మోహన్‌, భూపాలపల్లి ఏడీఏ సత్యంబాబు, ఎస్సై డీ విజయ్‌ కుమార్‌, ఏఎస్సై గోపాల్‌ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ ఉన్నారు. విలేకరుల సమావేశంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ సాయి రమణ, గణపురం ఎస్సై రాజన్‌ బాబు, ప్రత్యేక బృందం సభ్యులు పాల్గొన్నారు. 


logo