బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Jun 21, 2020 , 02:12:36

మౌలిక వసతుల కల్పనకు కృషి

మౌలిక వసతుల కల్పనకు కృషి

  • నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట, జూన్‌ 20 : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో నీటిపారుదల, పంచాయతీరాజ్‌, మత్స్య, పశుసంవర్ధక, ఆర్‌అండ్‌బీ శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్య నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో గ్రామాలను అనుసంధానం చేస్తూ ఇప్పటికే 80 శాతం నూతన రహదారులు నిర్మించామని, పెండింగ్‌ పనులను పూర్తి చేస్తామన్నారు. వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టాలని, ఎస్సారెస్పీ, పాకాల, రంగాయ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరిందించేలా చూడాలని అధికారులకు సూచించారు. గొలుసుకట్టు చెరువుల ప్రక్రియ, కాల్వల పూడికతీత, మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఫిష్‌పాండ్స్‌ కోసం అనుమతి ఇవ్వనున్నామని అన్నారు. ఉపాధిహామీ పథకంలో గొర్రెలు, పశువులకు షెడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఎంపీడీవోలు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. సమీక్షలో ఫిషరీస్‌ డీఎఫ్‌వో నరేశ్‌, డీఈలు ఇజ్జగిరి గిరి, అజయ్‌, రాంప్రసాద్‌, రమాదేవి, ఏఈలు, జెడ్పీ వైస్‌చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.


logo