శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Jun 21, 2020 , 02:06:06

తెలంగాణ ‘నవ’ యుగదర్శి

తెలంగాణ ‘నవ’ యుగదర్శి

నేడు ఆచార్య జయశంకర్‌ తొమ్మిదో వర్ధంతి

వరంగల్‌ ప్రతితినిధి-నమస్తే తెలంగాణ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ఈ లోకాన్ని భౌతికంగా వీడి అప్పుడే తొ మ్మిది వర్షాలు నిండాయి.  సార్‌ వెళ్లిపోయి అప్పుడే తొమ్మిదేళ్లు అయిందా? నమ్మలేకపోతున్నాం అని తెలంగాణ ప్రజ లు ఆయన స్మృతులను నెమరేసుకుంటున్నారు. ఆయన చెప్పిన పాఠాల్ని గుర్తుచేసుకుంటున్నారు.  తెలంగాణ కోసం తపించి..శ్వాసించి, ధ్యానించి స్వరాష్ట్రం కోసం కలలుగని ఆ కల నిజమయ్యేరోజు దాకా వేచి చూడకుండానే వెళ్లిపోయారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం జీవితకాలం అలుపెరుగని అక్షరపోరు సలిపిన మహనీయుడు. స్వరాష్ట్ర సాధన కోసం శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని రూపొందించి సర్వులూ దాన్ని ఆమోదించి పోరాట రూ పాన్ని ఎంచుకునేలా చేశారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో ఆగస్టు 6, 1934లో జన్మించి తుదిశ్వాస దాకా తెలంగాణనే కలగని 2011, జూన్‌ 21న కన్నుమూశారు. తన జీవితం మొత్తం తెలంగాణ వెనుకుబాటుతనాన్ని అధ్యయన శీలంతో అనుసరించీ ఆరాధించి తన చుట్టూ ఉన్నవాళ్లు ఆచరించే లా శాస్త్రీయతను రూపొందించారు. విద్యార్థి దశ నుంచి ఉపాధ్యాయుడిగా, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా, వైస్‌ చా న్స్‌లర్‌గా ఏ స్థాయిలో ఉన్నా తన కలను విడిచిపెట్టలేదు. 

కేసీఆర్‌ ఔర్‌ జయశంకర్‌ 

తెలంగాణ కోసమే ఉద్యమ పార్టీగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయన అత్యంత ప్రీతిపాత్రుడు. ఎవరెన్ని పోరాట రూపాలను ఎంచుకున్నా చివరికి రాజకీయ నిర్ణయంతోనే తెలంగాణ సిద్ధిస్తుందని బలంగా నమ్మి అందుకోసమే పుట్టిన పార్టీ పట్ల, ఆ పార్టీ అధినేత, ఉద్యమనాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆచరణ శీలతను, తెలంగాణ సాధించాలనే మొండిపట్టుదలను అందరికంటే ఎక్కువగా విశ్వసించిందీ ఆచార్య జయశంకరుడే. తెలంగాణ కోసం కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవుల్ని, మంత్రి పదవుల్ని రాజీనామా చేసిన ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సమాజంలోని అందరూ వ్యతిరేక నిర్ణయం అని ప్రకటించినా జయశంకర్‌ సార్‌ మాత్రం అదే అసలైన నిర్ణయంగా ప్రకటించారు. ఒకవైపు సీఎం కేసీఆర్‌ వ్యూహాలు, మరో వైపు జయశంకర్‌ సార్‌ ఆలోచనా విధానానికి ఏకరూపకత సాధించేందుకు ప్రధాన భూమిక పోషించింది ఆ ఇద్దరికీ ఉన్న తెలంగాణ సాధనపై ఉన్న కమిట్‌మెంట్‌. ఒకరంటే ఒకరికి అభిమానం, ఒకరి ఆచరణపై మరొకరికి నమ్మకం. అందువల్లే ఈ ఇద్దరూ తెలంగాణకు పూర్వజన్మబంధంగా నిలిచారు. 

సార్‌ స్మరణలో స్మృతివనం

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఊరూరా జయశంకర్‌ సంస్మరణ సభలు ఏర్పాటు చేసుకోనున్నాయి. బాలసముద్రంలోని జయశంకర్‌ స్మృతి వనం (ఏకశిల పార్కు)ను ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది. భవిష్యత్‌ తరాలు జయశంకర్‌ సార్‌ను సగర్వంగా కీర్తించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఆయన నాటిన ఉద్యమసాళ్లలో పసిడి సిరులు పండిస్తున్నారు. గోదారిని తెలంగాణ బీళ్లకు మళ్లించి కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నారు. 


logo