గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Jun 21, 2020 , 02:00:02

కుదిరితే కప్పు దవాచాయ్‌

కుదిరితే కప్పు దవాచాయ్‌

  • రోగ నిరోధక శక్తి పెంపునకు దివ్యౌషధం
  • సుస్తీ నుంచి ఉపశమనం
  • కరోనా నియంత్రణకు ఉపయోగం   
  • వన మూలికలతో తయారీ   
  • ధ్రువీకరించిన ‘ఆయుష్‌'  
  • ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు గుమ్మడవెల్లి శ్రీనివాస్‌ ఔదార్యం
  • లాక్‌డౌన్‌లో కుటుంబసభ్యులతో కలిసి మిశ్రమం తయారీ
  •  సొంతఖర్చుతో 20వేల చాయ్‌ ప్యాకెట్ల్లు ఉచితంగా పంపిణీ

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు.. కరోనా ఏమోగానీ అందరినీ ఆరోగ్యపరంగా ఆందోళనలోకి నెట్టేసింది. మామూలుగా తుమ్మినా.. దగ్గినా.. గొంతు నొచ్చినా.. తలనొచ్చినా ‘మహమ్మారి అంటుకున్నదేమో’ అన్న భయమే లోలోపల పట్టి పీడిస్తున్నది. వైరస్‌ను నివారించాలన్నా, తట్టుకోవాలన్నా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్న సూచనలు మొదటినుంచీ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జనుల ఆలోచనలు కూడా ‘ఇమ్యూనిటీ’ చుట్టే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఆయుర్వేద వైద్యుడు తన మెదడుకు పదునుపెట్టాడు. ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రకృతి నుంచి లభించే మూలికలతో మిశ్రమాన్ని తయారు చేసి ‘దవాచాయ్‌'ని అందుబాటులోకి తెచ్చాడు. సొంత ఖర్చులతో లాక్‌డౌన్‌లోనే కుటుంబసభ్యుల సహకారంతో 20వేల చాయ్‌ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశాడు.  

తొర్రూరు : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడి కోసం ఇప్పటికీ మందు అందుబాటులోకి రాలేదు. అది ఎప్పుడు వస్తుందో కూడా స్పష్టత లేదు. ఓవైపు రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ప్రజలను, పాలకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైరస్‌ సోకిన అనేక మంది సాధారణ వైద్యంతోనే బాగవుతున్నారు. ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందో వారు కరోనాను దీటుగా ఎదుర్కోగలుగుతున్నారు. ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తీసుకుంటే కరోనా కోరల్లో చిక్కుకున్న వారుకూడా హోంక్వారంటైన్‌లో ఉండి వారం పది రోజుల్లో సాధారణ స్థితికి రావచ్చని అనేక పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. కరోనా విరుగుడుకు మాస్క్‌ల వినియోగం, భౌతికదూరం పాటించడమే ప్రధానమని చెబుతున్నా ఏదో ఒక రూపంలో వైరస్‌ సోకితే ఆరోగ్యంగా ఉన్న వారు తట్టుకొని నిలబడే పరిస్థితులున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు పౌష్టికాహారం తినాలని, ఆయుర్వేద మూలాలున్న పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ప్రతి వంటగదీ ఒక వైద్యశాలే..

మనం తినే ఆహారంలో ఉపయోగించే పదార్థాలన్నీ ఆయుర్వేదంతో ముడిపడి ఉన్నవే. అందుకే ప్రతి వంటగదీ ఒక వైద్యశాలే. ఇప్పటికీ మనదేశంలో కరోనా వ్యాప్తి, మరణాల తీరు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే తక్కువే ఉందంటే ఆది మన ఆహార ఆలవాట్లే కారణమని విదేశీ శాస్త్రవేత్తలు సైతం ప్రకటిస్తున్నారు. ఈ కోవలోనే శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తూ తెల్ల రక్త కణాలను ఉత్తేజ పరిచి రోగ నిరోధక శక్తి పెరిగేలా ‘ఆయుష్‌' ప్రతిపాదించిన మూలికలు, పదార్థాలతో ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు గుమ్మడవెల్లి శ్రీనివాస్‌ ‘దవాచాయ్‌'ని అందుబాటులోకి తెచ్చారు. మనం నిత్యం తాగే టీకి బదులు దీన్ని సేవిస్తే కరోనాను అరికట్టవచ్చని, ఒకవేళ సోకినా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. 

టీ, కాఫీకి బానిసలు

రోజూ ఉదయం లేవగానే, పనిచేసే సమయాల్లో, సాయంత్రం సమయాల్లో కొందరికి పడుకునే ముందు కూడా టీ, కాఫీ తాగడం అలవాటుగా ఉంటుంది. తేయాకులో 60 నుంచి 70శాతం, గ్రీన్‌ టీలో 50 నుంచి 60శాతం కెఫిన్‌ ఉంటుంది. దీంతో పాటు థియోబ్రోమిన్‌, థియోఫైలిన్‌ రసాయనాలు ఉండడంతో చాయ్‌, కాఫీని తాగేవారు వాటికి ఒకరకంగా బానిసలవుతున్నారు. తేయాకు తోటల్లో కలుపు నివారణ కోసం ైగ్లెఫోసేట్‌ మందును విపరీతంగా వినియోగిస్తుంటారు. దీంతో అది మెల్లగా టీ, కాఫీ ద్వారా మన శరీరంలోకి వెళ్లి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నది. వీటిని తాగడం బదులు శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే వన మూలికలతో తయారు చేసిన దవాచాయ్‌ వినియోగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని డాక్టర్‌ శ్రీనివాస్‌ సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తి కోసం యాంటీ బాడీస్‌ను పెంచుకోగలిగితే మనం ఇంట్లోనే ఉండి కొవిడ్‌ను జయించవచ్చని, దీంతో దవాఖానలు, వ్యవస్థపైనా ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. 

దవాఛాయ్‌లో వాడే మూలికలు

ప్రకృతి సిద్ధంగా మన ఇంటి పరిసరాల్లో పెరిగే రకరకాల మొక్కలు, వన మూలికలు, ఇంట్లో వంట కోసం వాడే పదార్థాలతోనే దవాచాయ్‌ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో అత్యంత ప్రభావింతంగా పనిచేసే వన మూలికలైన ఆశ్వగంధ, శతావరి, నేలవేము, నేల ఉసిరి, తిప్పతీగ, పచ్చిపసుపు, కస్తూరి పసుపు, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తేచపత్ర, వట్టివేళ్లు, అల్లం, సుగంధిపాల, పుదీన, మంజిష్ట, వాతనారాయణ, చండ్ర, శ్రీగంధం, శతావరి, అర్జున వంటి వన మూలికలతో మిశ్రమాన్ని తయారు చేస్తారు. గ్రాము మిశ్రమాన్ని 200 మిల్లీ లీటర్ల నీటిలో వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. దీన్ని వడగట్టి కొద్ది మోతాదులో బెల్లం కలుపుకొని ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని తాగే ముందు కొద్దిగా నిమ్మరసం కలుపుకొంటే బాగుంటుంది. ఈ వన మూలికలన్నీ ప్రతి గ్రామంలో, ప్రతి చేను, చెలకల్లో గట్లపైన పెరుగుతుంటాయి. 

అశ్వగంధ: దీన్ని తెలంగాణలో పెన్నేరుగడ్డి అంటారు. ఇది వంకాయ జాతికి చెందింది. బహువార్షిక మొక్క. దీని వేరు దుంపల్లో లభించే పదార్థం శరీరంలో నాడీ మండలాన్ని ఉత్తేజితం చేస్తుంది. ఈ మొక్కపై కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సీసీఏఆర్‌ఎఎస్‌ లాంటి సంస్థలు ప్రయోగాలు చేసి కొవిడ్‌-19ను నివారించడంలో ఎంతో ఉపకరిస్తుందని సంతృప్తి వ్యక్తం చేశాయి. 


నేల ఉసిరి : ఇది ఒక ఫీటు నుంచి 3 ఫీట్లు పెరిగే ఏక వార్షిక మొక్క. ప్రతి ఊరిలోనూ అరుగుల పక్కన పెరుగుతుంది. వైరస్‌లను నియంత్రించే అత్యంత శక్తిమంతమైన అర్కిలాయిడ్‌లు దీంట్లో ఉంటాయి. ఇది లివర్‌ వ్యాధుల నివారణకు బాగా పనిచేస్తుంది. అన్ని రకాల ట్యాక్సిన్‌లను శరీరంలోంచి బయటకు పంపేశక్తి ఇందులో ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది.  


నేల వేము : ఇది ఒకరకమైన కలుపు మొక్క. కానీ, ఇందులో వైద్య గుణాలు చాలా ఉన్నాయి. స్వల్పకాలిక మొక్కే అయినా రెండు ఫీట్ల దాకా పెరుగుతుంది. ఇది అత్యంత చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. సాపోనిన్స్‌, ఫ్లవోనోయిడ్స్‌ రసాయనాలను కలిగి ఎంత తీవ్రమైన జ్వరాన్నయినా తగ్గిస్తుంది.  

తిప్పగీత : ఇది విష జ్వరాలను తగ్గేందుకు శక్తిమంతంగా పని చేస్తుంది. ప్రతి ఊరిలోనూ రోడ్డు వెంట ఉండే చెట్లకు ఎగబాకుతూ అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ బతికి పెరిగే తీగ జాతి మొక్క. అందుకే దీన్ని అమృత అని అంటారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌ వారు తయారు చేసిన ‘సుశ్‌మనవటి’ అనే మందు గోలీలో ప్రధానంగా వాడిన ద్రవ్యం తిప్పతీగే. వీటితో పాటు మన ఇంట్లో రోజూ వాడే పసుపులో ‘కుర్‌కుమిన్‌' ఉంటుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేందుకు, ఫ్రీ రాడికల్‌ రిమూవర్‌, ఇమ్యూనోమాడ్యులేటర్‌గా పనిచేస్తుంది. 

రూ.20లక్షల విలువైన దవాచాయ్‌ ప్యాకెట్ల పంపిణీ

కరోనా మన రాష్ర్టానికి విస్తరించినప్పటి నుంచి తొర్రూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు గుమ్మడవెల్లి శ్రీనివాస్‌ రూ.20లక్షల ఖర్చుతో 20వేల దవాచాయ్‌ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్యంగా కరోనా కట్టడి కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీస్‌శాఖ వారికి ఈ ప్యాకెట్లను అందజేస్తున్నారు. హైదరాబాద్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డికి 10వేల ప్యాకెట్లను, జీహెచ్‌ఎంసీ పరిధిలోని అనేక పోలీస్‌స్టేషన్లలో, మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డికి, తొర్రూరులో పోలీస్‌లు, జర్నలిస్టులకు కలిపి 10వేల ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. మిశ్రమ తయారీలో శ్రీనివాస్‌ భార్య డాక్టర్‌ ఉమాదేవి, ముంబయి ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న కొడుకు రాహుల్‌ దత్తాత్రేయ, కూతురు అదితి సైతం భాగస్వాములయ్యారు. శ్రీనివాస్‌ కుటుంబం ఐదు తరాలుగా ఆయుర్వేద వైద్యాన్ని కొనసాగిస్తున్నది. 2000 సంవత్సరంలో సంక్రమిక వ్యాధి అయిన ‘జపనీస్‌ ఏన్‌సెఫలైటిస్‌'  వచ్చినప్పుడు శిశు మరణాలను తగ్గించేందుకు సుమారు లక్షమంది పేదలకు తొర్రూరు కేంద్రంగా తయారు చేసిన మందులు పంపిణీ చేశారు. 2003-2004లో వచ్చిన ‘చికున్‌ గున్యా’ నివారణకు 40వేల మంది పేదలకు  ఉచితంగా ఆయుర్వేద మందు గోలీలు పంపిణీ చేశారు. 2012-2014లో విష జ్వరాలు, డెంగీ లాంటి మహమ్మారుల నుంచి సామాన్యులు తమ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇదే ఆయుర్వేద వన మూలికల కషాయాన్ని తయారు చేసి వేలాది మందికి ఉచితంగా పంపిణీ చేశారు.


logo