ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Jun 16, 2020 , 01:29:42

నియంత్రణ విధానానికి పెరుగుతున్న మద్దతు

నియంత్రణ విధానానికి పెరుగుతున్న మద్దతు

  • నకిలీ విత్తనాల కట్టడికి ప్రభుత్వం చర్యలు
  • అన్నదాతల హర్షం

ములుగురూరల్‌, జూన్‌15 : మండలంలోని 32 గ్రామాల్లో రైతన్నలు  వ్యవసాయ సాగుకు సన్నద్ధమయ్యారు. వానకాలం సాగులో భాగంగా పత్తి పండించేందుకు రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తుతూ సోమవారం ఫుల్‌ బీజీగా కనిపించారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు పంటలను సాగు చేసేందుకు ఆయా గ్రామాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ములుగు, పత్తిపల్లి, దేవగిరిపట్నం, కాసీందేవిపేట, పత్తిపల్లితో పాటు ఇతర గ్రామాల్లో ఈ పత్తి పంటలను సాగు చేసేందుకు రైతులు సన్నద్ధం కాగా పల్లి పంటను సాగు చేసేందుకు మహ్మద్‌గౌస్‌పల్లి గ్రామాల ప్రజలు వ్యవసాయ సాగులో ముందుకు సాగుతున్నారు. ఇతర గ్రామాల రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన పంటలకు మొగ్గు చూపుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ  దిగుబడి సాధించే ప్రయత్నం చేస్తున్నారు.

రైతు బంధు పథకాన్ని పొందేందుకు దరఖాస్తు సమర్పించేందుకు శనివారం చివరి రోజుగా ప్రభుత్వం గడువు విధించడంతో రైతులంతా వ్యవసాయ అధికారులకు తమ వివరాలను సమర్పించారు. ఆదివారం నుంచి  నైరుతి రుతు పవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో సోమవారం నుంచి సాగు బడిని ముమ్మరం చేశారు. ఆరుతడి పంటలు వేసేందుకు రైతులు వ్యవసాయ కూలీలతో కలిసి తమ పంట పొలాల్లో పత్తితో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ అధికారులు నియంత్రణ సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు పంటల విషయంలో తగు జాగ్రత్తలు, మెలకువలు అందిస్తున్నారు. రైతులు వానకాలం పంటల సాగుపై అడుగులు వేస్తున్నారు. ఒకే రకం పంటలను కాకుండా పంట మార్పిడి చేస్తూ వ్యవసాయంలో ముందుకు సాగి అధిక దిగుబడులు సాధించే దశగా అడుగులు వేస్తున్నారు. పంట విషయంలో రైతులు నష్టపోకుండా నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపేందుకు టాస్క్‌ఫోర్స్‌, పోలీస్‌, వ్యవసాయ అధికారులతో మండలంలోని బృందాలను ఏర్పాటు చేసి పలు ఫర్టిలైజర్‌ దుకాణాలపై నిరంతరం తనిఖీలు చేయిస్తున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. logo