మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jun 12, 2020 , 07:55:22

సమీకృత మత్స్య అభివృద్ధి పథకంతో లబ్ధి

సమీకృత మత్స్య అభివృద్ధి పథకంతో లబ్ధి

  • రూ.18.54 కోట్లతో వాహనాలు, ఇతర సౌకర్యాలు 
  • రాయితీపై 1749 మందికి మోపెడ్‌, 127 ఆటోలు
  • హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు 

రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని మత్స్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలను అందజేసి ఆదుకుంటున్నది. ఆర్థిక బలోపేతానికి ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 545 చెరువుల్లో కోటి యాబై లక్షల చేప పిల్లలను పోశారు. చేపల చెరువుల నిర్మాణం కోసం మత్స్యకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మహిళా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి నిధులు కేటాయిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నది. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు బీమా పథకాలను కూడా అందజేస్తోంది.      - రెడ్డికాలనీ విలేకరి

జిల్లావ్యాప్తంగా 114 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలుండగా మొత్తం 11,838 మంది సభ్యులు సొసైటీలో ఉన్నారు. 91 మంది పురుషులు, 23 మంది మహిళా సంఘాలు ఉన్నాయి. సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా చిన్న, పెద్ద యూనిట్లుగా మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలను అందజేస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రాథమిక మత్స్యసహకార సంఘాల/మహిళా మత్స్యసహకార సంఘాల/మత్స్యకార మార్కెటింగ్‌ సహకార సంఘాల్లో నమోదైన  సభ్యులు, సభ్యులతో ఏర్పాటైన గ్రూపులు, జిల్లా మత్స్యసహకార సంఘాలు, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ద్వారా అందిస్తున్నది. 

మత్స్యకారులకు వేటకు వలలు/క్రాఫ్టులు(75 శాతం సబ్సిడీతో), చేపల అమ్మేందుకుమోపెడ్లు, లగేజీ ఆటో, శీతల వాహనాలు(75 శాతం సబ్సిడీతో), రూ.10 లక్షల నుంచి 2 కోట్ల వ్యయంతో వంద శాతం సబ్సిడీపై రిటైల్‌, హోల్‌సేల్‌ మార్కెట్ల నిర్మాణం, చేపల దాణా మిల్లులు, ఐస్‌ ప్లాంట్లు, చేపల ప్రాసెసింగ్‌ యూనిట్లు, విత్తన చేపల పెంపక చెరువులు, చేప విత్తనాల హేచరీస్‌ వంటి(75 శాతం సబ్సిడీ) నిర్మాణానికి సబ్సిడీపై అందజేస్తున్నది. చేప ఉత్పత్తుల విక్రయ కియోస్కు, ఇన్సులేటెడ్‌ ట్రక్కులు, ఐస్‌ప్లాంట్‌ నిర్మాణం, చేపల ప్రాసెసింగ్‌ యూనిట్లు, పెద్ద చేపల దాణా కర్మాగారం నిర్మాణం, హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ నిర్మాణం, ల్యాండింగ్‌ కేంద్ర నిర్మాణం, కొత్త చేపవిత్తన క్షేత్రాల నిర్మాణం వంటి పలు అంశాలపై మత్స్యలబ్ధిదారులకు 90 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తూ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది. చిన్న యూనిట్లు: ద్విచక్రవాహనంతో చేపల అమ్మకం యూనిట్‌, ప్లాస్టిక్‌ చేపల క్రేట్లు, పోర్టబుల్‌ చేపల అమ్మకం కియోస్కు, వలలు, క్రాఫ్టులుపెద్ద యూనిట్లు: లగేజీ ఆటోతో చేపల అమ్మకం యూనిట్‌, సంచార చేపల అమ్మక వాహనం, కొత్త చేపల చెరువుల నిర్మాణం, ఉత్పాదకాల వ్యయం, రీ సర్క్యులేటరీ అక్వాకల్చర్‌ యూనిట్‌,అలంకరణ చేపల యూ నిట్‌ నిర్మాణం, వినూత్న ప్రాజెక్టుల కింద చేపఉత్పత్తుల విక్రయ కియోస్కు, విత్తన చేపల పెంపక చెరువులు, ఆక్వా టూరిజం యూనిట్‌పై సబ్సిడీ అందజేస్తూ వారిని ఆర్థికంగా ఆదుకుంటుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో చేప పిల్లలు, చేపల ఉత్పత్తిని పెం చడం, చేపల వేటకు పరికరాలు, చేపల మా ర్కెటింగ్‌, ప్రాసెస్సింగ్‌కు సహాయం, మౌలిక సదుపాయాలు కల్పించడం, మత్స్యకారులకు శిక్షణల ద్వారా నైపుణ్యం రూపొందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. 

రూ.18.54 కోట్లతో వాహనాలు, ఇతర సౌకర్యాలు

మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వరంగల్‌ జిల్లా మత్స్యసహకార సంఘాల అభివృద్ధికి సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద రూ.18.54 కోట్లు నిధులు మంజూరు చేసి వాహనాలు, వలలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఇప్పటి వరకు 1749 మందికి మోపెడ్‌ వాహనాలు, 127 లగేజీ ఆటోలు, 104 క్రాఫ్ట్స్‌ అండ్‌ నెట్స్‌, 84 ప్లాస్టిక్‌ ఫిష్‌క్రేట్స్‌, 23 చేప ఉత్పత్తుల విక్రయ కియోస్కు, 42 మొబైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్స్‌, వీటితో పాటు విత్తన చేపల పెంపక చెరువులు, ఆక్వా టూరిజం అందజేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కో సభ్యుడికి సంవత్సరానికి రూ.45 వేల చొప్పున ఆదాయం లభించనుంది. 

చేపల విక్రయాలతో జీవనం..

చేపల విక్రయాలతో జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం రాయితీపై టీవీఎస్‌ ఎక్సెల్‌(మోపెడ్‌) వాహ నాన్ని అందజేసింది. మత్స్య కారులను తెలంగాణ ప్రభు త్వం ఆదుకుంటున్నది. ఇప్పటి వరకు ఎవరూ మమ్మిల్ని పట్టించుకోలేదు. ఉచితంగా చేప పిల్లలను ఇచ్చింది. ప్రభుత్వం అండగా ఉంటూ ఆర్థికంగా తమకు భరోసానిస్తున్నది.

- కుక్కల కుమారస్వామి,  మోపెడ్‌ లబ్ధిదారుడు, హసన్‌పర్తి 

 


logo