మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jun 09, 2020 , 05:43:34

ఆలయాల్లో భక్తుల సందడి

ఆలయాల్లో భక్తుల సందడి

  • ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా మందిరాల్లో పూజలు
  • థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజర్లు ఏర్పాటు
  • భక్తులు భౌతికదూరం పాటించేలా చర్యలు

కాళేశ్వరం/కురవి/ములుగు/భీమదేవరపల్లి/ఐనవోలు/స్టేషన్‌ఘన్‌పూర్‌/రెడ్డికాలనీ/వరంగల్‌ కల్చరల్‌/పాలకుర్తి రూరల్‌: లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా ప్రభుత్వాలు ఆలయాల పునర్దర్శనానికి నిబంధనలతలో కూడిన అనుమతులు ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని దేవాలయాలు సోమవారం భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్నాయి.  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని ముక్తీశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. ముందుగా త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి గోదావరి మాతకు దీపాలొదిలారు. అనంతరం ఆలయానికి చేరుకున్న భక్తులకు నిర్వాహకులు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి లోనికి పంపించారు. భక్తులు భౌతికదూరం పాటిస్తూ దర్శనం చేసుకున్నట్లు ఆలయ ఈవో మారుతి, చైర్మన్‌ వెంకటేశం పర్యవేక్షించారు. అలాగే, మహబూబాబాద్‌ జిల్లా కురవి భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి కొత్తశోభ వచ్చింది. ఆలయ తూర్పు రాజగోపురం వద్దే భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి దర్శనానికి పంచారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ప్రసిద్ధ రామప్ప ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలాగే, జిల్లాకేంద్రంలోని శివాలయం, రామాలయం, ఆంజనేయస్వామి, ప్రేమ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయాల్లో భక్తులకు మాస్కులు ధరించి  పూజలు చేశారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం, ములుకనూరులోని సాంబమూర్తి దేవాలయం, కొప్పూరులోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు సంప్రోక్షణ పూజలు చేశారు. ఐనవోలు మల్లికార్జునస్వామిని డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, ఎంపీపీ మార్నేని మధుమతి దంపతులు దర్శించుకున్నారు. జనగామ జిల్లా చిలుపూర్‌లోని శ్రీబుగులు వేంకటేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. చారిత్రక వేయిస్తంభాల ఆలయంలో నిబంధనలకు లోబడి భక్తులను అనుమతించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈవో వేణుగోపాల్‌ తెలిపారు. వరంగల్‌లోని భద్రకాళీ ఆలయంలో భక్తుల మధ్య మీటర్‌ దూరం ఉండేలా ఏర్పాట్లు చేసి దర్శనభాగ్యం కల్పించారు. హాండ్‌ స్ప్రేయర్‌, డ్రోన్ల సాయంతో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామల సునీత తెలిపారు. పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో పరిమిత భక్తులకే దర్శనభాగ్యం కల్పించినట్లు కార్యనిర్వహాణాధికారి మేకల వీరస్వామి తెలిపారు.


logo