శుక్రవారం 07 ఆగస్టు 2020
Mulugu - Jun 06, 2020 , 02:36:33

పల్లెలు అద్దంలా మెరువాలె..

పల్లెలు అద్దంలా మెరువాలె..

గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 

బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే రూ.500ఫైన్‌

గ్రామపంచాయతీలకు నెలకు రూ.339కోట్లు మంజూరు 

నియంత్రిత సాగుతో  అన్నదాతలకు మేలు 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

 ‘ఊళ్లు పరిశుభ్రంగా ఉండాలె.. అభివృద్ధిలో దూసుకుపోవాలె. మూకుమ్మడిగా ఊరి కోసం కదలాలె.. ఇళ్లను, వాడలను అద్దంలా మెరిపించాలె. పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పూనుకున్నరు. ఎన్ని కష్టాలొచ్చినా పంచాయతీలకు నెలనెలా రూ.339 కోట్లు మంజూరు చేస్తున్నరు’ అని పంచాయతీరాజ్‌  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంత్రి పాలకుర్తి మండలంలో పర్యటించారు. పారిశుధ్య పనులను పరిశీలించి.. వైకుంఠధామాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధులను తరిమికొట్టడానికి, పల్లెల్లో ప్రగతికి జీవం పోసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదన్నారు. రోడ్లపైన చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. రైతుకు లాభం చేకూర్చాలనే సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చారని,  ప్రభుత్వం చెప్పిన పంటలనే అన్నదాతలు వేయాలన్నారు. - పాలకుర్తి రూరల్‌

పాలకుర్తి రూరల్‌, జూన్‌ 5: పల్లె ప్రగతి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలతో గ్రామాలు అద్దంలా మెరువాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మంచుప్పులలో వైకుంఠధామం పనులు, నర్సరీని కలెక్టర్‌ కే నిఖిల, జెడ్పీ చై ర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించా రు. అనంతరం మొక్కలు నాటారు. పాలకుర్తిలో వైకుంఠధా మం పనులు, ఎల్లరాయిని, తొర్రూరులో పారిశుధ్య పనుల ను పరిశీలించారు. మంచుప్పులలో డప్పు చప్పుళ్లు, కోలాటాలతో మంత్రికి స్వాగతం పలికారు. కొవిడ్‌-19 నేపథ్యం లో జిల్లాలో 8752 స్వయం సహాయక సంఘాలకు రూ.49 కోట్ల నిధులను మంత్రి పంపిణీ చేశారు. వాన్‌పిక్‌ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 200 మందికి నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయాలన్నదే పల్లెప్రగతి ఉద్దేశమని, పరిసరాల పరిశుభ్రతతో ఇది సాధ్యమన్నారు. దీనికి నెలకు రూ.339 కోట్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామాల్లో రోడ్లపై చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం నిర్ణయాలతోనే రాష్ట్రంలో కరోనా కట్టడిలో ఉందని, వలస కార్మికుల కారణంగా ఉధృతి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని, గ్రామాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. కేసీఆర్‌ పాలనలో రైతులకు మహర్దశ వస్తున్నదని, నియంత్రిత పంటల సాగు విధానంతో మేలు జరుగుతుందని చెప్పారు. తెలంగాణ సో నా పండిస్తే లాభాలు వస్తాయని సూచించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నా రైతులను ఆదుకుంటున్నా మని, ప్రతి రైతుకూ రైతు బంధు అందిస్తామని, మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేస్తామని వివరించారు. ఉపాధి కూలీలకు గిట్టుబాటు జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌ కే నిఖిల మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా ఈ కార్యక్రమం మేలు చేస్తుందని చెప్పారు. పరిసరాల పరిశుభ్రతతో పల్లెప్రగతి విజయవంతమవుతుందని సూచించారు. జిల్లాలో రైతులు మక్క సాగు చేయొద్దని, సన్న రకం ధాన్యం సాగు చేసి లాభాలు పొం దాలన్నారు. జిల్లాలో లక్షా ఆరువేల ఇంకుడు గుంతలు తీయడమే లక్ష్యంగా నిర్ణయించామని, జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాలు, నర్సరీల పనులు 20రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. మంచుప్పుల గ్రామాన్ని అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

గ్రామాల అభివృద్ధేతో దేశాభివృద్ధి

గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి చెప్పారు. మంచుప్పుల గ్రామసభలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత పాటిస్తే రోగాలు, వ్యాధులు దూరమవుతాయని సూచించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంతో అంటు వ్యాధులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నియంత్రిత పంటల సాగు విధానాన్ని అన్నదాతలు అమలు చేసి బం గారు పంటలు పండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ఎంపీపీ నల్లానాగిరెడ్డి, సర్పంచ్‌ బొమ్మగాని కొమురయ్య, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, డీపీవో డీ వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో రమాదేవి, జిల్లా వైద్యాధికారి ఏ మహేందర్‌, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు, సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, మల్లారెడ్డి, డీఎస్‌వో రోజారాణి, ఆర్డీవో రమేశ్‌, పెద్ది శ్రీనివాసరెడ్డి, ఏసీపీ గొల్ల రమేశ్‌, తహసీల్దార్‌ విజయభాస్కర్‌, ఎంపీడీవో  అశోక్‌కుమార్‌, ఈఈ మల్లేశం, డీఈ దిలీప్‌, డీఎల్‌పీవో గంగా భవానీ, డీఏవో నర్సింగం, అశోక్‌రెడ్డి, మైసిరెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.

బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.1.50 కోట్లు 

మంచుప్పుల చెరువులో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.1.50 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో మంత్రినయ్యానని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానన్నారు.logo