గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Jun 05, 2020 , 02:11:55

శానిటైజర్‌, మాస్కుల తయారీ

శానిటైజర్‌, మాస్కుల తయారీ

కరోనా కష్టకాలంలో మహిళలకు చేతినిండా పని

ప్రభుత్వ సంస్థలు, ఉపాధి హామీ కూలీలకు సరఫరా

ఉపాధి పొందుతూ ఇతరులకు ఆద ర్శంగా నిలుస్తున్న జనగామ జిల్లా మహిళా సంఘాలు

దేవరుప్పుల : కరోనా మహమ్మారి ఉధృతి ఎక్కువవడంతో శానిటైజర్లు, మాస్కుల ప్రాముఖ్యత పెరిగింది. వీటిని మహిళా సంఘాలతో తయారు చేయించాలనే ఆలోచన అధికారులకు వచ్చింది. వెంటనే వాటి తయారీలో మహిళలకు తర్ఫీదునిస్తూ కరోనా కష్టకాలంలో ఆయా కుటుంబాలు కొంతలోకొంత ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి సాయపడ్డారు. సెర్ప్‌ ద్వారా మంజూరైన రూ.21.5 లక్షల ఫండ్‌ను అన్ని మండలాలకు కేటాయించి మాస్కులు, శానిటైజర్ల తయారీకి మహిళలను ప్రోత్సహించారు. ఈక్రమంలో రఘునాథపల్లిలోని గీతాంజలి మహిళా పొదుపు సంఘం మహిళలకు డబ్ల్యూహెచ్‌వో నిబంధనల మేరకు శానిటైజర్‌ తయారీలో శిక్షణనిచ్చారు. దీంతో ఇప్పుడు మహిళలు 100ఎంఎల్‌, 200ఎంఎల్‌, 500 ఎంఎల్‌ పరిణామంలో శానిటైజర్‌ తయారు చేసి అందిస్తున్నారు. ఇక జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా సంఘాలు మాస్కులు తయారు చేస్తుండడంతో లక్షల్లో ఉత్పత్తి జరుగుతున్నది. కొడకండ్ల, రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లో ఉత్పత్తి అధికంగా ఉంది. మాస్కులు, శానిటైజర్లను కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ సంస్థలు, ఉపాధిహామీ కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు, పరీక్షల సమయంలో పదో తరగతి విద్యార్థులు, ఆసరా పింఛన్లు అందుకుంటున్న వృద్ధులకు పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్నారు.  

కష్టకాలంలో చేతినిండా పని..

శానిటైజర్‌ తయారీ విధానంపై సెర్ప్‌ అధికారులు శిక్షణ ఇచ్చిండ్లు. ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకున్నాం. అధికారుల ప్రో త్సాహంతో ఐదుగురు సభ్యులం శిక్షణ పొందినం వరుణ్‌ బ్రాండ్‌ పేరుతో నేటికి 300 లీటర్ల శానిటైజర్‌ సరఫరా చేశాం. కలెక్టర్‌ మాకు ఆర్డర్‌ ఇచ్చిండ్లు. ఇంకొంత బయట మార్కెట్‌లో అమ్మాం. లాక్‌డౌన్‌లో మేము ఆర్థికంగా నిలదొక్కునేలా చేసింది. మా సంఘం శానిటైజర్‌ తయారీనే ఉపాధిగా మలచుకోవాలనే ఆలోచనతో ఉంది.

-అనిత, గీతాంజలి మహిళా పొదుపు సంఘం, రఘునాథపల్లి

మాస్కులకు మంచి గిరాకీ..

 మా సంఘం ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా డీఆర్‌డీఏ సహకారంతో వరలక్ష్మి టెక్స్‌టైల్స్‌ అండ్‌ గార్మెంట్స్‌ను నడుపుతున్నాం. మెటీరియల్‌ తెచ్చి దుస్తులు కుట్టి అమ్ముతున్నాం. ప్రభుత్వ సంస్థల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. జ్యోతిరావ్‌ ఫూలే పాఠశాలలు, గురుకులాలు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ విద్యార్థులకు ఆర్డర్లపై యూనిఫారాలు కుడుతున్నాం. లాక్‌డౌన్‌తో గిరాకీ లేకపోవడంతో అధికారుల సూచనల మేరకు మాస్కుల తయారీ మొదలుపెట్టాం. పదిమంది సభ్యులం ఇప్పటి వరకు లక్షన్నర మాస్కు లు తయారుచేశాం. మంచి గిరాకీ ఉంది. 

- ఎలిశాల రజిత, వరలక్ష్మి టెక్స్‌టైల్స్‌ అండ్‌ గార్మెంట్స్‌, మల్కాపురం

కృత్రిమ కొరతకు అడ్డుకట్ట వేశాం..

కరోనాతో శానిటైజర్లు, మాస్కులకు ప్రాధాన్యం పెరిగింది. కొందరు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచారు. ప్రతి కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులకు మాస్కులు, శానిటైజర్లు వాడాల్సిన అవసరం పెరిగింది. దీంతో మహిళా సంఘాలను ప్రోత్సహించడంతో అన్ని మండలాల్లో మాస్కులు తయారుచేశారు. వారి వద్ద కొని ఉపాధిహామీ కూలీలు, ప్రభుత్వ సంస్థలకు ఉచితంగా అందించాం. మంత్రి దయాకర్‌రావు లక్ష మాస్కులు ఆర్డర్‌ ఇచ్చారు. సంఘాలు తయారీలో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తున్నాయి.  

- రాంరెడ్డి, డీఆర్డీవో, జనగామ


logo