శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Jun 05, 2020 , 01:58:57

ఆదర్శ నగరంగా ఓరుగల్లు

ఆదర్శ నగరంగా ఓరుగల్లు

వరంగల్‌ నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలన్నారు. సమస్యలుంటే తక్షణం పరిష్కరించి, నిర్ణీత గడువులోగా పనిచేయని ఏజెన్సీలను తప్పించాలని స్పష్టం చేశారు. వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ల పురోగతిపై హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్‌ పురపాలక శాఖ కాంప్లెక్స్‌లో గురువారం సమీక్షించారు. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం హామీల పురోగతిపై ఆరా తీశారు. జంక్షన్ల సుందరీకరణపై దృష్టి సారించాలన్నారు. త్వరలో తాను వరంగల్‌లో పర్యటిస్తానని, అప్పటివరకు మార్పు కనిపించాలని చెప్పారు. కాగా,  అంబేద్కర్‌నగర్‌ డబుల్‌బెడ్‌రూం ఇళ్ల గృహప్రవేశాలు చేయించనున్నట్లు తెలిసింది.

- వరంగల్‌ ప్రతినిధి/నమస్తే తెలంగాణ

 డబుల్‌ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

 పనిచేయని ఏజెన్సీలను పక్కనబెట్టాలి 

 సీఎం హామీల పురోగతి ఎందాక వచ్చింది? 

 జంక్షన్ల సుందరీకరణపై దృష్టి సారించాలి 

 సీఎం వద్ద మాస్టర్‌ ప్లాన్‌ 

 ఈ నెల మూడో వారంలో వరంగల్‌ వస్తా.. 

 సమీక్షలో మంత్రి కేటీఆర్‌ 

వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్‌ పురపాలక శాఖ కాంప్లెక్స్‌లో మంత్రి కేటీఆర్‌ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ల పురోగతిపై సమీక్షించారు.  దీనికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్పొరేషన్‌లో పౌరుల కనీస అవసరాలపై ప్రధాన దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. వరంగల్‌ మహానగరంలో మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌కు ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నిధులు విడుదల చేస్తున్నారన్నారు. దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆశించిన మేర పురోగతి కనిపించడంలేదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు ఒకరోజు శిక్షణ  కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 

నియోజకవర్గాల వారీగా అభివృద్ధి నమూనా 

‘వరంగల్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో ఐదు నియోజకవర్గాలున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ప్రాధాన్యతా కార్యక్రమాల ఎంపిక అవసరం ఏర్పడుతుంది. వీటిని గుర్తించి నియోజకవర్గాల వారీగా కాంప్రిహెన్సివ్‌ ప్లాన్‌ అమలు చేయాలి. అంతిమంగా ఆ ప్రణాళిక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించాలి’ అని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఇప్పటికే కార్పొరేషన్‌ పరిధిలో ఏం చేయాలో? వేటిపై దృష్టిసారించి ముందుకు సాగాలనే విషయంపై సీఎం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో వాటిపై దృష్టి సారించాలన్నారు. మంత్రులు ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా సమీక్షించి సూచనలు చేయాలన్నారు. మహానగరం పరిధిలో మౌలి క వసతుల నిర్మాణ కార్యక్రమాల్లో అలసత్వం ప్రదర్శించే కాంట్రాక్టర్లను, వర్కింగ్‌ ఏజెన్సీలను పక్కనబెట్టి ఇతరులకు ఆ పనులు అప్పగించి, పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

నిధుల కొరత లేకున్నా.. ఆలస్యమెందుకు? 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదని, అయినా పనులు పూర్తి కాకపోవడంపై మంత్రి కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే ఏజెన్సీలతో మాట్లాడి పూర్తి చేయాలన్నారు. 

సుందరీకరణపై దృష్టి పెట్టాలి

వరంగల్‌ మహానగరం పరిధిలో సుందరీకరణపై తక్షణమే దృష్టిసారించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. జంక్షన్ల అభివృద్ధి, డివైడర్లు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ స్మృతివనం, కాళోజీ కళాకేంద్రం పనుల్లో పురోగతి ఉండాలన్నారు. రోడ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.  ఫుట్‌ పాత్‌, గ్రీనరీ, టాయ్‌లెట్ల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాగునీటి పరిస్థితి సమీక్షించారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం విలీన గ్రామాలకు 1/3 నిధులు కేటాయించామని, వాటిని గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. కాగా, కుడా రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో ఆమోదించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. 

త్వరలో మంత్రి కేటీఆర్‌ పర్యటన 

ఈ నెల మూడో వారంలో తాను పర్యటిస్తానని, అప్పటి వరకు మార్పు కనిపించాలని మంత్రి కేటీఆర్‌ ఒకవైపు అధికారులకు, మరోవైపు ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్‌ స్వయంగా తనకు తానే మూడో వారంలో పర్యటిస్తానని చెప్పడంతో, అంబేద్కర్‌నగర్‌లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఆ రోజు గృహ ప్రవేశాలు చేయించే అవకాశాలున్నాయని సమాచారం.


logo