బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Jun 03, 2020 , 03:11:55

మావోయిస్టు దళ సభ్యుడి అరెస్టు

మావోయిస్టు దళ సభ్యుడి అరెస్టు

  • వాహన తనిఖీల్లో పట్టుబడిన వైనం 
  • 2016లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఉంగయ్య 
  • మూడు ఘటనల్లో నిందితుడు
  • వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శరత్‌చంద్ర పవార్‌   

ఏటూరునాగారం, జూన్‌ 02 : పలు విధ్వంస సంఘటనలతో సంబంధం ఉన్న మావోయిస్టు దళ సభ్యుడు ముస్సకి ఉంగయ్యను సోమవారం సాయంత్రం అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ శరత్‌ చంద్ర పవా ర్‌ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన తన కార్యాలయంలో అరెస్టు వివరాలను వెల్లడించారు. వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో సోమవారం సాయంత్రం సీఐ శివప్రసాద్‌, ఎస్సై తిరుపతి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదుపులోకి తీసుకుని విచారించగా వెంకటాపురం మండలం చెలిమెల గ్రామానికి చెందిన గొత్తికోయ సామాజిక వర్గానికి చెందిన ముస్సకి ఉంగయ్యగా వెల్లడైందన్నారు. 2016లో సీపీఐ మావోయిస్టు దళంలో సభ్యుడిగా చేరి ఆ తర్వాత ఖమ్మం డీసీఎస్‌ కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌ ప్రొటెక్షన్‌ టీంలో గార్డుగా పనిచేస్తూ పలు విధ్వంస సంఘటనల్లో పాల్గొన్నట్లు ఏఎస్పీ తెలిపారు

. 2016లో రామచంద్రాపూర్‌ శివారులోని ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ప్లాస్టిక్‌ డబ్బాలో బాంబులు పెట్టి, కరపత్రాలు వదిలి వాహనాలను అడ్డగించిన సంఘటనలోనూ ఉన్నట్లు చెప్పారు. ఇదే సంవత్సరంలో కొత్తపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద ల్యాండ్‌ మైన్స్‌ అమర్చిన సంఘటన, 2017లో పాలెం వాగు ప్రాజెక్టు సమీపంలో పోలీసులను చంపేందుకు ల్యాండ్‌ మైన్స్‌ అమర్చిన సంఘటనలో కీలక వ్యక్తిగా ఉన్నట్లు చెప్పారు. 2019లో భద్రాచలం ఏరియాకు వచ్చి అక్కడ సారపాక జామాయిల్‌ తోట లో పని చేస్తూ సుకుమతి అనే యువతిని వివాహం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడు నెలల క్రితం మంగపేట మండలంలోని బొమ్మాయిగూడెంలో తన అన్న ముస్సకి ఐతయ్య వద్దకు వచ్చి అక్కడే ఉంటున్నట్లు ఏఎస్పీ వివరించారు. సోమవారం స్వగ్రామం చెలిమెలకు వెళ్లి తల్లిని చూసి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్తున్న క్రమంలో పోలీసులకు చిక్కినట్లు ఏఎస్పీ వివరించారు. సమావేశంలో ట్రైనీ ఏఎస్పీ గౌషం ఆలం, వెంకటాపురం సీఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ సీతమ్మ, వెంకటాపురం సీఐ శివప్రసాద్‌, ఎస్సై తిరుపతి, ఏటూరునాగారం సీఐ నాగబాబు, మంగపేట ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. logo