శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Apr 07, 2020 , 03:28:54

సెంటర్‌కో నోడల్‌ అధికారి..!

సెంటర్‌కో నోడల్‌ అధికారి..!

  • అర్బన్‌ జిల్లాలో 83 కొనుగోలు కేంద్రాలు 
  • ఐకేపీ ఆధ్వర్యంలో 25.. సొసైటీల ద్వారా 58.. 
  • కొనుగోలు కేంద్రాల వద్ద శానిటైజర్లు 
  • సమన్వయానికి జిల్లా స్థాయి కమిటీ 
  • నేతల ముందస్తు సమావేశాలు 

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నేపథ్యంలో రైతులు తాము పండించిన పంటల్ని మార్కెట్లకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యా  ప్తంగా దాదాపు రూ.30వేల కోట్లను కేటాయించింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ఇటీవలే ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార శాఖల సమన్వయంతో ప్రభుత్వమే నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి భరోసా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు.  కొనుగోలు ప్రక్రియను పరిశీలించడానికి కేంద్రానికో నోడల్‌ అధికారిని జిల్లా యం త్రాంగం నియమించింది. జిల్లా సహకార, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులతో జిల్లా స్థాయి ప ర్యవేక్షక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. 

గ్రామాల వారీగా కొనుగోలు

ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేస్తున్నది. లాక్‌డౌన్‌లో భాగంగా వ్యవసాయ మార్కెట్లు మూసివేయగా, నేరుగా రైతుల దగ్గరికే వెళ్లి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రైతుల నుంచి పూర్తి సహకారాన్ని కోరుతున్నది. రైతుబంధు సమితి సమన్వయకర్తలు, వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల వారీగా కొనుగోలు చేసేందుకు అనువుగా రైతులకు టోకెన్లు జారీ చేస్తారు. ఈ సందర్భంలోనే వారికి కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు ధాన్యం తీసుకొని రావాలన్న విషయాన్ని స్పష్టంగా వివరిస్తారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతు ధాన్యంతోపాటు ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నంబర్‌ లేదా పాస్‌బుక్‌, పట్టాదార్‌ పాసు పుస్తకం వంటివి ప్రాథమికంగా తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఆరు మండలాల్లోని 111 గ్రామాల్లో 83 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశారు. ఐనవోలు మండలం నందనంలో సోమవారం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ప్రారంభించారు.  నేతల సన్నాహక సమావేశాలు 

అధికార యంత్రాంగానికి కొనుగోలు ప్రక్రియలో సహకరించేందుకు వీలుగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, జెడ్పీటీసీలు సహా ఆయా ప్రాంతాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్లు, సభ్యులు, గ్రామ రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్లతో ఎమ్మెల్యేలు ముందస్తు సమావేశాలు నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే టీ రాజయ్య వారి నియోజకవర్గాల్లోని మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని వివరిస్తున్నారు. 

83 కొనుగోలు కేంద్రాలు..

జిల్లాలోని ఆరు మండలాల పరిధిలోని 111 గ్రామాల్లో వరి పండే ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడానికి వీలుగా 83 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐనవోలు, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, కమాలాపూర్‌, వేలేరు, ధర్మసాగర్‌ మండలాల్లోని 53 గ్రామ పంచాయతీల పరిధిలో ఐకేపీ నిర్వహించే 25 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. సహకార శాఖ ఆధ్వర్యంలో 15  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 58 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయడం విశేషం.


logo