మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Apr 06, 2020 , 00:51:47

కదలిక.. లేదిక..!

కదలిక.. లేదిక..!

 • నో మూవ్‌మెంట్‌ జోన్లుగా 15 ప్రాంతాలు
 • నగరంలో హై అలర్ట్‌ ప్రకటించిన యంత్రాంగం
 • కరోనా విజృంభణతో అధికారుల నిర్ణయం
 • ఇళ్ల నుంచి బయటికి రావొద్దని పోలీసుల హెచ్చరిక 
 • ఇక నుంచి నిత్యావసర సరుకుల హోం డెలివరీ 
 • అర్బన్‌ జిల్లాలో మరో మూడు పాజిటివ్‌ కేసులు.. 24కి చేరిన బాధితులు
 • ఆరుగురు ఎంజీఎం వైద్యులకు నెగెటివ్‌ రిపోర్ట్స్‌

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని 15 ప్రాంతాలను కదలిక నిషేధ ప్రాంతాలుగా  యంత్రాంగం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో జన సంచారాన్ని నిషేధించింది.  కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన ఈ 15 ప్రాంతాలను సీజ్‌ చేసింది. ఈ ప్రాంతాలను నో మూవ్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి 24/7 కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది . జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు, సీపీ రవీందర్‌ ఈ ప్రాంతాల్లో వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో జులైవాడ, సుబేదారి, ఈద్గా, కుమార్‌పల్లి నుంచి లష్కర్‌బజార్‌, పోచమ్మమైదాన్‌, చార్‌బౌళి, కాశిబుగ్గ, గణేశ్‌నగర్‌, నిజాంపుర, లక్ష్మీపురం, రంగంపేట, శంభునిపేట, బాపూజీనగర్‌, చింతగట్టు క్యాంపు పరిధిలోని ప్రాంతాలను నో మూవ్‌మెంట్‌  జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంత ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 425 1115కు తెలియజేస్తే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అర్బన్‌ కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. నిర్దేశిత ప్రాంతాల్లో వైరస్‌ మరింత ప్రభావితం కాకుండా చేపట్టిన చర్యలకు ప్రజలు పూర్తిగా సహకరించాలని వారు కోరారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ నిత్యావసర వస్తువులు, కూరగాయలను మొబైల్‌ వాహనాల ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. ఆ ఏరియాల్లో పోలీసులు బారికేడ్లను కూడా ఏర్పా టు చేసి 24 గంటలు బందోబస్తు  నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఆ ప్రాంతాల నుంచి బయటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. 

సరుకుల పంపిణీకి ప్రత్యేక బృందాలు

ఇంటింటికీ కూరగాయలు, నిత్యావసర వస్తువుల సరఫరాకు ముగ్గురు సభ్యులతో కలెక్టర్‌ ప్రత్యేక పంపిణీ బృందాలను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు చేపట్టిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎవరూ బయటకు రాకుండా నిరోధించే చర్యల్లో భాగంగా పోలీస్‌, మార్కెటింగ్‌, మున్సిపాలిటీ సిబ్బందితో ఒక్కో ప్రాంతంలో రెండు బృందాలు అందుబాటులో ఉంటాయని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. 15 ప్రాంతాల్లోని 67 కాలనీల్లో ఉన్న 41,783 గృహాలకు ఈ బృందాలు నిత్యావసర సరుకులు సరఫరా చేయనున్నట్లు వివరించారు. ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి మొబైల్‌ నంబర్లు సేకరించి రోజువారీగా కావాల్సిన వస్తువులు కొనుగోలుచేసిన అనంతరం, మార్కెట్‌ రేటు ప్రకారం నిత్యావసర సరుకుల మొత్తాన్ని వారి నుంచి వసూలు చేస్తాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇంటిని గుర్తించడంలో ఇబ్బందులు ఎదురైతే వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించాలని కోరారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టర్‌కు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు తెలియజేయాలని సూచించారు. 

 ఆ వైద్యులకు నెగెటివ్‌..

వరంగల్‌ ఎంజీఎంలో కొవిడ్‌-19 బ్లాక్‌లో వైద్యసేవలు అందిస్తున్న జిల్లా కరోనా నోడల్‌ అధికారి సహా ఆరుగురికి  వైద్య పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇటీవల ఎంజీఎంలో కాజీపేటకు చెందిన ఓ రోగి (ఢిల్లీకి వెళ్లివచ్చిన వ్యక్తి సమాచారాన్ని గోప్యంగా ఉంచాడు)కి వైద్య సేవలు చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చి రక్తపరీక్షలు చేశారు. సదరు వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ యూనిట్‌లో ఉన్న ఆరుగురు వైద్యుల రక్త నమూనాలు తీసి పరీక్షకు పంపించారు. వారికి నెగెటివ్‌ వచ్చిందని ఆయన తెలిపారు. 

24కు చేరిన పాజిటివ్‌ కేసులు 

 అర్బన్‌ జిల్లాలో కేసుల సంఖ్య 24కి చేరింది. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత కరోనా పాజిటివ్‌ కేసుల్లోనూ వరంగల్‌ అర్బన్‌ జిల్లా ముందు వరుసలో ఉండడం ఆందోళనకరంగా మారింది. శనివారం వరకు 21 పాజిటివ్‌గా నమోదైన కేసుల సంఖ్య.. ఆదివారం మరో మూడు నమోదై మొత్తం 24కు చేరడం భయాందోళనకు గురిచేస్తున్నది. విదేశాలకు వెళ్లి వచ్చి క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అలా వివిధ దేశాలకు వెళ్లి వచ్చిన వారిలో ఇంకా 12 మంది మాత్రమే హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 802 మంది క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారు. కాగా, పాజిటివ్‌ వచ్చిన కేసుల్లో ఒకటి మినహా మిగతావన్నీ  ఇటీవల మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే (23 మంది) కావడం మరింత కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం  అప్రమత్తమై ప్రజలు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ పాటించాలని విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పటికైనా ఇంకా ఎవరైనా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కరోనా బులెటిన్‌ 

వరంగల్‌ అర్బన్‌ జిల్లా యంత్రాంగం కలెక్టరేట్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎంజీఎం ఆస్పత్రుల్లో 24/7 పనిచేసే విధంగా మూడు వేర్వేరు హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. కరోనాపై ఎవరికి ఏ విధమైన అనుమానాలున్నా, విదేశాలు, దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వారి సమాచారం ఎప్పటికప్పుడూ అందించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు సమాచారం అందిస్తున్నారు. ఆదివారం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ  విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ వివరాలిలా ఉన్నాయి.   

 • వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన వారు : 814 మంది 
 • హోం క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వారి సంఖ్య : 802 మంది 
 • హోం క్వారంటైన్‌లో ఉన్నవారు: 12 మంది
 • జిల్లా నుంచి మర్కజ్‌ ప్రయాణం చేసిన వారు : 25 మంది 
 • జిల్లాలో మర్కజ్‌ ప్రయాణికుల్లో పాజిటివ్‌ వచ్చిన వారు : 23 మంది 
 • ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా లక్షణాలనే అనుమానంతో చేరిన వారు : 8 మంది
 • ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నవారు : 186 మంది
 • హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవే..
 • వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌లోని హెల్ప్‌
 • లైన్‌ నంబర్‌: 18004251115
 • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌: 7993969104
 • ఎంజీఎం హెల్ప్‌లైన్‌: 9490611940


logo