మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Apr 05, 2020 , 03:14:51

అంతా అప్రమత్తం

అంతా అప్రమత్తం

  • కరోనా ప్రభావిత ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రే
  • సరుకుల డోర్‌ డెలివరీ కోసం ప్రత్యేక బృందాలు
  • పోలీసుల పహారా
  • క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్‌, సీపీ, కమిషనర్‌

వరంగల్‌/ హన్మకొండ, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వరంగల్‌లో హైరానా సృష్టిస్తున్నది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో చాలా మందికి పాజిటివ్‌ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎఫెక్టెడ్‌ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆఫీసర్లు ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేయిస్తున్నారు. ప్రధాన రహదారులను మూసివేసి ఆయా ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటికి రాకుండా చర్యలు తీసుకుంటున్న అధికారులు ఇంటికే నిత్యావసర సరుకులు అందేలా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ డాక్టర్‌ వీ రవీందర్‌, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. స్వీయ నియంత్రణ పాటించడంతోనే కరోనాను కట్టడి చేయొచ్చని ప్రజలకు సూచించారు.

నగరమంతా హై అలర్ట్‌

నాలుగు రోజుల క్రితం వరకు సేఫ్‌గా ఉందనుకున్న నగరంలో పాజిటివ్‌ కేసులు కలవరపెడుతున్నాయి. జిల్లా యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో హై అలర్ట్‌ ప్రకటించిన అధికారులు అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. పాజిటివ్‌ కేసులు వెలుగుచూడడంతో రెండు రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. పోలీసులు అనవసరంగా రోడ్లపైకి వస్తు న్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్‌-19 నియంత్రణకు ఈ రెండు వారాలు కీలక మని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది.  

ఆరు ఫైర్‌ ఇంజిన్లతో స్ప్రే

కరోనా పాజిటివ్‌ ఎఫెక్టెడ్‌ ప్రాంతాలైన మండిబజార్‌, చార్‌బౌళి, రంగంపేట, కొత్తూరుజెండా, కుమార్‌పల్లి, బొక్కలగడ్డ, జులైవాడ, చింతగట్టు, శంభునిపేట, గణేశ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో రెండు రోజులుగా గ్రేటర్‌ అధికారులు సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేయిస్తున్నారు. ఆరు ఫైర్‌ ఇంజిన్లతో అయా ప్రాంతాలను శుద్ధి చేస్తున్నారు.  

సరుకుల డోర్‌ డెలివరీకి ప్రత్యేక బృందాలు

కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులను డోర్‌  డెలివరీ చేసేందుకు కలెక్టర్‌ ఆర్జీ హన్మంతు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మార్కెటింగ్‌ శాఖ నుంచి ఒకరు, పోలీస్‌, కార్పొరేషన్‌, వాహన డ్రైవర్‌తో కూడిన నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌కు కార్పొరేషన్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తారు. మొత్తం 15 నిర్దేశిత ప్రాంతాలకు 25 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇలా 67 కాలనీల్లో 41,783 ఇళ్లకు నిత్యావసరాలు సరఫరా చేయనున్నారు. ఈ ప్రత్యేక బృందాలు ప్రతి రోజూ పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వారికి కావాల్సిన సరుకుల జాబితాను తీసుకుంటారు. సాయంత్రం జాబితాను అదనపు కలెక్టర్‌కు అందజేస్తారు. మరుసటి రోజు ఉదయం సరుకులు డోర్‌ డెలివరీ చేసి డబ్బులు తీసుకుంటారు. ఒక వేళ ఇంటిని గుర్తించడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను సదరు బృందం సభ్యులు సంప్రదించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక బృందంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక డ్రెస్‌ను అధికారులు అందజేశారు.

మైక్‌ల ద్వారా అవగాహన

కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మైక్‌ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లు వదిలి బయటికి రావొద్దంటూ ఆరోగ్య కార్యకర్త మైక్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటించాలని, తప్పని సరి పరిస్థితుల్లో బయటకు వస్తే సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. 

ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యటన

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి శనివారం నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. హన్మకొండ కుమార్‌పల్లి మార్కెట్‌, బొక్కలగడ్డ ప్రాంతాల్లో వారు స్వయంగా సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీని పరిశీలించారు. ప్రజ లు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఇంట్లో నుంచి బయటికి రాకుం డా లాక్‌ డౌన్‌ను కచ్చితంగా పాటిస్తే కరోనాను అరికట్టవచ్చన్నారు. నిబంధనలను అతిక్రమించి వాహనదారులు రోడ్లపైకి వస్తే వెహికల్‌ సీజ్‌ చేస్తామని సీపీ రవీందర్‌ హెచ్చరించారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు పొలీస్‌, రెవెన్యూ, మున్సిపాలిటీ, వైద్యారోగ్యశాఖ అధికారులు టీమ్‌ వర్క్‌గా పనిచేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆరు అగ్నిమాపక యంత్రాల ద్వారా నగరంలో సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారీ చేయిస్తున్నట్లు కమిషనర్‌ సత్పతి తెలిపారు.


logo