సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Apr 05, 2020 , 03:12:11

కరోనాపై పోరుకు డ్రోన్లు..!

కరోనాపై పోరుకు డ్రోన్లు..!

  • సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం స్ప్రేకు వాడకం
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వినియోగానికి ప్రణాళిక
  • ఇప్పటికే నర్సంపేట, తొర్రూరులో ప్రారంభం
  • ఫైరింజిన్లు, బ్రూమ్‌ స్ప్రేయర్లు, ట్యాంకర్లతోనూ పిచికారీ

వరంగల్‌రూరల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ నివారణకు అధికారులు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. మారుట్‌ డ్రోన్‌టెక్‌ సంస్థతో కలిసి పట్టణాలు, గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల చొరవతో ఆయా పట్టణాలు, గ్రామాల్లోని అన్ని రోడ్లపై పిచికారీకి డ్రోన్ల సాయం తీసుకుంటున్నారు. వరంగల్‌రూరల్‌ జిల్లాలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ కోసం రెండు నెలల వేతనం విరాళంగా ఇచ్చారు. రూ.5.50 లక్షలను ఈ ద్రావణం స్ప్రే చేసేందుకు అవసరమైన యంత్రాలు, పరికరాల కోసం వెచ్చించారు. దీంతో మారుట్‌ డ్రోన్‌టెక్‌ సంస్థ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేసేందుకు డ్రోన్‌తో నర్సంపేటకు చేరుకుంది. మొదట నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో స్ప్రే చేయడానికి గురువారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. 25 కిలోల బరువుతో ఉన్న రసాయనాలు స్ప్రే చేసే డ్రోన్‌లో 10 కిలోల ట్యాంకు ఉంది. దీన్ని నియంత్రించేందుకు పైలెట్‌, కోపైలెట్‌ ఉంటున్నారు. అలాగే నియోజకవర్గంలోని గ్రామాల్లోనూ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. శనివారం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలోని రోడ్లపై డ్రోన్‌తో పిచికారీ చేశారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. నర్సంపేట మున్సిపాటిలిటీ సహా నియోజకవర్గంలోని 179 గ్రామాల్లో కరోనా వైరస్‌ నివారణకు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేయనున్నట్లు చెప్పారు. 

తొర్రూరులోనూ ప్రారంభం

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోనూ డ్రోన్‌తో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీని శనివారం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఈ ద్రావణాన్ని స్ప్రే చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. సమూలంగా కరోనా వైరస్‌ను నాశనం చేసేందుకు ఈ డ్రోన్‌ స్ప్రేయర్‌ని వాడుతున్నట్లు చెప్పారు. తొర్రూరు పట్టణంలో అధికారులు డ్రోన్‌తో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మంత్రి ఎర్రబెల్లి స్వయంగా ఈ డ్రోన్‌ ఆపరేట్‌ చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఇతర పట్టణాలు, గ్రామాల్లోనూ స్ప్రే చేయడానికి అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. 

ఇతర యంత్రాలతోనూ స్ప్రే

వరంగల్‌ మహా నగరం సహా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనా వైరస్‌ నివారణకు సోడియం హైపోక్లోరైట్‌ను స్ప్రే చేసేందుకు డ్రోన్‌తో పాటు ఇతర యంత్రాలనూ ఉపయోగిస్తున్నారు. ఫైర్‌ ఇంజిన్లు, బ్రూమ్‌ స్ప్రేయర్లు, ట్యాంకర్లను వాడుతున్నారు. ట్యాంకర్లను అధికంగా గ్రామాల్లో వాడుతున్నారు. ప్రతి గ్రామంలో చేతి పంపులతో పారిశుధ్య సిబ్బంది సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. ఈ ద్రావణంతో పాటు బ్లీచింగ్‌ పౌడర్‌ను కూడా పట్టణాలు, పల్లెల్లో స్ప్రే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 


logo