బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Mar 30, 2020 , 00:56:21

పకడ్బందీగా లాక్‌డౌన్‌

పకడ్బందీగా లాక్‌డౌన్‌

  • ఉమ్మడి వరంగల్‌ జిల్లా అంతా అప్రమత్తం
  • నిర్మానుష్యంగా మారిన రోడ్లు
  • గస్తీ ముమ్మరం చేసిన పోలీసులు
  • పీహెచ్‌సీని పరిశీలించిన గండ్ర
  • జయశంకర్‌ భూపాలపల్లిలో వైద్యులతో అడిషనల్‌ ఎస్పీ సమీక్ష
  • క్వారంటైన్‌ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
  • నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్న ఎమ్మెల్యేలు చల్లా, పెద్ది, రాజయ్య

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజల్లో రోజురోజుకూ చైతన్యం పెరుగుతోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో పల్లెలు. పట్టణాల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు  భారీ ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో గస్తీ పెంచారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను చైతన్య పరచడంలో ముందుంటున్నారు. అన్ని మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ స్పష్టంగా కనిపించింది. ఎక్కడ కూడా ప్రజలు రోడ్ల మీదికి రాలేదు. పోలీసుల గస్తీ మినహా మరెవరూ కనిపించడం లేదు. వైద్యసిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని జాతీయ, రాష్ట్రీయ ప్రధాన రహదారులపై, అంతర్‌రాష్ట్ర రహదారులపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఆదివారం నిత్యావసర సరుకుల కోసం ప్రజలు బయటకు వచ్చారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ సరుకులను కొనుగోలు చేశారు. 

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో..

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో పరకాల, నర్సంపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. కలెక్టర్‌ హరితతో కలిసి ఆయా నియోజకవర్గాల్లోని ఐసోలేషన్‌ సెంటర్లను సందర్శించి తగు సూచనలు చేస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో కరోనా వైరస్‌ నియంత్రణకు తన రెండు నెలల వేతనం రూ.5.50లక్షలను విరాళంగా కేటాయించినట్లు ఎమ్మెల్యే పెద్ది వెల్లడించారు. ఇప్పటికే ఆరువేల లీటర్ల సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని తెప్పించినట్లు తెలిపారు. నర్సంపేట మండలంలోని గురిజాల, భోజ్యనాయక్‌తండా, దాసరిపల్లి, మాదన్నపేట, రామవరం, పర్శనాయక్‌తండా, గుంటూర్‌పల్లి గ్రామాలకు పుణె, సూరత్‌, తదితర ప్రాంతాల నుంచి ఆరుగురు శనివారం సాయంత్రం రాగా ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించారు. వారి రిపోర్టులను పరిశీలించారు. పరకాల నియోజకవర్గంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావకం పిచికారీకి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పక్కా ప్లాన్‌ రూపొందించారు. హన్మకొండలోని శ్రీదేవి అమ్మ అనాథ ఆశ్రమానికి ఆయన రూ.50వేల నగదు, క్వింటాల్‌ బియ్యాన్ని విరాళంగా అందజేశారు. 

జనగామలో..

జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రజలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. జిల్లాలో 53మంది విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించి వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పారిశుధ్య కార్మికులు నిత్యం రసాయనాలు చల్లుతున్నారు.

 జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో.. 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో డాక్టర్లతో జిల్లా అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి, తీసుకుంటున్న జాగ్రత్తలు, భవిష్యత్‌ పరిణామాలు తదితర విషయాలు, పోలీసు యం త్రాంగం సహకరించాల్సిన తీరుపై ఈ సమీక్షలో చర్చించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌ను మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సందర్శించారు. కాటా రం మండలం ధన్వాడ, గుమ్మల్లపల్లి, ఒడిపిలవంచ, వీరాపూర్‌, గుండ్రాత్‌పల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులకు మాస్క్‌లు, సబ్బులు పంపిణీ చేశారు. 

ములుగులో..

ఏటూరునాగారం మండలం జీడివాగు సమీపంలోని కొమురంభీం నగర్‌ గొత్తికోయలు, మండల కేంద్రంలోని వడ్డెర కూలీలు, గోవిందరావుపేటలోని నిరుపేద కూలీలకు ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని రామాలయం ఆవరణలో నిరుపేద కుటుంబాలకు హోటల్‌ యజమాని సప్పిడి రాము కూరగాయలు పం పిణీ చేశారు. మంగపేట మండలం కమలాపురం శివా రు మిర్చి చేలు, కల్లాలను ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. రైతులు, కూలీలకు అవగాహన కల్పించారు. అన్నదాన కార్యక్రమాలు కొనసాగాయి. 

మహబూబాబాద్‌లో..

మహబూబాబాద్‌ పట్టణంలో ఇంటింటా ర్యాపిడ్‌ సర్వే నిర్వహిసున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ అంబరీష, జిల్లా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి కొత్తగా వచ్చిన వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నామన్నారు. తొర్రూరులో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన వైద్యుడు దిలీప్‌, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో 16బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తున్నాయి. 

వరంగల్‌ అర్బన్‌లో రహదారుల మూసివేత

వరంగల్‌ నగర ప్రధాన రాహదారులను కలిపే అంతర్గత రహదారులను పోలీసులు మూసివేశారు. నగర ప్రధాన కూడళ్ల వద్ద పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఖమ్మం రోడ్డు,  ఎంజీఎం సెంటర్ల వద్ద రోడ్లపై పోలీసులు పాండాలు ఏర్పాటు చేసి వాహనాలు రాకుండా చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. 11గంటల తర్వాత రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఫోన్‌లో బుక్‌ చేస్తే నిత్యావసర సరుకులను ఇంటికే పంపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 


logo