సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Mar 30, 2020 , 00:54:39

ఇల్లే వెంటిలేటర్‌.. శుభ్రతే ఐసీయూ!

ఇల్లే వెంటిలేటర్‌.. శుభ్రతే ఐసీయూ!

  • లాక్‌డౌన్‌ పరమార్థం అదే
  • సామాజిక దూరమే భద్రత 
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే బాధ్యత అందరిది
  • 14 రోజుల స్వీయ క్వారంటైన్‌ అనివార్యం 
  • ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాం 
  • నోడల్‌ అధికారి డాక్టర్‌ వీ చంద్రశేఖర్‌

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: ఎవరి ఇల్లు వారికి వెంటిలేటర్‌. శుభ్రతను ఐసీయూగా మలుచుకోవాలన్నదే లాక్‌డౌన్‌ పరమార్థం. వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ, నిర్బంధం, సామాజిక దూరాన్ని పాటించడం కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే దివ్యమైన మార్గమని ఎంజీఎం దవాఖాన సీనియర్‌ ఫిజీషియన్‌, కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక నోడల్‌ అధికారి డాక్టర్‌ వీ చంద్రశేఖర్‌ అన్నారు. కరోనా వైరస్‌ నిరోధానికి ఎవరేం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎంజీఎంలో ఉన్న సౌకర్యాలు? తదితర అంశాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి. 

నమస్తే తెలంగాణ : కరోనా అంటే ఏమిటి? 

డాక్టర్‌ చంద్రశేఖర్‌ : జలుబు లాంటి శ్వాసకోశ వ్యాధిని కలుగజేసేదే కరోనా వైరస్‌. ఈ వైరస్‌ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నది. కాకపోతే ఇటీవల దాని జన్యువులో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఎన్‌సీవోబీ (దీన్నే కొవిడ్‌-19 అంటున్నాం). ఇదే కరోనా వైరస్‌ వ్యాధిగా రూపాంతరం చెందింది. నిమోనియాను (ఊపిరితిత్తుల్లో నిమ్మును) కలుగజేసి మనిషికి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాల మీదికి తీసుకొస్తుంది. 

నమస్తే : ఈ వైరస్‌ను ఎలా అరికట్టవచ్చు.? 

డాక్టర్‌ : జలుబు ఎలా వ్యాప్తి చెందుతుందో కరోనా వైరస్‌ అలాగే వ్యాప్తి చెందుతుంది. వైద్య పరిభాషలో దీనిని డ్రాఫ్ట్‌లిట్‌ ఇన్‌ఫెక్షన్‌ అంటారు. దగ్గినప్పుడు, బిగ్గరగా మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు శ్వాసకోశం నుంచి ఉద్భవించే తుంపర్లు నోటివెంట బయటపడతాయి. అలా బయటపడేదే కరోనా వైరస్‌. శ్వాసకోశం నుంచి ఉద్భవించే తుంపర్లు ఇతరులు, పరిసరాలు, వస్తువుల మీద పడుతాయి. ఇలా వ్యాప్తి చెందుతూ వెళ్తుంది. దగ్గినప్పుడు చేతిలో దస్తీ లేకపోతే మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. 

నమస్తే : కరోనా జీవితకాలం ఎంత? 

డాక్టర్‌ : సహజంగా వైరస్‌ జీవితకాలం 12 గంటలు. అదృష్టవశాత్తు కరోనాకు గాలిలో వ్యాప్తించే గుణం లేదు. పైకి వెళ్లే స్వభావం ఉండదు. జారుడుగుణం ఉంటుంది. బరువు రీత్యా ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా అది తిరిగి నేలమీదనో, వ్యక్తి వేసుకున్న బట్టల మీదనో, ముందున్న వస్తువుల మీదనో, గోడల మీదనో పడుతుంది. గాలిలో 12 గంటలు, బట్టల మీద ఆరు గంటలు, చదునైన నేల మీద (ఇళ్ల ఫ్లోరింగ్‌..పుట్టి పెట్టిన గోడల మీద) కాస్త ఎక్కువ సమయం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉంచాలి. ఒక పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ద్వారా కనీసం ఒక్కరి నుంచి ఒకరు చొప్పున లెక్కగట్టినా...లెక్కలకు అందవు. కనుక హోం క్వారంటైన్‌లోనే ఉండాలి. ప్రభుత్వం చెప్పేవరకూ బయటకు రాకూడదు. 

నమస్తే : ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యసేవలు, సిబ్బంది లభ్యత ఏ స్థాయిలో ఉంది?  

డాక్టర్‌ : దేశవ్యాప్తంగా 111 వైరల్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి. నేను కేఎంసీ ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో ఉత్తర తెలంగాణకు అందుబాటులో ఇక్కడ కూడా ఆ ల్యాబ్‌ ఉండాలని ప్రతిపాదనలు చేశాను. అదృష్టవశాత్తు ప్రభుత్వం నుంచి ఇటీవల బయోసేఫ్టీ క్యాబినెట్‌ పరికరం వచ్చింది. టెక్నీషియన్లకు శిక్షణ ఇప్పించే పనిలో ఉన్నాం. ఇక ఎంజీఎంలో 60 పడకల యూనిట్‌ సిద్ధంగా ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీటి సంఖ్యను డబుల్‌ చేశాం. 14 మంది డాక్టర్లు సహా 66 మంది పీజీలు, హౌస్‌సర్జన్లు అందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు 500 మంది పైచిలుకు అనుమానితులు వస్తే వారిలో 20 మందిని ఐసోలేషన్‌లో ఉంచాం. అందులో 18 మందికి నెగెటివ్‌ రిపోర్టులు వచ్చాయి. మరో రెండు రిపోర్టులు రావాల్సి ఉంది.


నమస్తే : కరోనా వైరస్‌ సోకితే మరణమే అన్నట్టా..?  

డాక్టర్‌ : కరోనా వైరస్‌ మనిషిలోపలే ఉంటే ప్రమాదం ఏమీ ఉండదు. పాజిటివ్‌గ్రస్తుడికి రోగనిరోధక శక్తిని పెంచేందుకు వైద్యులు నిరంతరం ఐసోలేషన్‌లో ఉంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. 100 మందిని తీసుకుంటే ఇందులో 85 శాతం మందికి జలుబు మాత్రమే ఉంటుంది. 10 శాతం మందికి నిమోనియా (వీరికి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య) ఉంటుంది. మరణాలు ఐదు శాతం కంటే తక్కువగా ఉంటాయి. అయితే ఇప్పటి వరకు 65 ఏళ్ల పైబడిన వారే ఎక్కువగా మరణించారు. అందుకు కారణం హైపర్‌టెన్షన్‌, శ్వాసకోశవ్యాధులు, ఆస్తమా, గుండెజబ్బులు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడం, ఇంటికే పరిమితమవడం, సామాజిక దూరాన్ని పాటించడం  తప్ప వేరే మార్గం లేదు. కనుక ఇల్లే వెంటిలేటర్‌. సాధ్యమైనంత ఎక్కువసార్లు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుగుతూ ఉండాలి. 

నమస్తే : లాక్‌డౌన్‌కు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గల సంబంధం ఏమిటి? 

డాక్టర్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌనే సరైన శాస్త్రీయ పద్ధతి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను అంచనావేసి తమ ప్రజల యోగక్షేమాలే పరమార్థంగా భావించిన ప్రభుత్వం కనుకనే ఈ నిర్ణయం తీసుకున్నది. ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చుచేసి మందులను కొనుగోలు చేసే సత్తా అన్ని ప్రభుత్వాలకు ఉంది. ఇటలీ, చైనా, స్పెయిన్‌ అంతెందుకు అమెరికాలో దాదాపు లక్షకు చేరువలో కరోనా బాధితులున్నారని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో చూసినప్పుడు వాళ్లు కోట్ల డాలర్లు పెట్టి మనుషుల ప్రాణాలను కాపాడుకోవాలని ఉన్నా మందులేదు. వ్యాప్తిని తేలిగ్గా తీసుకోవడం వల్లే ఇంత నష్టం. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల యోగక్షేమాల కోసం ఎక్కడిదాకైనా వెళ్లొచ్చు. కొంతమంది కోసం మొత్తం ప్రజల విధ్వంసాన్ని ఏ ప్రభుత్వం కోరుకోదు కదా! కనుక ప్రజలు కచ్చితంగా పాటించాలి. logo