మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Mar 28, 2020 , 02:59:58

లాక్‌డౌన్‌తో కరోనా కట్టడి

లాక్‌డౌన్‌తో కరోనా కట్టడి

  • ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్య సిబ్బంది సేవలు
  • ప్రజలు ఏప్రిల్‌ 14 వరకు ఇళ్లకే పరిమితం కావాలి
  • రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ 
  • ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో పర్యటన 
  • కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టిన చర్యలపై ఆరా  

‘ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను లాక్‌డౌన్‌తో కట్టడి చేయవచ్చు. ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలి. ప్రజలు ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. వైద్య సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్నారు. వైరస్‌ కట్టడికి యంత్రాంగం విశేషకృషి చేస్తున్నది.’ అని రాష్ట్ర గిరిజన , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శుక్రవారం మంత్రి మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో  పర్యటించారు. మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లిలో శానిటేషన్‌, గూడూరు మండలంలోని సీహెచ్‌సీని, ములుగు జిల్లా దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డును పరిశీలించారు. అక్కడి నుంచి రైతు బజార్‌కు వెళ్లి ఏర్పాట్లను తెలుసుకున్నారు. అనంతరం ములుగు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని విభాగాల అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించడం వల్ల నేడు క్వారంటైన్‌లో ఉన్న వారు సైతం డిశ్చార్జ్‌ అవుతున్నారని తెలిపారు.  కొన్ని గ్రామాల్లో ప్రజలు ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారని, వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి వస్తున్నదన్నారు. అది ప్రజల మేలు కోసమేనని సత్యవతి గుర్తు చేశారు. 

ములుగు, నమస్తేతెలంగాణ/ములుగు కలెక్టరేట్‌: జగతికే విపత్తులా పరిణమించిన కరోనా వైరస్‌ కట్టడికి వైద్యారోగ్య సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందిస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వైరస్‌ కట్టడికి అమలు చేస్తున్న చర్యలను ములుగు జిల్లాలో శుక్రవారం పర్యటించి పరిశీలించారు. తొలుత జిల్లా దవాఖానను సందర్శించి ఐసోలేషన్‌ వార్డులను పరిశీలించారు. అక్కడి నుంచి అంగడి మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజారుకు వెళ్లి కొనుగోలుదారులు పాటించాల్సిన సూచనల కోసం చేసిన ఏర్పాట్లను చూశారు. వ్యాపారస్తులతో మంత్రి మాట్లాడుతూ.. కూరగాయలు కొనుగోలు చేసే ప్రజలు సామాజిక దూరం పాటించేలా వ్యాపారస్తులు చర్యలు చేపట్టాలని అన్నారు. అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తే  కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ ఎస్‌ కృష్ణ ఆదిత్యను లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ అమలు చేయడంలో పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని, జిల్లా యంత్రాంగం సైతం అద్భుతంగా పని చేస్తున్నదని కొనియాడారు.  ప్రజలు, అధికారులు ఇదే స్ఫూర్తిని ఏప్రిల్‌ 14వ తేదీ వరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని  గ్రామాల్లో ఇతరులు ఎవరూ తమ గ్రామానికి రావద్దనే మంచి ఉద్దేశంతో ముళ్లకంచెలు వేస్తున్నారని, దీని వల్ల అత్యవసర సేవలు అందించే విషయంలో అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అనంతరం విలేకరులకు, ఇతర అధికారులకు మంత్రి క్లాత్‌లతో తయారు చేసిన మాస్క్‌లను పంపిణీ చేశారు.  సమావేశంలో  జెడ్పీ చైర్మ న్‌ కుసుమ జగదీశ్వర్‌, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హన్మంత్‌కొండి బా, ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, ఏఎస్పీ సాయిచైతన్య, ఆర్డీవో రమాదేవి, డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య, డీపీవో వెంకయ్య, ప్రభు త్వ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్వ ర్‌, డీడబ్ల్యూవో మల్లీశ్వరీ తదితరులు పాల్గొన్నారు. 

మల్లంపల్లి చెక్‌పోస్టు పరిశీలన 

ములుగురూరల్‌: ములుగు జిల్లా కేంద్రం పరిధిలోని మల్లంపల్లి గ్రామంలో  ఏర్పాటు చేసిన పోలీస్‌ చెక్‌పోస్టును  మంత్రి సత్యవతిరాథోడ్‌, ములుగు జెడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌తో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఆమె చెక్‌పోస్టు వద్ద శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకున్నారు. జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చే  వారికి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించి తిరిగి ఇండ్లకు వెళ్లేలా చూడాలన్నారు. అనంతరం ఆమె గట్టమ్మ దేవాలయం వద్దకు చేరుకొని కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడాలని జెడ్పీచైర్మన్‌తో కలిసి గట్టమ్మను వేడుకున్నారు. 

 పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి గ్రామ పంచాయతీలో శానిటేషన్‌ పనులను శుక్రవారం మంత్రి సత్యవతిరాథోడ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో కరోనా వైరస్‌ను నివారించవచ్చన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు ఉదయం డెటాల్‌ స్ప్రే చేయాలని ఆదేశించారు. ఆమె వెంట సర్పంచ్‌ సంద వీరన్న, గ్రామ పంచాయతీ సిబ్బంది  పాల్గొన్నారు. 

 దవాఖాన  పరిశీలన

గూడూరు: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని సీహెచ్‌సీ దవాఖానను మంత్రి సత్యవతి రాథోడ్‌, కలెక్టర్‌ గౌతమ్‌ వేర్వేరుగా పరిశీలించారు.  దవాఖానలోని వసతులపై ఆరా తీశారు.  ఈ సందర్భంగా వైద్యాధికారులతో మం త్రి మాట్లాడుతూ.. దవాఖానలో 10 బెడ్ల ఐసీ యూ కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తామని, త్వరలో టెక్నీషియన్స్‌ వచ్చి పనులు పూర్తి చేస్తారని తెలిపారు. దవాఖాన చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి పూర్తి చేయిస్తామని మంత్రి రాథోడ్‌ తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ భీంసాగర్‌, సూపరింటెండెంట్‌  రాజ్‌కట్టయ్య, డీఎస్పీ నరేశ్‌కుమార్‌, ట్రైనీ ఐపీఎస్‌ యోగేశ్‌గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo