సోమవారం 30 మార్చి 2020
Mulugu - Mar 27, 2020 , 02:31:56

దండం పెడుతున్న.. గడప దాటొద్దు

దండం పెడుతున్న.. గడప దాటొద్దు

  • కరోనాపై నిర్లక్ష్యం పెను ప్రమాదం
  • నిత్యావసరాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు
  • వైద్యులు, పోలీసుల పనితీరు భేష్‌
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జనగామ, నమస్తేతెలంగాణ: ‘దండం పెట్టి చెబుతున్న.. గడపదాటొద్దు .కష్టాలు..నష్టాలు ఎ దురైనా మనం.. మన కుటుంబం..మన సమాజం కోసం కొద్దిరోజులు భరిద్దాం. ప్రభుత్వం మిమ్మ ల్ని కడుపులో పెట్టుకొని కాపాడుద్ది.. మన జీవితాలు మన చేతుల్లోనే ఉన్నాయి. వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌పై నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదం సంభవిస్తది. అశ్రద్ధ చేస్తే ప్రజలంతా ఆగమైతరనే సీఎం కేసీఆర్‌ ముందస్తుగా కఠిన నిర్ణయాలు తీసుకున్నరు. అందుకే రాష్ట్రంలో సత్ఫలితాలు వస్తున్నాయి’ అని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌ కే నిఖిల, డీసీపీ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డితో కలిసి వైద్యారోగ్యశాఖ, పోలీసు, పంచాయతీ, డీఆర్డీవో, మున్సిపల్‌ అధికారులతో కరోనా వైరస్‌ నిర్మూలనపై ప్రభుత్వ మార్గదర్శకాలు, తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం సహా వివిధ ప్రాంతాలకు ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 53 మంది అనుమానితులకు పరీక్షలు చేపిస్తే నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందన్నారు. జిల్లాలో కలెక్టర్‌ సహా వైద్య, ఆరోగ్య, సంబంధిత శాఖల అధికారులు, డీసీపీ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం చురుగ్గా పని చేస్తున్నదన్నారు. గ్రామ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారన్నారు. కూరగాయలు, పాలు, నిత్యావసరాలు, మందులు అందడంలో కష్టాలు..ఇబ్బందులుంటే చెబితే తీరుస్తామన్నారు.  

రెవెన్యూ గ్రామానికో కొనుగోలు కేంద్రం..

ఈసారి జిల్లాలో యాసంగి  ధాన్యం దిగుబడులు బాగా వస్తున్నాయి. రైతులు మార్కెట్‌ యార్డుకు సరుకులు తేవద్దు. రెవెన్యూ గ్రామానికి ఒకటి చొప్పున కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా మద్దతు ధరకు కొంటామని మంత్రి స్పష్టం చేశారు. రైతులు వ్యవసాయ పనులు, ఉపాధి కూలీలు సాధారణంగా పనులు చేసుకోవాలని, గుంపుగుంపులుగా కాకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ పనులు కొనసాగించవచ్చని మంత్రి సూచించారు.    

ప్రత్యేక పాసులు జారీ చేస్తాం..

జిల్లాలో కూరగాయలు, నిత్యావసర సరుకుల రవాణాకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా లారీలు, డీసీఎంలు, టాటా ఏస్‌లు, మినీవ్యాన్లకు  పాసులను జారీ చేస్తామని మంత్రి ప్రకటించారు. వీరితోపాటు జర్నలిస్టులు, కరోనా విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది, పేపర్‌బాయ్‌లు, పాల బూత్‌లకు పాస్‌లు ఇస్తామన్నారు.సమస్యలుంటే వెంటనే ఫిర్యాదు చేసేందుకు కాల్‌సెంటర్‌ సహా 100కు డయల్‌ చేయవచ్చని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. నిత్యావసర సరుకులను రెట్టింపు ధరలు, బ్లాక్‌మార్కెట్‌లో అమ్మినా కఠిన చర్యలు సహా జైలుకు పంపుతామని హెచ్చరించారు. బచ్చన్నపేట మండలానికి చెందిన ప్రజాప్రతినిధులంతా తమ నెల వేతనాన్ని సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేస్తూ ఇచ్చిన లేఖను ఇర్రి రమణారెడ్డి మంత్రి, ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం పట్టణంలోని నెహ్రుపార్కు సెంటర్‌ వద్ద మంత్రి కాన్వా య్‌ ఆపి కూరగాయల దుకాణాలు, బస్టాండ్‌ రోడ్డులో కిరాణం దుకాణాలను తనిఖీ చేశారు.  కిరాణ దుకాణాల ఎదుట పోలీసుశాఖ ఏర్పాటు చేసిన సూచిక బోర్డులపై మంత్రి, ఎమ్మెల్యే డీసీపీని అభినందించారు. 

మన సంప్రదాయాలే శ్రీరామరక్ష

సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి స్వచ్ఛత ఇప్పుడు ప్రపంచ దేశాలకు దిక్సూచి అయ్యాయని, మన సంస్కృతీసంప్రదాయలను నిత్యజీవితంలో పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడన్నది స్పష్టమైందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.   బచ్చన్నపేట మండల ప్రతినిధులు అందించిన నెల వేతన విరాళంతో మండలంలోని అన్ని గ్రా మాల ప్రజలకు శానిటైజర్లు అందజేస్తామని చెప్పారు. 

  ప్రభుత్వ నిబంధనలు పాటించాలి 

పాలకుర్తి రూరల్‌: కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రజలు  ప్రభుత్వ నిబంధనలు పాటించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం లాక్‌ డౌన్‌ సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంతో పాటు ఎల్లరాయిని తొర్రూరులో  ఆకస్మికంగా  పర్యటించి కూరగాయలు నిత్యావసర సరుకుల ధరలను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు వస్తువులను బ్లాక్‌ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, సీఐ బానోతు రమేశ్‌, ఎస్సై గండ్రాతి సతీశ్‌, సర్పంచ్‌ వీరమనేని యాకాంతరావు, నాయిని మల్లారెడ్డి,  మైసిరెడ్డి, వర్రె వెంకన్న, అంజీరావు, తరాల చంద్రబాబు, తమ్మి రాంబాబు, వీరమనేని హనుమంతరావు, గజ్జి సంతోష్‌, పెనుగొండ రమేశ్‌, గాదెపాక ఎల్లయ్య, మనోహరస్వామి, మామిండ్ల లక్ష్మణ్‌, కిషన్‌ నాయక్‌ పాల్గొన్నారు.

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు

తొర్రూరు, నమస్తే తెలంగాణ: నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. తొర్రూరు డివిజన్‌ కేంద్రంలో గురువారం మంత్రి కిరాణం, కూరగాయల షాపుల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయల షాపుల వద్దకెళ్లి కిలో టమాటా ఎంత...? అని అడిగగా వ్యాపారి 20 కిలో అని సమాధానమిచ్చారు. మరో షాపు వద్దకు వెళ్లి అడిగితే ఒక్కరు కిలో టమాటా రూ. 15 అని మరొకరు రూ. 10 అని చెప్పడంతో ధరల్లో వత్యాసమేంటని ప్రశ్నించారు. నేటి నుంచి షాపుల ఎదుట కూరగాయల ధరల పట్టికను ప్రదర్శించాలని సూచించారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు సౌకర్యం కల్పించినప్పటికీ పరిస్థితిని అణువుగా తీసుకుని ధరలను పెంచి అమ్మడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  సాయంత్రం 6 తర్వాత  ఏ ఒక్కరూ రోడ్డుపైకి రావడంగాని, షాపులు తెరవడంగాని చేయవద్దని సూచించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మంగలపల్లి రాంచద్రయ్య, వైస్‌ చైర్మన్‌ జినుగ సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ ఎన్నమనేని శ్రీనివాస్‌రావు, సీఐ చేరాలు తదితరులు పాల్గొన్నారు. 


logo