గురువారం 02 ఏప్రిల్ 2020
Mulugu - Mar 27, 2020 , 02:32:40

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

  • బోసిపోయిన రహదారులు.. జిల్లా అంతా అప్రమత్తం

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో లాక్‌డౌన్‌ గురువారం సైతం పకడ్బందీగా కొనసాగింది. 11 మండలాలు, 241 గ్రామాలు, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జనం అత్యవసర పనుల నిమిత్తం తప్ప..మరెందుకూ బయటికి రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ సామాజిక దూరాన్ని పాటిస్తూ వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఉగాది తెల్లారి కొత్త సాలు పేరుతో వ్యవసాయ పనులను ప్రారంభించేందుకు సంప్రదాయబద్ధంగా  కుటుంబ సమేతంగా ప్రతి రైతు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పనులు ప్రారంభిస్తారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో  కుటుంబం నుంచి ఒక్కొక్కరు మాత్రమే వెళ్లి పనులు ప్రారంభించుకున్నారు. జిల్లాలోని సరిహద్దులకు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దుల్లో యథావిధిగా నిఘా కొనసాగుతూనే ఉంది.  జిల్లా కేంద్రంలో ఉన్న మార్కెట్‌లో రద్దీ పెరుగకూడదనే ఆలోచనతో కూరగాయల మార్కెట్‌ను విస్తరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ స్వర్ణలత ఆధ్వర్యంలో బస్టాండ్‌తో పాటు పలు సెంటర్లలో కూరగాయల మార్కెట్లను అదనంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. జేసీ వెంట అదనపు కలెక్టర్‌ రాజా విక్రంరెడ్డి ఉన్నారు. సుభాష్‌ కాలనీ, రామాలయం, కృష్ణకాలనీ, బస్‌ డిపో, హనుమాన్‌ ఆలయం వంటి చోట్ల ఈ మార్కెట్లను ఏర్పాటు చేసి ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలోనే రద్దీ లేకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ సకాలంలో కొనుగోలు చేసుకొని వెనుదిరిగేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా జిల్లా పోలీసు యంత్రాంగం వ్యాపారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సామాజిక దూరం పాటించడంతో పాటు వ్యాపారులు పాటించాల్సిన నియమ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు, ధర నియంత్రణ తదితర అంశాలపై  చర్చించారు. అనంతరం అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు వ్యాపారస్తులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యాపారులకు ఎదురయ్యే ఇబ్బందులను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించే దిశలో కృషి చేస్తాం, వ్యాపారులు కూడా ప్రభుత్వ జీవోకు అనుగుణంగా వ్యాపారం జరుపుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీ సంపత్‌రావు, సీఐ వాసుదేవరావు పాల్గొన్నారు. 

రోడ్లపై రసాయనాల పిచికారీ

కరోనా కట్టడి కోసం భూపాలపల్లి పట్టణంలో సింగరేణి యాజమాన్యం పెద్ద ఎత్తున ట్యాంకర్ల ద్వారా వైరస్‌ నిరోధక రసాయనాలను స్ప్రే చేయించింది. సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లిలో ఈ కార్యక్రమాన్ని సింగరేణి నిర్వహించడంపై  కార్మిక కుటుంబాలు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.  

 అవగాహన కల్పించిన జెడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీహర్షిణి 

సీఎం కేసీఆర్‌ పిలుపును అందుకున్న జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి గురువారం భూపాలపల్లిలోని పలు ప్రధాన రహదారులపై అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడక్కడ కనిపించిన వాహనదారులను  ఆపి రోడ్లపైకి రావొద్దని సూచించారు.  సాటివారికి ఇబ్బంది లేకుండా చూడాలని, కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటించాలన్నారు.   

దుకాణాల తనిఖీ

భూపాలపల్లి, మహాముత్తారం, గణపురం, చిట్యాల, టేకుమట్ల, కాటారం, రేగొండ తదితర మండలాల్లో అధికారులు పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గణపురం మండలంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో కూరగాయల క్రయ విక్రయాలు, ధరల నియంత్రణను పరిశీలించారు. అదేవిధంగా మహాముత్తారం మండలంలోని దుకాణాల్లో అమ్ముతున్న ధరలను తహసీల్దార్‌ సునీత ఆధ్వర్యంలో అడిగి తెలుసుకున్నారు. 


logo
>>>>>>