శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Mar 26, 2020 , 02:43:11

మంత్రి ఎర్రబెల్లికి సీఎం పండుగ శుభాకాంక్షలు

మంత్రి ఎర్రబెల్లికి సీఎం పండుగ శుభాకాంక్షలు

  • ఉమ్మడి జిల్లాకు సాగునీటి అవసరంపై సీఎం ఆరా 
  • మరో 15రోజులు నీళ్లు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి
  • ఉగాది శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌

పర్వతగిరి, మార్చి 25 :  సీఎం కేసీఆర్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు బుధవారం ఫోన్‌ చేసి శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు అందుతున్నాయా..? ఇంకా రైతులకు నీటి అవసరం ఉందా..? ఇంకా ఎంత కాలం నీరు కావాలి..? అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు సీఎంకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి మరో 15 రోజుల పాటు కాళేశ్వరం నీరు ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతాంగానికి అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం మొక్కజొన్న పంటలకు మరో తడికి నీటి అవసరం ఎంతో ఉందన్నారు. మరో 10, 15 రోజుల పాటు కాళేశ్వరం నీరు అందేలా చూడాలని సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించారు. మంత్రి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే పూర్వ వరంగల్‌ జిల్లాలో కరోనా వైరస్‌ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితి ఏమిటని మంత్రి దయాకర్‌రావును సీఎం కేసీఆర్‌ అడుగగా.. మంగళవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కలెక్టర్లు, వైద్య అధికారులతో సమీక్షించినట్లు చెప్పారు.  ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసు  నమోదు కాలేదని, ముందు జాగ్రత్తలు చేపట్టామని వివరించారు. వరంగల్‌ ఎంజీఎంకు కరోనా పరీక్షలు చేసే కిట్‌ను మంజూరు చేసినందుకు మంత్రి సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌ జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క కేసు నమోదు కాకపోవడం మంచి పరిణామమని, మంత్రి ఎర్రబెల్లి, అధికారుల పనితీరును సీఎం కేసీఆర్‌ అభినందించారు.  అలాగే మంత్రికి గవర్నర్‌ తమిళిసై కూడా ఫోన్‌ చేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.


logo