శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Mar 26, 2020 , 02:48:28

గడపదాటని ఉగాది..

గడపదాటని ఉగాది..

  • పండుగపూట ఇండ్లకే పరిమితమైన ప్రజలు
  • ఆలయ సందర్శన, పంచాంగశ్రవణాలు బంద్‌
  • వ్యక్తిగత శుభ్రతపై ప్రజల్లో పెరుగుతున్న శ్రద్ధ
  • కొవిడ్‌ భయంతో వీధులన్నీ నిర్మానుష్యం
  • కొనసాగుతున్న గ్రామ దిగ్బంధాలు
  • నిరంతరం శ్రమిస్తున్న వైద్య సిబ్బంది
  • లాక్‌డౌన్‌లో మూడో రోజు ప్రశాంతం

శార్వరి నామ సంవత్సర సంబురాలేవీ గడప దాటలేదు. ఉన్నదాంట్లోనే సర్దుకుని ప్రజలు పండుగను జరుపుకున్నారు. ఎప్పటిలాగా పండుగ కోసం మార్కెట్లకు పోటెత్తడాలు, ఎగబడి మరీ కొనుగోలు చేయడాలు, బంధువుల ఇండ్లకు వెళ్లడాలేవీ ఈసారి కనిపించలేదు. కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలను ప్రజలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా పండుగ సంబురాలేవీ రోడ్లపై కనిపించలేదు. ప్రజలు ఆలయాలు, పంచాంగ శ్రవణ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పల్లెల్లో గ్రామ దిగ్బంధాలు కొనసాగుతున్నాయి. ఎంజీఎంలో చేరిన అనుమానితుల్లో ఇద్దరు మినహా మిగతా అందరి రిపోర్టులు నెగెటివ్‌ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఇద్దరి రిపోర్టులు ఒకట్రెండు రోజుల్లో వస్తాయని, వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యాధికారులు వెల్లడించారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌లో మూడోరోజు ప్రశాంతంగా ముగిసింది.

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కరోనా కట్టడి జిల్లాలో కట్టుదిట్టంగా జరుగుతున్నది. పట్టణం నుంచి గిరిజన పల్లెల వరకు ప్రజలందరూ కరోనా విముక్తికి నడుంబిగించారు. ఎవరికి వారు స్వీ యనిర్బంధంలో ఒంటరిగా ఉంటూ సమష్టిగా పోరాడుతున్నారు.  ఇక పలు గ్రామాల్లో బుధవారం ప్రజలు ర హదారులను ముళ్లకంచెలతో మూసివేయించారు. గ్రా మాల్లోకి బయటివ్యక్తులు రావద్దంటూ వేడుకున్నా రు. ములుగు, నమస్తే తెలంగాణ/ములుగు రూరల్‌/వెంకటాపురం (నూగూరు)/ఏటూరునాగారం/గోవిందరావుపేట/మంగపేట/వాజేడు : ఆస్ట్రేలియా నుంచి బుధవారం ములుగు పట్టణానికి వచ్చిన ఓ ఫొటోగ్రాఫర్‌ను వైద్యులు పరీక్షించారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. జిల్లా దవాఖానలో కరోనా లక్షణాలతో బాధ పడుతున్న 10 మంది అనుమానితులకు సైతం వైద్యులు పరీక్షలు చేశారు. ములుగు మండలంలోని 10 గ్రామ పంచాయతీల్లో గ్రామస్తులు రహదారులను దిగ్బంధనం చేశారు. బుధవారం కాసీందేవిపేట గ్రామంలో సర్పంచ్‌ అహ్మద్‌ పాషా ఆధ్వర్యంలో గ్రామ రహదారులను ముళ్లకంచెతో మూసివేయించారు. వెంకటాపురం (నూగూరు) మండలంలోని పలు గ్రామాల రహదారులను ముళ్లకంచెలతో మూసివేశారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు స్పందించిన వెంకటాపురం నూగూరు జెడ్పీటీసీ పాయం రమణ ముఖ్యమంత్రి సహాయనిధికి పదివేల రూపాయల విరాళం అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌, వాజేడు, వెంకటాపురం ప్రాంతాల నుంచి 163 జాతీయ రహదారి మీదుగా ఏటూరునాగారం మండలంలోని ఎక్కెల, ఆకులవారి ఘనపూర్‌, ముల్లకట్ట, రాంపూర్‌ గ్రామాలకు వెళ్లే రహదారులపై ముళ్లకంచెలు అడ్డుగావేశారు. ఎక్కెల, ఆకులవారిఘనపూర్‌కు చెందిన ప్రజలు సీఐ నాగబాబు, ఎస్సై శ్రీకాంత్‌ రెడ్డి, తహసీల్దార్‌ సర్వర్‌పాషా ఆధ్వర్యంలో ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. గోవిందరావుపేట మండలంలోని గాంధీనగర్‌, కర్లపల్లి, లక్ష్మీపురం, గ్రామాల పొలిమేరల్లో రోడ్లపై ముళ్లకంచె వేశారు. పస్రా ఎస్సై మహేందర్‌ కుమార్‌ గ్రామప్రజలకు పలు సూచనలు చేశారు. మంగపేట మండలం కమలాపురంలోని సినిమాహాల్‌వీధిలో ఎడ్లబండ్లను అడ్డుగా పెట్టారు. నర్సింహసాగర్‌ గ్రామస్తులు కూడా రహదారికి బారీకెడ్లను ఏర్పాటు చేశారు. వాజేడు మండలంలోని జగన్నాథపురం, పెద్దగొల్లగూడెం గ్రామాల్లో హైదరాబాద్‌ టూ భూపాలపట్నం 163 జాతీయ రహదారులపై దుంగలను అడ్డుగా పెట్టారు. ఆర్‌గుంటపల్లి, రాంపురం, చింతూరు గ్రామాల్లోనూ రహదారులను మూసివేశారు.logo