ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Mar 10, 2020 , 03:07:45

ఆనందాల హోలీ

ఆనందాల హోలీ

భూపాలపల్లి టౌన్‌/ములుగు, నమస్తేతెలంగాణ : అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి శాంతికి,  సౌభాతృత్వానికి ప్రతీక అయిన రంగుల పండుగను (హోలీ) సోమవారం జయశంకర్‌భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో  ప్రజలు, అధికారులు ప్రజాప్రతినిధులు ఆనందోత్సాహాల నడుమ ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ప్రజల జీవితాలను సప్తవర్ణ శోభితం చేయాలని ఆకాంక్షిస్తూ కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీపాటిల్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజలకు హోలీ పర్వదిన శుభాకాంక్షాలు  తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, ఏఎస్పీ సాయిచైతన్య, ఓఎస్డీ సురేష్‌కుమార్‌, సీఐ దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఎస్సైలు బండారి రాజు, డీవీ ఫణి, భూక్య నరహరి, మహేందర్‌కుమార్‌, సీఆర్పీఎఫ్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీకి ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు హోలీ పండుగ సందర్భంగా రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. హోలీ  పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను ఎస్పీ కట్‌ చేసి ఇతర అధికారులకు, సిబ్బందికి మిఠాయిలను పం చారు. అనంతరం బ్యాండ్‌ బాజాల మధ్య, డీ జే పాటల నడుమ ఆనందోత్సాహలతో హోలీ వేడుకలను ములుగు పోలీస్‌స్టేషన్‌లో అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ పోలీస్‌ అధికారులతో కలిసి స్వయంగా బ్యాండ్‌ వాయిస్తూ నృత్యాలను చేశారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యకు హోలీ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రానికి చెందిన పలువురు ప్రముఖులు, పాత్రికేయులు, ఇతర ఉన్నతాధికారులు  శుభాకాంక్షలు తెలిపా రు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అల్లెం అప్పయ్య, డీడీఎంహెచ్‌వో డాక్టర్‌ పోరిక రవీందర్‌, ఇతర వైద్యులు కలెక్టర్‌ను కలిసి హోలీ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 

ఘనంగా వసంతోత్సవం 

హోలీ పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు వెంకటాపూర్‌, గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(నూగూరు) మండలాల్లో ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు ఆనందోత్సాహాల నడుమ హోలీ పండుగను నిర్వహించుకున్నారు. ప్రజలంతా ఉదయాన్నే వీధుల్లో చేరి ఒకరికొకరు రంగులు పూసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని గజ గజ వణికిస్తున్న కరోనా భయంతో ప్రజలు సామాజిక స్పృహతో వ్యవహరించి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి రసాయనాలు కలిపిన రంగులను వాడకుండా, సహజమైన రంగులనే హోలీ వేడుకల్లో వినియోగించారు. హోలీ సందర్భంగా సెలవుదినం కావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న రామప్ప, లక్నవరం, మల్లూరు, బొగత  ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా కనిపించాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు మండలంలోని కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలోని దేవునిగుట్టపై లక్ష్మీనర్సింహస్వామి జాతరను నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటాపురం(నూగూరు) మండలంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణంలో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు గండ్రకోట శ్రీదేవిసుధీర్‌ యాదవ్‌ ఆధ్వర్యం లో నిర్వహించిన హోలీ వేడుకల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొని ఆనందోత్సాహాల నడుమ హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. 


logo