మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Mar 10, 2020 , 03:03:06

చేపల మార్కెట్లకు స్థలమెక్కడ?

చేపల మార్కెట్లకు స్థలమెక్కడ?

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా జిల్లాలోని పలువురు రెవెన్యూ అధికారుల తీరు ఉంది. జిల్లాలో గొలుసుకట్టు చెరువులు, రిజర్వాయర్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా స్వరాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి, సంక్షేమం కోసం అనేక పథకాలను చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నది. ఏ ఏటికాయేడు జిల్లాలో మత్స్య సంపద వృద్ధి చెందుతున్నప్పటికీ అనువైన మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం జిల్లాలో ఐదుచోట్ల మార్కెట్లను నెలకొల్పడానికి, నిధుల మంజూరుకు సుముఖంగా ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం మార్కెట్ల కోసం కావాల్సిన స్థలాలను కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

ఐదు చేపల మార్కెట్లు

నెలకొల్పుటకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు..

జిల్లాలో ఈ సంవత్సరం 441రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో చేప, రొయ్య పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పోసింది. మత్స్య సంపద వృద్ధి చెందుతున్నది. చేపలు, రొయ్యల విక్రయానికి అనువైనచోట్ల మార్కెట్లను నెలకొల్పుటకు ప్రభుత్వానికి జిల్లా మత్స్యశాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. గణపురం, కాటారం, మహదేవ్‌పూర్‌ మండల కేంద్రాలతో పాటు గణపురం మండలం చెల్పూర్‌, భూపాలపల్లి మండలం పంబాపూర్‌లో చేపల మార్కెట్లను నెలకొల్పడానికి నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి మత్స్యశాఖ కొద్ది నెలల క్రితమే ప్రతిపాదనలు పంపింది. ఒక్కొక్క మార్కెట్‌ యార్డు కోసం రూ.10లక్షల అంచనా వ్యయంతో ఆ ప్రతిపాదనలు వెళ్లాయి. 

స్థలం కేటాయింపు కోసం తహసీల్దార్లకు నివేదన

గణపురం, కాటారం, మహదేవ్‌పూర్‌ మండల కేంద్రాలతో పాటు చెల్పూర్‌, పంబాపూర్‌లో చేపల మార్కెట్లు నెలకొల్పుటకు నాలుగు గుంటల చొప్పున భూమిని కేటాయించాలని ఆయా మండలాల తహసీల్దార్లను జిల్లా మత్స్యశాఖ కోరింది. అయినప్పటికీ స్థలాల కేటాయింపులో సంబంధిత మండలాల తహసీల్దార్లు పట్టించుకోకపోవడం పట్ల మత్స్యకారుల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతున్నది. తహసీల్దార్లు మార్కెట్లకు అవసరమైన భూమి కేటాయిస్తే నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ, తహసీల్దార్లే భూమి కేటాయింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. 

జిల్లాలో ఈ సంవత్సరం రూ.కోటి 17 లక్షల వ్యయంతో చేపపిల్లలు, రొయ్య పిల్లలు వదిలిన మత్స్యశాఖ

జిల్లాలో లక్ష్మీబరాజ్‌, అన్నారం బరాజ్‌, భీంఘన్‌పూర్‌, గణప సముద్రం రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు మొత్తం కలిపి 441 నీటి వనరుల్లో రూ.కోటి 17లక్షలు వెచ్చించి చేప పిల్లలు, రొయ్య పిల్లలను సంవత్సరం మత్స్యశాఖ పోసింది. ఇందులో రూ.కోటి 7లక్షల వ్యయంతో కోటి 50లక్షల చేపపిల్లలు, రూ.10లక్షల వ్యయంతో 6లక్షల70వేల రొయ్య పిల్లలను జిల్లాలోని నీటి వనరుల్లో వదిలింది. 

జిల్లాలో చేపలు, రొయ్యలకు డిమాండ్‌ ఎక్కువే..

పారిశ్రామిక ప్రాంతంగా దినదినాభివృద్ధి చెందుతున్న కార్మిక క్షేత్రమైన భూపాలపల్లితో పాటు జిల్లాలో చేపలు, రొయ్యలకు డిమాండ్‌ ఎక్కువే ఉంది. మత్స్యకారుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో ఎన్నడు లేనివిధంగా భారీ ప్రయోజనాలను చేకూరుస్తున్నది. ప్రధానంగా బరాజ్‌లు, రిజర్వాయర్లు, చెరువుల్లో ఉచితంగా చేపలు, రొయ్య పిల్లలను మత్స్యశాఖ అధికారులు ప్రతీ సంవత్సరం వదులుతున్నారు. ఇదే కాకుండా మత్స్యకారులకు చేపలను వేసుకోవడానికి ట్రేలు, విక్రయించడానికి ద్విచక్ర వాహనాలను పంపిణీ చేసింది. చేపలు పట్టడానికి వలలను కూడా ప్రభుత్వం అందజేసింది. ఇలా, అనేక సంక్షేమ కార్యక్రమాలను మత్స్యకారులకు ఉపాధి కోసం ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తుంది. 

తహసీల్దార్లకు నివేదించాను, భూమి కేటాయించలేదు

భాస్కర్‌, జిల్లా మత్స్యశాఖ ఏడీ 

జిల్లాలోని మహదేవ్‌పూర్‌, కాటారం, గణపురం మండల కేంద్రాలతో పాటు చెల్పూర్‌, పంబాపూర్‌లో చేపల విక్రయానికి మార్కెట్లు నెలకొల్పుటకు ఒక్కో మార్కెట్‌ ఏర్పాటుకు నాలుగు గుంటల చొప్పున భూమిని కేటాయించాలని ఆయా మండలాల తహసీల్దార్లకు ఇప్పటికే రెండుసార్లు లేఖ రాశాను. మొదట 2019 ఆగస్టులో, రెండోసారి అదే ఏడాది అక్టోబర్‌లో, మూడోసారి ఈ నెల మొదటి వారంలో భూమి కేటాయించాలని సంబంధిత తహసీల్దార్లకు లేఖలు రాశాను. ఇప్పటివరకు పైనాలుగు చోట్ల ఎక్కడా భూమి కేటాయించలేదు. భూమిని కేటాయిస్తే మార్కెట్లను నెలకొల్పుటకు నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి మార్కెట్‌కు రూ.10 లక్షల నిధులు మంజూరు చేయాలని ఇదివరకే నాలుగు మార్కెట్లను నెలకొల్పే విషయమై ప్రభుత్వానికి నివేదించాను. 

ఈ విషయం నా దృష్టికి ఇప్పుడే వచ్చింది, భూమి కేటాయించేలా చూస్తాను.. భూపాలపల్లి ఆర్డీవో వైవీ గణేశ్‌

జిల్లాలో నాలుగుచోట్ల చేపల మార్కెట్లు నెలకొల్పుటకు భూములు కేటాయించాలని మత్స్యశాఖ తహసీల్దార్లకు నివేదించిన విషయం ఇటీవల మా దృష్టికి వచ్చింది. పరిశీలన చేసి భూమి కేటాయించేలా చూస్తాను. 


logo