శుక్రవారం 07 ఆగస్టు 2020
Mulugu - Mar 08, 2020 , 02:52:45

సమ్మక్క బరాజ్‌తో సస్యశ్యామలం

సమ్మక్క బరాజ్‌తో సస్యశ్యామలం

ములుగు జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ : జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గోదావరిపై నిర్మిస్తున్న సమ్మక్క బరాజ్‌ ద్వారా వరంగల్‌ జిల్లాకు 75టీఎంసీల నీటిని ప్రతీ ఏటా అందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సాగు నీటి ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని సీఎం కేసీఆర్‌ శనివారం అసెంబ్లీ సమావేశంలో పేర్కొన్నారు. బడ్జెట్‌ సందర్భంగా నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై సీఎం మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే విషయంపై ప్రస్తావించారు. కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల పథకం నిరంతరం నడిచేందుకు అవసరమైన బరాజ్‌ను తుపాకులగూడెం వద్ద రూ.1625 కోట్లతో నిర్మిస్తున్నారు. దేవాదుల పరిధిలోని 6.21లక్షల ఎకరాలతో పాటు ఎస్సారెస్పీ కింద ఉన్న 7.5లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు కీలకం కానుంది. తుపాకులగూడెం వద్ద 92 మీటర్ల ఎత్తుతో 1132మీటర్ల పొడవునా బరాజ్‌ నిర్మాణం చేపడుతున్నారు. కాగా దేవాదులకు దిగువన 83 మీటర్ల ఎత్తుతో 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు. 


ఇటీవల తుపాకులగూడెం బరాజ్‌కు సమ్మక్క పేరును నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇక అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలోని కాళేశ్వరం, సీతారామ, డిండి, పాలమూరు తదితర సాగునీటి ప్రాజెక్టులు గురించి మాట్లాడుతూ సమ్మక్క బరాజ్‌ ద్వారా ఈ ఏడాది వరంగల్‌ జిల్లాకు 75 టీఎంసీల నీటిని అందిస్తామని ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశంలో సమ్మక్క బరాజ్‌ ద్వారా సాగునీటిని ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఏటా సాగు నీటిని అందించే విషయం ప్రస్తావించడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రైతుల్లో హర్హాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటికే బరాజ్‌కు సంబంధించి పనులు 80శాతం పూర్తయ్యాయి. 20 లక్షల క్యూబిక్‌మీటర్ల కాంక్రీటు పని పూర్తి అయింది. కాంక్రీటు పూర్తి చేసేందుకు నీటి పారుదలశాఖ అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. రేడియల్‌ గేట్ల బిగింపు పనులు కూడా కొనసాగుతున్నాయి. పని పూర్తి కావస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్‌ ఏటా సమ్మక్క బరాజ్‌ ద్వారా 75 టీఎంసీల నీటిని అందిస్తామని ప్రస్తావించడంతో దేవాదుల ఎత్తిపోతల పథకం లక్ష్యం నెరవేరనుంది.


logo