మంగళవారం 02 జూన్ 2020
Mulugu - Mar 08, 2020 , 02:52:10

పారిశ్రామిక రంగంలో రాణిస్తున్న మహిళలు

పారిశ్రామిక రంగంలో రాణిస్తున్న మహిళలు

ఏటూరునాగారం, మార్చి 07: మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన మహిళలను కూలీలుగా కాకుండా యాజమానులు చూడాలనే ప్రభుత్వ సంకల్పానికి పునాది పడింది. మహిళలను అన్ని రంగాల్లో రాణించాలనేది మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపెడుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతో  తామేమీ తక్కువ కాము అంటూ మహిళలు సైతం అడుగులు వేశారు. ఇంటి వద్దనే ఉంటూ వివిధ పనులకు వెళ్లే మహిళలు పరిశ్రమ బాట పట్టారు. సబ్బుల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. తయారీలో సక్సెస్‌ అయ్యారు. మండలంలోని శివ్వాపూర్‌లో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జీసీసీ అందిస్తున్న సహకారంతో డిటెర్జంట్‌ సబ్బుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ఇదే గ్రామానికి చెందిన సమ్మక్క-సారక్క జాయింటు లయబిలిటి గ్రూపును ఏర్పాటు చేశారు. 


వీరికి సబ్బుల తయారీలో మూడు నెలల పాటు హైదరాబాద్‌లోని పలు కంపెనీల్లో శిక్షణను జీసీసీ ఆధ్వర్యంలో ఇచ్చారు. పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన మహిళలకు ప్రభుత్వం రూ. 40లక్షలతో యూనిట్‌ను స్థాపించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో రూ. 24లక్షల సబ్సిడీని కూడా ప్రకటించింది. సబ్బుల తయారీ మంచి శిక్షణ పొందిన మహిళలు ముడి సరుకులను తెచ్చుకుని తయారు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌ 12న పరిశ్రమను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. అప్పటి నుంచి సబ్బుల తయారీ నిరాటకంగా  కొనసాగుతోంది. ఇక్కడ  ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధి కలుగుతుంది. యూనిట్‌కు అవసరమైన ఏర్పాట్లను ఐటీడీఏ ద్వారా సమకూర్చారు. యంత్రాలకు అనుగుణంగా గదుల నిర్మాణం, ఇతర ఏర్పాట్లను చేపట్టారు. ఇక పరిశ్రమలో జీసీసీ, ఐటీడీఏ కీలకంగా వ్యవహరించింది. 


జీసీసీ ద్వారా గిరిజన విద్యార్థులకు సరఫరా 

సబ్బుల తయారీకి అవసరమైన మార్కెటింగ్‌ కల్పించేందుకు జీసీసీ వెన్నుదన్నుగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ కేంద్రం ద్వారా 80వేల వరకు సబ్బులు తయారు చేశారు. ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ పాఠశాలు, హాస్టల్స్‌ 80 వరకు ఉన్నాయి. వీటన్నింటికి జీసీసీ ద్వారా నిత్యావసర సరకులను సరఫరా చేస్తున్నారు. ఇక స్థానికంగా సబ్బుల తయారీ కేంద్రం నెలకొల్పడంతో ఇక్కడ నుంచి సబ్బులను కొనుగోలు చేస్తున్నారు. కాగా, ఇందులో ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌ విద్యార్థులకు జీసీసీ ద్వారా ఈ సబ్బులను సరఫరా చేస్తున్నట్లుగా జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఏటూరునాగారం బ్రాంచి పరిధిలో  20వేలు, నర్సంపేట బ్రాంచి పరిధిలో 36వేలు, వెంకటాపురం బ్రాంచి పరిధిలో 10వేల సబ్బులను గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌ విద్యార్థులకు అందచేసేందుకు సరఫరా చేయడం జరిగిందని ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళలను యాజమానులుగా చేయాలనే సంకల్పానికి సబ్బుల తయారీ కేంద్రం నిదర్శనంగా ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. 


logo