శుక్రవారం 05 జూన్ 2020
Mulugu - Mar 07, 2020 , 02:23:18

చుక్‌..చుక్‌ రైలు ఎక్కేద్దాం..

చుక్‌..చుక్‌ రైలు ఎక్కేద్దాం..

రేపటితరం భవిష్యత్‌ తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది. విద్యార్థి భవితను విజ్ఞాన నిలయమే నిర్ణయిస్తుంది.  నాటి సమాజాన్ని..నేటి పోకడలను, చదువుసంస్కారం తరగతి గదే నేర్పిస్తుంది. లక్ష్యం వైపు అడుగులు వేసేలా వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. మహనీయులను  తయారు చేస్తుంది. అలాంటి తరగతి గది..పాఠశాల కొంగొత్త రూపు దాల్చుకొని..సరికొత్త విధానంలో విజ్ఞానాన్ని పంచితే భవిష్యత్‌ పునాదులు మరింత బలంగా నిర్మితమవుతాయి. ఉన్నతమైన సమాజ నిర్మాణానికి ఆస్కారం లభిస్తుంది. సరిగ్గా ఇదే ఆలోచన చేశారు మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండల చిన్ననాగారం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు.

నెల్లికుదురు విలేకరి:మండలంలోని చిన్ననాగారం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం పాఠశాలను ఆకర్షణీయంగా..ఆదర్శంగా తీర్చిదిద్దారు. బడి గోడలే విజ్ఞాన్ని పంచేలా రూపమిచ్చారు. ఈ పాఠశాలలో ఏ గోడను చూసి విజ్ఞానాన్ని పంచుతాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థి ఎక్కడ తిరిగినా ఆలోచనలు రేకెత్తే.. లక్ష్యాన్ని నిర్ణయించే అంశాలతో కూడిన చిత్రాలే దర్శనమిస్తాయి. వీర వనితల గాథలు.. జాతీయ నాయకుల చరిత్ర కళ్లకు కట్టినట్లు సాక్షాత్కరిస్తాయి. విద్యార్థులు చుక్‌...చుక్‌ రైలు ఎక్కెద్దాం..చదువులు బాగా చదివేద్దామనే భావనను కల్పించేలా పాఠశాల భవనాన్ని తీర్చిదిద్దారు. పిల్లల ఉత్తమ భవిష్యత్‌కు తాము సైతం అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, దాతలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.  దీంతో పాఠశాలను అద్భుతంగా..ఉన్నతంగా తీర్చిదిద్దారు. తరగతి గోడలపై పలు అంశాలను రాయించి విద్యార్థులకు సులువైన విద్యాబోధన చేస్తున్నారు. 


రైలుబండి ఆకారంలో పాఠశాల భవనం 

పాఠశాల భవనాన్ని రైలు బండిని తలపించేలా రంగులు అద్దారు. విద్యార్థుల చదువు ప్రయాణం సాఫీగా సాగాలని యోచనతో పాటు విద్యార్థుల్లో కొత్త భావన వచ్చేందుకు ఇలా రూపమిచ్చారు. రైలు బండిని తలపించే పాఠశాల గతంలో కేవలం రాజస్థాన్‌ రాష్ట్రంలో మాత్రమే ఉన్నది. ఇప్పుడు మన రాష్ట్రంలోని చిన్ననాగారంలో ఈ ప్రత్యేక పాఠశాల రూపుదిద్దుకుంది. నెల్లికుదురు-కేసముద్రం ప్రధాన రహదారిపైన ఉన్న ఈ పాఠశాలను అటువైపుగా వెళ్లే వారంతా చూసి సంబురమాశ్చర్యాలకు గురవుతున్నారు. పాఠశాల భవనానికి ముందువై రైలుబండి కలరింగ్‌, వెనక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ వేయించారు.

గోడలే పాఠాలు చెప్పేలా.. 

పాఠశాలలో గోడలే పాఠాలు చెబుతుంటాయి. అందమైన రంగుల్లో, ఆకర్షణీయమైన డిజైన్లతో.. ఆహ్లాదాన్ని పంచే రూపాల్లో విజ్ఞానాన్ని పంచుతుంటాయి. పాఠశాల ఉపాధ్యాయులకు కొత్త పద్ధతిలో విద్యనందించాలనే ఉద్ధేశంతో తరగతి గదుల్లో పాఠ్యంశాలకు సంబంధించిన బొమ్మలు చిత్రించారు. వీటి ఆధారంగానే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెబుతుంటారు. గోడలపైన జాతీయ నాయకులు ఫొటోలు,  ధైర్యానికి ప్రతీకైన వీరవనితల చిత్రాలను గీయించారు. ఒక గదిలో గ్రహాలు, తోక చుక్కలు తదితర వాటిని చూపించే బొమ్మలు, లైబ్రరీలో పుస్తకాలకు సంబంధించిన బొమ్మలు, మరుగుదొడ్లపై పరిశుభ్రతకు సంబంధించిన చిత్రాలు వేయించారు. ఇలా ఆలోచింపజేసే ప్రతి అంశానికి సంబంధించిన బొమ్మలతో పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. 


logo