మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Mar 07, 2020 , 02:17:58

‘27 గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం

‘27 గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం

మందుబాబులం.. మేము మందు బాబులం... లాంటి పాటలు ఆ గ్రామాల్లో వినపడవు. బీరు సీసాలతో కళకళలాడే బెల్టుషాపులు ఆ ఊళ్లలో కనబడవు. దొంగచాటున తెచ్చి మందు పార్టీ చేసుకుందామంటే పట్టపగలు చుక్కలు కనిపించేలా జరిమానా వడ్డిస్తారు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి మహిళల సంకల్పానికి యువత తోడు కావడంతో జనగామలోని 27 గ్రామాల పొలిమేరల్లోకి మద్యం అడుగుపెట్టడం లేదు. పల్లెప్రగతి వేదికగా మహిళలు, యువత ముందుకురావడంతో నాయకులు, గ్రామస్తులు ఏకమై సంపూర్ణ మద్యపాన నిషేధానికి జైకొట్టారు. ఈ మేరకు గ్రామ సభల్లో తీర్మాణాలు చేసుకోవడంతో పల్లెల్లో చైతన్యం వెల్లి విరుస్తున్నది.     

బచ్చన్నపేట:గ్రామీణ ప్రాంతాల్లో యువకులు మద్యానికి బానిసవుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు తాగి ఊగుతున్నారు. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో మద్యం మహమ్మారి చిచ్చు పెడుతున్నది. తాగిన మైకంలో మాటా మాటా పెరిగి గొడవలు జరుగుతున్నాయి. విసిగి వేసారిన మహిళలు, ప్రజలు, పెద్దలు ముందుకు వచ్చి తమ పల్లెలను ప్రశాంత వాతావరణంలో చూడాలని సంకల్పిస్తున్నారు. గొడవలకు కారణమయ్యే మద్యాన్ని నిషేధించేందుకు పట్టుబడుతున్నారు. సర్పంచులపై ఒత్తిడి తెచ్చి గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నారు. మద్యం విక్రయించే వారికి జరిమానా విధిస్తున్నారు. విక్రయించే వారి సమాచారం ఇస్తే నజరానా ప్రకటిస్తున్నారు. ఏడేళ్ల క్రితం కొడవటూరు సర్పంచ్‌ గంగం సతీష్‌రెడ్డి మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టారు. సిద్దేశ్వరస్వామి కొలువుదీరిన సిద్దులగుట్టలో ప్రారంభమైన మద్య నిషేధం నేడు ఏడు గ్రామాల్లో దిగ్విజయంగా కొనసాగుతున్నది. కొడవటూరు, కట్కూర్‌, నారాయణపూర్‌, పోచన్నపేట, సాల్వాపూర్‌, బండనాగారం, వీఎస్‌ఆర్‌ నగర్‌ గ్రామాల్లో ప్రజల సహకారంతో మద్య నిషేధం పక్కాగా అమలవుతున్నది. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొందని స్వయంగా ఆ గ్రామాల ప్రజలు, మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


30 రోజుల ప్రణాళిక స్ఫూర్తితో..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న 30 రోజుల ప్రణాళిక స్ఫూర్తితో ప్రజలు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చారు. గతంలో కొన్ని గ్రామాల్లో మద్యనిషేధం అమలు అవుతుండగా, మరిన్ని గ్రామాల్లో మద్యం నిషేధించేందుకు గ్రామసభల్లో ఏకగ్రీవంగా తీర్మాణాలు చేయించారు. గ్రామంలో మద్యం నిషేధించిన తర్వాత దొంగచాటుగా విక్రయిస్తే రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మద్యం విక్రయించే వారి వివరాలు ఇస్తే నగదు పారితోషికం ఇస్తామని యువతకు, మహిళలకు సూచించారు. అటు బెల్టుషాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. నిషేధం ప్రకటించిన తేదీ నుంచి అమ్మకాలను నిలిపేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒకప్పుడు మద్యం మత్తులో మునిగిన గ్రామాలు నేడు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో నిషేధానికి అందరూ ముందుకొచ్చినా.. కొందరు రాజకీయ స్వార్థం కోసం బెల్టుషాపుల యజమానులతో కుమ్మక్కయ్యారు. ఎక్సైజ్‌ అధికారుల అండదండలతో వ్యాపారం సాగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో మద్యం విక్రయాలు పెరుగుతున్నాయని అధికారులకు సమాచారం అందిస్తే.. వారు ఫిర్యాదుదారులపై ఒత్తిడి తెస్తున్నారని, తద్వారా ఆశయం నీరుగారుతున్నదని ప్రజలు, ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. అక్రమ బెల్టుషాపుల నిర్వహణకు అధికారులే వత్తాసు పలకడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


జిల్లాలోని నిషేధ గ్రామాలు

జనగామ జిల్లాలో పన్నెండు మండలాలు ఉండగా అందులో ఇప్పటి వరకు 27 గ్రామాల్లో మద్య నిషేధం అమలు అవుతున్నది. బచ్చన్నపేట మండలంలో కొడవటూరు, బండనాగారం, కట్కూర్‌, వీఎస్‌ఆర్‌నగర్‌, పోచన్నపేట, నారాయణపూర్‌, సాల్వాపూర్‌, జనగామ మండలంలో వెంకిర్యాల, గోపిరాజ్‌పల్లి, పసరమడ్ల, లింగాలఘన్‌పూర్‌లో జీడికల్‌, గుమ్మడివెల్లి, కల్లెం, సిరిపురం, నేలపోగుల, వనపర్తి, దేవరుప్పుల మండలంలో గొల్లపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో సముద్రాల, రఘునాథ్‌పల్లి మండలం మండెలగూడెం, నర్మెట మండలంలో మలక్‌పేట, హన్మంతాపూర్‌, మాన్‌సింగ్‌తండా, వెల్దండ, జఫర్‌ఘడ్‌ మండలంలో సాగరం, పాలకుర్తి మండలంలో తీగారం, తిర్మలగిరి, తొర్రూర్‌, గ్రామాల్లో నిషేధం కొనసాగుతున్నది. 


logo