శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Mar 07, 2020 , 02:16:07

‘కరోనా’కలకలం

‘కరోనా’కలకలం

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 6 : కరోనా అనుమానిత కేసు జనగామ జిల్లాలో శుక్రవారం కలకలం సృష్టించింది. దుబాయ్‌ నుంచి వచ్చిన లింగాలఘనపురం మండలానికి చెందిన ఒక యువకుడిలో వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమా నించి సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే తొలి కరోనా అనుమానిత వ్యక్తి వెలుగు చూడడం.. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది జిల్లాకు చెందిన యువకుడు కొన్నాళ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లి షార్జా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. శుభకార్యం కోసం రెండురోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన అతను దగ్గు, జలుబుతో బాధపడుతూ జనగామ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానకు చికిత్స కోసం వచ్చాడు. వివిధ పరీక్షలు చేసిన వైద్యులు అది కరోనా అనిమానిత కేసుగా భావించి మాస్క్‌ తొడిగి ఐసోలేషన్‌ ప్రత్యేక వార్డుకు తరలించి, చికిత్సకు సిద్ధవుతున్నారు. ఆందోళనకు గురైన యువకుడు స్నేహితుల వెంట బైక్‌పై ఇంటికి వెళ్లి పోయాడు. సమాచారం అందుకొని అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, వైద్యాధికారుల బృందం పోలీసుల సహాయంతో గ్రామానికి వెళ్లి అనుమానిత యువకుడితోపాటు అతని కుటుంబ సభ్యులను ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. కాగా, కరోనా అనుమానితుడి ఇల్లు, పరిసరాలు సహా గ్రా మంలో పంచాయతీ పారిశుధ్య సిబ్బంది పరిశుభ్రత కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే జిల్లా వ్యాపితంగా యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం.. శాఖల వారీగా అప్రమత్తం చేస్తూ వైరస్‌ నివారణ, లక్షణాలపై విస్తృత ప్రచారం చేస్తున్నది. ఓవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసింది. 

ఆందోళన అక్కర్లేదు..

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజా జీవనాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనాపై జిల్లా యంత్రాంగం అలర్ట్‌ అయింది. చైనా నుంచి విజృంభిచిన వైరస్‌ విదేశాల నుంచి వస్తున్న వారిలో అనుమానితులు ఉండడం ఆందోళన కలిగిస్తుండగా, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. రద్దీ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టింది. ఒకరికొకరు కరచాలనం చేయద్దని.. నమస్కారం చేసుకొని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఐసోలేషన్‌ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి వైద్యులు, సిబ్బందిని నియమించి, మందులు, మాస్క్‌లను అందుబాటులో ఉంచిం ది. కరోనాపై జిల్లాకు చెందిన 10మంది వైద్య సిబ్బందికి అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు పంపింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ముఖాలకు మాస్క్‌లు ధరిస్తూ పరీక్షలకు హాజరవుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్‌ సిబ్బందికి అధికారులు ఉచితంగా మాస్క్‌లు అందజేశారు. బస్టాండ్‌లో వారు శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. 

చైనా మెడికల్‌ విద్యార్థులపై దృష్టి..

జిల్లాకు చెందిన పలువురు వైద్య విద్యార్థులు చైనాలో చదువుతుండడం.. జిల్లా కేంద్రంలోని పట్టుదారం (సిల్క్‌ రీలింగ్‌ యూనిట్‌) మిల్లులో చైనాకు చెందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తుండడంతో వైద్య ఆరోగ్యశాఖ ఆ దిశగా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇటీవల కాలంలో చైనా నుంచి జిల్లాకు ఎవరైనా వైద్య విద్యార్థులు వచ్చారా? వస్తే ఏ ప్రాంతానికి చెందిన వారు..? అన్న విషయాలను అధికారులు సేకరిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పూజారి రఘు, ఆర్‌ఎంవో డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, డీఎంఅండ్‌హెచ్‌వో మహేందర్‌ ఎప్పటికప్పుడు జిల్లాలో కరోనాపై సమీక్షిస్తున్నారు. జిల్లా దవాఖానలోని ప్రత్యేక వార్డులో ఒక ఫిజీషియన్‌, పల్మనాలజీ, స్టాఫ్‌నర్స్‌, సిబ్బందిని నియమించారు. డ్రగ్స్‌, మా స్క్‌లు అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ, రైల్వేస్టేషన్‌ వంటి రద్దీ ప్రాంతాల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని భావించి ఆర్టీసీ అధికారులు బస్సుల్లో రాడ్లు, సీట్లు, పైపులను ప్రత్యేక రసాయనాలతో శుద్ధి చేస్తున్నారు.  


logo