శుక్రవారం 07 ఆగస్టు 2020
Mulugu - Mar 06, 2020 , 02:48:56

రాత్రికి రాత్రే

  రాత్రికి రాత్రే

ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తేతెలంగాణ : ములుగు జిల్లాలో మేడారం జాతర అనంతరం ఇసుక అక్రమ రవాణ యథేచ్ఛగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 44 ఇసుక క్వారీల ద్వారా ఇసుకను నిర్దేశించిన అనుమతుల మేరకు వే బిల్లులు పొంది రవాణా చేయాల్సిన ఇసుకను ఇసుక వ్యాపారులు అక్రమంగా వే బిల్లులు లేకుండా పాత వే బిల్లులతో యథేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణ చేస్తున్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం, మండల కేంద్రాలలోని ఇసుక క్వారీల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నప్పటికీ ఇసుక రవాణా అవుతున్న మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు నామమాత్రపు తనిఖీలతో వే బిల్లులు లేకుండానే లారీలను దాటవేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్రాహ్మణపల్లి, తాడ్వాయి, పస్రా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల ద్వారా రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు వే బిల్లులు లేని అక్రమ ఇసుక తరలించే వాహనాలు భారీగా దాటిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 44 ఇసుక క్వారీలలో చేస్తున్న ఇసుక వ్యాపారానికి చెల్లించాల్సిన జీఎస్టీ బిల్లు రూ. 3కోట్ల మేరా పేరుకుపోయినట్లు సమాచారం. జిల్లాలో మరో 13 నూతన ఇసుక క్వారీలకు అనుమతులు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సన్నహాలు చేస్తున్నది. 


వే బిల్లులు లేకుండానే ఇసుక రవాణా 

జిల్లాలోని ఇసుక క్వారీల ద్వారా అనుమతులు తీసుకుని డీడీలు చెల్లించి వే బిల్లులు పొందిన లారీలకు మాత్రమే ఇసుకను లోడు చేయాల్సి ఉండగా అక్రమ మార్గంలో ఇసుక మాఫియా సిండికేట్‌గా ఏర్పడి 44 ఇసుక క్వారీల ద్వారా ఎలాంటి వే బిల్లులు లేకుండానే ఇసుక అక్రమ దందాను కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని పలు మండలాల నుంచి ఇసుక రవాణాను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇసుక రవాణా చేసే ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు పాత వే బిల్లులను చూపించి చెక్‌పోస్టుల ద్వారా యథేచ్ఛగా ఇసుక అక్రమ  రవాణాను కొనసాగిస్తున్నారనే చర్చ సాగుతున్నది. ప్రతిరోజు కంప్యూటర్‌ వే బిల్లుల ద్వారా చెల్లింపులు జరిగి అనుమతులు ఉన్న వాహనాలను మాత్రమే చెక్‌పోస్టుల నుంచి తమ నిర్దేశిత ప్రాంతాలకు పంపించే చెక్‌పోస్టు సిబ్బంది ఇవేవి పట్టకుండానే దాటిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 


అంతా రాత్రే 

జిల్లాలో ఇసుక క్వారీల ద్వారా రావాణా అయ్యే ఇసుకను లారీల ద్వారా ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండా నిర్ధిష్టమైన సమయం ప్రకారం చెక్‌పోస్టు నుంచి యథేచ్ఛగా దాటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని చెక్‌పోస్టుల నుంచి రాత్రి 2 గంటల నుంచి ప్రారంభించి 4 గంటల వరకు అనుమతులు, వే బిల్లులు లేని ఇసుక లోడ్‌ వాహనాలను యథేచ్ఛగా చెక్‌పోస్టు  సిబ్బంది దాటిస్తూ మామూళ్ల రూపంలో తమ జేబులు నింపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియా చెక్‌పోస్టు వద్ద పనిచేసే సిబ్బందిని మంచిక చేసుకుని తమ వాహనాల నంబర్లను వారికి ముందస్తుగానే చేరవేసి వాహనాలు చెక్‌పోస్టుకు చేరుకునే సమయానికి సిబ్బందికి చేరవేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇసుక అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారనే చర్చ సాగుతున్నది.


అనుమతులు ఉన్న వారికి మొండి చేయి 

ఇసుక రవాణా కోసం క్యూబిక్‌ మీటర్‌కు నిర్దేశించిన రుసుమును చెల్లించి అనుమతులు ఉండి అవసరం ఉన్న ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుకను ఇసుకను సకాలంలో సరఫరా చేయడంలో అధికార యంత్రాంగం విఫలం చెందిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుక కోసం క్యూబిక్‌ మీటర్‌కు రూ.160 చొప్పున చెల్లించి నెలలు గడుస్తున్నప్పటికీ ఇసుకను సరఫరా చేయడంలో స్థానిక అధికారులు నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక కోసం కట్టిన డీడీలను చూపించిన సంబంధిత ఉన్నతాధికారులతో లేఖలు పెట్టించిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక సరఫరా లేకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం పథకాలతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలన్ని నిలిచిపోయాయని సంబంధిత కాంట్రాక్టర్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


44 ఇసుక క్వారీలు 

జిల్లాలో 44 ఇసుక క్వారీల ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 44 ఇసుక క్వారీలు నిర్దేశించిన సోసైటీల ద్వారా అనుమతి పొంది సంబంధిత కాంట్రాక్టర్‌ను ఇసుకను ప్రభుత్వ  నిబంధనల మేరకు నగదును చెల్లించి ఇసుకను రవాణా చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఏటూరునాగారం మండలంలో 20 ఇసుక క్వారీలు, మంగపేటలో 8, తాడ్వాయిలో 2, వాజేడులో 8, వెంకటాపురం(నూగూరు)లో 6 ఇసుక క్వారీల ద్వారా ఇసుకను రవాణా జరుగుతోంది.


పేరుకుపోయిన జీఎస్టీ బిల్లు 

జిల్లా వ్యాప్తంగా 44 ఇసుక క్వారీల ద్వారా చేస్తున్న ఇసుక రవాణాకు సంబంధించిన లావాదేవీలకు చెల్లించే జీఎస్టీ బిల్లు భారీగా పేరుకుపోయినట్లు సమాచారం. జిల్లాలోని 44 ఇసుక క్వారీల ద్వారా రవాణా అయిన మొత్తం వ్యాపారానికి రూ.3 కోట్ల మేర జీఎస్టీ బిల్లులు పేరుకుపోయినట్లు సమాచారం. జీఎస్టీ బిల్లులను గుత్తేదారులు సకాలంలో చెల్లిస్తే తిరిగి జీఎస్టీ బిల్లు గుత్తేదారులకు చెల్లింపులు జరుగుతాయని అధికారులు చెప్పినప్పటికీ గుత్తేదారులు జీఎస్టీ బిల్లులు చెల్లించడంతో ఉత్సాహం చూపించకుండా దాటవేత దోరణి అవలంభిస్తున్నారని తెలుస్తున్నది. జీఎస్టీ అధికారులు దాడులు కొనసాగిస్తే ఇసుక వ్యాపారం చేసే కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పవనే జీఎస్టీ నిపుణులు వెల్లడిస్తున్నారు. 


పలు వాహనాల సీజ్‌  

జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పలు వాహనాలను అధికారులు పట్టుకుని సీజ్‌ చేసినట్లు సమాచారం. మంగపేట మండలంలో బ్రాహ్మణపల్లి చెక్‌పోస్టు వద్ద 2 లారీలు ఎలాంటి వే బిల్లులు లేకుండానే ఇసుకను తరలిస్తున్న విషయాన్ని గమనించిన చెక్‌పోస్టు సిబ్బంది వే బిల్లులు పాతవని గుర్తించి రెండు లారీలను సీజ్‌ చేశారు. అదేవిధంగా తాడ్వాయి మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను అటవీ శాఖ అధికారులు సీజ్‌ చేశారు. వాజేడు మండలంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇసుక డంపులను స్థానిక రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. ప్రస్తుతం వారంలోనే ఇన్ని సంఘటనలు చోటు చేసుకోగా జనవరి నుంచి మొదలుకుని మార్చి వరకు ఇలాంటి ఇసుక అక్రమ రవాణా ఎంత జరిగిందనేది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెలలో ఖమ్మం జిల్లా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 5 ఇసుక లారీలను పస్రా చెక్‌పోస్టు సిబ్బంది పట్టుకుని వదిలివేసినట్లు చర్చ సాగుతున్నది. logo