మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Mar 05, 2020 , 02:47:15

అన్నదాతకు మేలు

అన్నదాతకు మేలు

సుబేదారి, మార్చి 04: అందరం కలిసికట్టుగా వరంగల్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు పూర్వ వైభవం తీసుకువచ్చి రైతులకు మేలుచేద్దామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన డీసీసీబీ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం హన్మకొండ డీసీసీబీ భవనంలో జరిగింది. తొలుత చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, వైస్‌ చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్‌కు చెందిన నేతలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై పాలకమండలి సభ్యులను సన్మానించి అభినందించారు. అనంతరం బ్యాంకు అవరణలో చైర్మన్‌ రవీందర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ ముఖ్యఅతిథిలుగా హాజరై మాట్లాడారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు పంటసాగు కోసం అరిగోస పడేవారని, కరంట్‌, బోర్లలో నీరు లేక చేతికొచ్చిన పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉండేదన్నారు. ఇంజినీరుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి, కాంగ్రెస్‌ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూడేళ్ల వ్యవధిలో పూర్తిచేసి తెలంగాణలో 80 శాతం సాగునీరందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని అన్నారు. వచ్చే ఏడాదిలోగా ప్రతి ఎకరాకు నీరు అందుతుందని, ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో సస్యశామలమవుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా సీఎం కేసీఆర్‌ తీర్చిదిద్దారన్నారు. 


కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు, రైతుబంధుతో పంట పెట్టుబడి సాయం, అనుకోని పరిస్థితుల్లో రైతు చనిపోతే రూ. 5 లక్షల బీమా సౌకర్యం, 24 గంటల కరంట్‌ ఇస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. వరంగల్‌ డీసీసీబీ బ్యాంకును కొంతమంది దోచుకుతిన్నారని, సొంత ఆస్తులు పెంచుకున్నారని మండిపడ్డారు. జరిగిన అవినీతిపై విచారణ జరుగుతున్నదని అన్నారు. ఇక ముందు కొత్త పాలకవర్గం అంకితభావంతో బ్యాంకు అభివృద్ధిపై దృష్టిసారించాలని సూచించారు. కొత్తపాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికకావడం చాలా సంతోషంగా ఉందని, డీసీసీబీకి చరిత్ర ఉందని, దానిని నిలబెట్టాలని అన్నారు. తన రాజకీయ జీవితం పీఏసీఎస్‌ చైర్మన్‌తోనే ప్రారంభమైదని, అలాగే చైర్మన్‌ రవీందర్‌రావు పీఏసీఎస్‌ చైర్మన్‌ నుంచి ఎదిగినవాడేనని, అందరం కలిసి బ్యాంకు పేరు నిలబెడదామని మంత్రి పాలకమండలి సభ్యులకు పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక మాంధ్యం ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్‌ వచ్చే బడ్జెట్‌లో రైతు రుణమాఫీకి నిధులు కేటాయించనున్నారని మంత్రి స్పష్టంచేశారు. 


logo