శుక్రవారం 07 ఆగస్టు 2020
Mulugu - Mar 05, 2020 , 02:42:40

భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

భూపాలపల్లి టౌన్‌, మార్చి 04 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం బుధవారంతో అధికారికంగా ముగిసింది. పట్టణ ప్రగతి ఆగదు.. నిరంతరం కొనసాగుతుంది.. గుర్తించిన సమస్యలపై ఇక నుంచి దృష్టి పెడుదాం.. అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి 16, 18, 19 వార్డుల (ఎల్బీనగర్‌, గాంధీనగర్‌, రాంనగర్‌, బానోతువాడ)లో పట్టణ ప్రగతి సందర్భంగా పర్యటించారు.  జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌తో కలిసి ఎమ్మెల్యే వార్డుల్లో తిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గాంధీనగర్‌, ఎల్బీనగర్‌ మధ్య ఉన్న మురికి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. మురికి నీటి కాల్వలో నుంచి తాగునీటి పైపులైన్‌ వెళ్లడం గమనించారు. పైపులైన్‌ లీకేజీ అయితే పరిస్థితేంటని, ప్రజల ఆరోగ్యంపై ఏమాత్రం పట్టించుకోరా అంటూ ఎమ్మెల్యే అధికారులపై మండిపడ్డారు. వెంటనే పైపులైన్‌ను మార్చాలని ఆదేశించారు. అనంతరం గాంధీనగర్‌లోని తేజా హైస్కూల్‌ ముందు ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి వేదికపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పది రోజుల్లో పట్టణ ప్రగతి ద్వారా అన్ని వార్డుల్లో గుర్తించిన సమస్యలన్నీ పరిష్కరిద్దాం, పరిష్కారానికి ప్లాన్‌ చేయండి, కౌన్సిల్‌లో పెట్టి తీర్మానం చేయాలన్నారు. మున్సిపల్‌ సిబ్బంది, అధికారులు సీరియస్‌గా పని చేయాలని అన్నారు. కమిషనర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నిత్యం వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలన్నారు. భూ ఆక్రమణలపై సీరియస్‌గా వ్యవహరించి ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాస్‌ పుస్తకాలను రైతులకు వెంటనే అందించాలన్నారు. నర్సరీలు పెంచి వార్డుల్లో అవసరమైన వారందరికీ మొక్కలు పంపిణీ చేయాలన్నారు. 


పట్టణంలో మార్పు తీసుకొస్తా : జిల్లా కలెక్టర్‌ 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 60శాతం మార్పు తీసుకొస్తాననే నమ్మకం ఉందని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. సమస్యలపై దృష్టి సారిస్తున్నామన్నారు. కుందూరుపల్లిలో ఒకటి, బాంబులగడ్డలో ఒకటి, భారీ ఆర్చ్‌ ఏర్పాటు చేసి స్వాగత తోరణం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పల్లెల్లో పన్నుల వసూళ్లు వందశాతం పూర్తయ్యాయి. మున్సిపాలిటీలోనూ పన్నుల వసూళ్లపై వేగం పెంచాలన్నారు. పట్టణంలో ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలు, వెండింగ్‌ జోన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, ఆర్డీవో వైవీ గణేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌యాదవ్‌, మున్సిపల్‌ కమీషనర్‌ సమ్మయ్య, వార్డు కౌన్సిలర్లు నాగుల శిరీష దేవేందర్‌రెడ్డి, దాట్ల శ్రీనివాస్‌, కురిమిళ్ల రజిత శ్రీనివాస్‌తో పాటు ఇతర వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. 


logo